రిజర్వ్ బ్యాంకు గత వారం రెపో (ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే రేటు), రివర్స్ రెపో (బ్యాంకులు వాటి అధిక నిధులను ఆర్‌బీఐ వద్ద జమ చేసిన సందర్భాల్లో ఆ నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ) రేట్లను స్వల్పంగా పెంచి మార్కెట్ వర్గాలను ఒకింత ఆశ్చర్యపర్చింది. రెపో రేటు 4.75 శాతం నుంచి 5 శాతానికి, రివర్స్ రెపో రేటు 3.25 శాతం నుంచి 3.50 శాతానికి ఎగశాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను పరపతి విధాన సమీక్ష కన్నా ముందే పెంచవచ్చన్న వూహాగానాలు ఉన్నప్పటికీ ఇంత ముందుగా పెంచుతుందని పలువురు వూహించలేదు. 2008 డిసెంబరులో రెపో రేటు 6.50 శాతం ఉండగా అప్పటి నుంచి ఆర్‌బీఐ కిందటి ఏప్రిల్ దాకా అంచెలంచెలుగా 4.75 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటును కూడా ఇదే సమయంలో 5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించింది. దాదాపు 15 నెలల అనంతరం తిరిగి ఈ రేట్ల పెంపునకు చొరవ తీసుకుంది. గత జనవరిలో జరిగిన మూడో త్రైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని 5 నుంచి 5.75 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తద్వారా భవిష్యత్తులో కీలక వడ్డీరేట్ల పెంపు అనివార్యమనే సంకేతాలు పంపింది. ద్రవ్యోల్బణ అంచనాలు తారుమారు
గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సున్నా కంటే దిగువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ ఆర్‌బీఐ అంచనాలను తారుమారు చేసింది. 2010 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 5 శాతానికి చేరవచ్చని గతంలో ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం 8.5 శాతానికి చేరవచ్చని అభిప్రాయపడింది. వాస్తవానికి ద్రవ్యోల్బణం పైపైకి దూసుకుపోతూ 10 శాతానికి చేరువ కావడం సర్వత్రా ఆందోళనకు తావు ఇచ్చింది. ప్రస్తుతానికి ఆర్‌బీఐ ఏకైక అజెండా ద్రవ్యోల్బణాన్ని అరికట్టే చర్యలు తీసుకుంటూ వృద్ధిరేటును కొనసాగించే వాతావరణాన్ని సృష్టించడమే. ఇప్పటిదాకా ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షకు నెల రోజుల ముందు కీలక రేట్ల పెంపునకు తెర తీసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ కీలక రేట్లను సమీప భవిష్యత్తులో పలు విడతలు పెంచే అవకాశం ఉంది. ఈ చర్యల వల్ల ద్రవ్యోల్బణం ఎంతవరకు అదుపులోకి వస్తుందన్నది అనుమానాస్పదమే. 
బ్యాంకులు వెంటనే స్పందించవేమో
సాధారణ పరిస్థితుల్లో ఆర్‌బీఐ కీలక రేట్ల పెంపునకు వాణిజ్య బ్యాంకులు వెంటనే స్పందించి వాటి వడ్డీరేట్ల పెంపునకు రంగం సిద్ధం చేసేవి. తాజా పరిస్థితుల్లో వెంటనే వడ్డీరేట్లు పెంచేందుకు బ్యాంకులు సిద్ధంగా లేవు. వాటి వద్ద నిధులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వితరణ ఆశించిన మేరకు పెరగలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడుతుండటంతో బ్యాంకులు వాటి రుణవితరణ లక్ష్యాలను చేరుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు, బడా వ్యాపార సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు పెద్ద మొత్తాల్లో స్వల్పకాలిక రుణాలను తక్కువ వడ్డీరేట్లపై అందించేందుకు పోటీ పడుతున్నాయి. కొన్ని బ్యాంకులు రుణవితరణపైనే ఆధారపడకుండా అధిక నిధులను రివర్స్ రెపో మార్గంలో వెచ్చిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి బ్యాంకుల రుణవితరణ 16 శాతం వృద్ధి చెందవచ్చన్న ఆర్‌బీఐ అంచనాలకు, ప్రస్తుత పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఇప్పటికిప్పుడు వడ్డీరేట్లను పెంచేందుకు సాహసించవు. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో వారంలో ముగుస్తున్న తరుణంలో బ్యాంకులు వడ్డీరేట్ల పెంపుపై దృష్టిసారించే అవకాశం లేదు. 
సమీప భవిష్యత్తులో..
బ్యాంకులు వాటి వడ్డీరేట్లను ఇప్పుడే పెంచకపోయినప్పటికీ సమీప భవిష్యత్తులో పెంపు తథ్యమన్న సంకేతాలు అందుతున్నాయి. ఏప్రిల్ 20న ఆర్‌బీఐ ప్రకటించనున్న పరపతి విధానంలో కీలకరేట్ల పెంపు మరో విడత ఉండే అవకాశం లేకపోలేదు. చాలా బ్యాంకులు వాటి వడ్డీరేట్ల పెంపుపై పరపతి విధాన సమీక్ష వరకు వేచి ఉండాలని భావిస్తున్నాయి. అటు డిపాజిట్లపైన, ఇటు రుణాలపైన వడ్డీరేట్లను దాదాపు అన్ని బ్యాంకులు పెంచుతాయి. అయితే ఒకేసారి బ్యాంకులన్నీ మూకుమ్మడిగా వాటి వడ్డీరేట్లను పెంచే పరిస్థితి ఉత్పన్నం కాదు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు వాటి డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.25 శాతం నుంచి 0.75 శాతం దాకా పెంచాయి. ముఖ్యంగా ఈ బ్యాంకులు వాటి నికర వడ్డీ మార్జిన్లను కాపాడుకునేందుకు ముందుగా రుణాలపై వడ్డీరేట్లను పెంచవచ్చు. ఈ వరుస క్రమంలో ప్రైవేటు బ్యాంకులు ముందు నిలవొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతో పాటు మరికొన్ని ప్రైవేటు బ్యాంకులు వాటి రుణాలపై వడ్డీరేట్లను ముందుగా పెంచే అవకాశం ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకుల విషయానికొస్తే.. ప్రముఖ బ్యాంకులన్నీ ఏప్రిల్ తరువాతే పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చు. 
పావు శాతం నుంచి అర శాతం లోపు
భవిష్యత్తులో వడ్డీరేట్ల పెంపు అనివార్యమైనప్పటికీ ఈ పెంపు స్వల్పంగా ఉండవచ్చు. ఇప్పుడిప్పుడే వృద్ధి బాటపట్టిన పారిశ్రామికరంగం, ఉత్పాదక రంగం, బలపడుతున్న మార్కెట్ సెంటిమెంట్‌కు మరింత వూతం ఇచ్చి ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేయాలంటే వడ్డీరేట్లు తక్కువస్థాయిలో ఉండాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లు 0.25 శాతం నుంచి 0.50 శాతం లోపు పెరగవచ్చు. రుణవితరణ పెంచుకునేందుకు నానాటికీ పెరుగుతున్న పోటీ కారణంగా బ్యాంకులు వాటి రుణ పథకాలను, తక్కువ వడ్డీపై సాధ్యమైనంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. రిటైల్ రుణాలపై కూడా బ్యాంకులు వడ్డీరేట్లను పెద్దగా పెంచే అవకాశం లేదు. రుణ గిరాకీని బట్టి నిధుల లభ్యత ఆధారంగా భవిష్యత్తులో బ్యాంకులు వాటి వడ్డీరేట్లలో మార్పులు చేయవచ్చు.