వచ్చే ఏడాది 8.5% వృద్ధి
బెంగళూరు: అంతర్జాతీయ సంక్షోభం చుట్టుముట్టిన నేపథ్యంలో ప్రజలు ఆర్థికపరమైన అంశాలపై అవగాహనను పెంచుకోవడం అత్యవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. నష్టభయాన్ని ముందస్తుగా అంచనా వేయకుండా క్లిష్టమైన ఫైనాన్షియల్ ఉత్పత్తుల్లో ప్రజలు పెట్టుబడులు పెట్టడం వల్లే ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన సంగతిని గుర్తుచేశారు. రిజర్వ్ బ్యాంక్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్‌ల ఆధ్వర్యంలో ఆర్థిక విద్యపై సోమవారమిక్కడ ఏర్పాటుచేసిన వర్క్‌షాప్‌లో మంత్రి ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.2 శాతానికి, వచ్చే ఏడాది 8.5 శాతానికి చేరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. ఆర్థిక వృద్ధిరేటును పరుగెత్తించేందుకు ద్రవ్య సాధనాల వినియోగంలో నేటికీ వెనుకబడి ఉన్న మరిన్ని వర్గాల ప్రజల చెంతకు ద్రవ్య అక్షరాస్యతను తీసుకెళ్లేందుకు పటిష్టమైన విధానాలను విధానకర్తలు రచించాలని ప్రణబ్ సూచించారు.