ఏడాదికి రూ. 650 కోట్ల ఆదాయానికి గండి
సొంతంగా విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు యోచన

ఏడెనిమిదేళ్లుగా ఇదే స్థితి: కేజీ బేసిన్‌లో సహజవాయువును కనుగొనేందుకు ఓఎన్‌జీసీ భారీగా ఖర్చుచేసింది. ఒక్కో బావి నిర్మాణానికి రూ.50 కోట్ల వరకు వెచ్చించింది. అయిదేళ్ల వరకు వీటినుంచి సహజవాయువు వెలికి తీయవచ్చని అంచనా. కొన్ని బావులు ప్రధాన గొట్టపు మార్గానికి దూరంగా (ఐసోలేటెడ్ వెల్స్) ఉంటాయి. ఇప్పటికే సమీపంలో బావులుండి... అక్కడి నుంచి ఒక ప్రధాన పైపులైను ఉండి ఉంటే ఈ గ్యాస్‌ను తరలించే అవకాశం ఉండేది. కానీ ఈ బావులు ప్రధాన పైపులైనుకు సుమారు ఏడెనిమిది కిలోమీటర్లకు పైగా దూరంగా ఉండటం వల్లే ఈ సమస్య వచ్చి పడింది. అవసరమైన సంస్థలకు గ్యాస్ సరఫరా చేయలేక ఓఎన్‌జీసీ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. ఇలాంటివి తూర్పుగోదావరి జిల్లాలో 9 బావులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 6 ఉన్నాయి. ఒక్కో బావి నుంచి ఏడాదికి రూ. 30 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అంటే ఈ 22 బావుల నుంచి ఏడాదికి రూ. 650 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఏడెనిమిదేళ్లుగా బావులు ఇలానే ఉంటున్నాయి. ఏటా రెండు, మూడు బావులు అదనంగా వచ్చి చేరుతున్నాయి.
ఇవీ ఇబ్బందులు: సహజవాయువు పొందాలనుకునే సంస్థలు భారీగా ఖర్చు చేసి గొట్టపు మార్గాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ధైర్యం చేసినా, సహజవాయువు ఒత్తిడి తక్కువగా ఉంటే, సంబంధిత పరిశ్రమలకు సరఫరా కాదు. కొన్ని బావుల్లో గ్యాస్ కొనుగోలుకు రాజకీయ ఒత్తిళ్లు అడ్డంకిగా ఉన్నాయని సమచారం.
గుజరాత్‌లో భిన్నం: గ్యాస్ నిల్వలకు సమీపంలో ఏదైనా పరిశ్రమ స్థాపించి, నిర్వహించవచ్చు. గుజరాత్‌లోని పారిశ్రామిక వేత్తలు ఇలానే చేస్తున్నారు. కేజీ బేసిన్ పరిధిలో ఎవరూ అలా ముందుకు రావడంలేదని ఓఎన్‌జీసీ వర్గాలు చెబుతున్నాయి.
సొంతగా విద్యుత్తు ప్రాజెక్టులు!: సహజవాయువు సద్వినియోగానికి ఆయా బావుల సమీపంలో చిన్నపాటి విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే యోచన కూడా ఓఎన్‌జీసీలో ఉన్నట్లు సమాచారం. కానీ దీనిపై ఆ సంస్థలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో ఆయా బావులకు సమీపంలో మరిన్ని బావులు తవ్వి, పైపులైను నిర్మాణం జరిగితేనే, సహజవాయువు సద్వినియోగం అవుతుంది.