మౌలికం పనితీరు భేష్
500 బి.డాలర్లకు చేరువలో పెట్టుబడులు
న్యూఢిల్లీ: పదకొండో పంచవర్ష ప్రణాళిక(2007-12)లో మౌలిక పెట్టుబడులు 500 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.23,50,000 కోట్లు)లక్ష్యానికి చేరువవుతాయని ప్రణాళిక సంఘం పేర్కొంది. 'మౌలిక రంగంలో పెట్టుబడుల లక్ష్యాన్ని పూర్తిగా చేరకపోయినా.. దానికి చేరువవుతాం. దానికి కారణం టెలికాం రంగం సాధించిన ప్రగతే'నని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా పేర్కొన్నారు. మంగళవారం(నేడు) ప్రణాళిక సంఘం పూర్తి స్థాయి సమావేశం ప్రధాని అధ్యక్షతన జరగనున్న నేపథ్యంలో మాంటెక్ సోమవారమిక్కడ మాట్లాడారు. 11వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక పెట్టుబడులకు ప్రణాళిక సంఘం 500 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని విధించిన సంగతి తెలిసిందే. రోడ్ల రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 4000 కి.మీ. రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టులు ఇచ్చినట్లు.. వచ్చే ఆర్థిక సంవత్సరం 7000 కి.మీ. నిర్మాణానికి కాంట్రాక్టులు ఇస్తామని.. ప్రైవేటు పెట్టుబడుదారులు ఈ విషయంలో ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. విద్యుత్ రంగం కూడా పదో పంచ వర్షప్రణాళికతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తోందన్నారు. ఒక్క నౌకాశ్రయాల రంగమే సరైన పనితీరును కనబరచడం లేదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 8.5 శాతానికి చేరొచ్చని అన్నారు. ఆ తర్వాతి ఏడాది అది 9 శాతానికి చేరొచ్చనీ మాంటెక్ అంచనా వేశారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 2008-09లో జీడీపీ 6.7 శాతానికి కుంగిన విషయం తెలిసిందే. అంతక్రితం మూడేళ్లలో వృద్ధి 9 శాతాన్ని కొనసాగించడం గమనార్హం.