Tuesday, March 2, 2010

త్రీజీ సర్విసులురేపటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ మూడోతరం సేవలు


రేపటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ మూడోతరం సేవలు
ఒకర్నొకరు చూస్తూ మాట్లాడుకోవచ్చు
సెల్‌ఫోన్‌లో లైవ్‌ టీవీ
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సమాచారరంగంలో విప్లవం సృష్టించిన సెల్‌ఫోన్లు రేపట్నుంచి మరో సరికొత్త విప్లవానికి నాంది పలుకనున్నాయి. మొబైల్‌లో ఒకర్నొకరు చూస్తూ మాట్లాడుకోవటం, క్షణాల్లో ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేయటం, సెల్‌ఫోన్‌లో టీవీ చూడటం వంటి సౌకర్యాలను ఈ సరికొత్త విప్లవం మన ముందుకు తీసుకురానుంది. ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చే మూడోతరం సేవలను (త్రీజీ సర్వీసులు) బుధవారం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రారంభించనుంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమం దీనికి వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ టెలికం సీజీఎం సుధీంద్రకుమార్‌ తదితరులు హాజరుకానున్నారు. త్రీజీ సేవలు తొలుత హైదరాబాద్‌ టెలికం పరిధిలో (రంగారెడ్డి, హైదరాబాద్‌ జంటనగరాలు, మెదక్‌) అందుబాటులోకి వస్తాయి. త్రీజీ సేవల కింద సుమారు 5 లక్షల కనెక్షన్లు ఇవ్వడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. డిమాండ్‌ మేరకు కనెక్షన్ల సంఖ్య పెంచే అవకాశం ఉంది.
సదుపాయాలు
* అవతలివ్యక్తిని సెల్‌ తెరపై చూస్తూ ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు (వీడియోకాల్‌). ఆన్‌లైన్‌లో టీవీ. మల్టీమీడియా, అధిక వేగంతో కూడిన మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌. ఈ-మెయిల్‌, వీడియో, ఆడియో డౌన్‌లోడ్‌.
* డౌన్‌లోడ్‌ వేగం 384 కేబీపీఎస్‌ నుంచి 8 ఎంబీపీఎస్‌ వరకు ఉంటుంది. ఈ నెట్‌వర్క్‌కు సెక్యూరిటీ అధికం.
* మొబైల్‌ను ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌కు యూఎస్‌బీ కేబుల్‌, బ్లూటూత్‌, ఇన్‌ఫ్రారెడ్‌ ద్వారా అనుసంధానం చేసి నెట్‌ను వినియోగించుకోవచ్చు.
* ఒక ఎంబీ వీడియో డౌన్‌లోడ్‌కు పట్టే సమయం నిమిషం మాత్రమే. ఎంత పెద్ద ఫైళ్లనైనా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* త్రీజీ సేవలు పొందాలంటే ప్రత్యేకమైన ఫోను అవసరం.రూ.5 వేల నుంచి లభిస్తున్నాయి.
* ప్రస్తుత సాధారణ సిమ్‌కార్డులతో త్రీజీ సర్వీసులు పొందలేము. దీనికోసం ప్రత్యేకంగా యూసిమ్‌ (యూనివర్సల్‌ సబ్‌స్క్రైబర్‌ ఐడెంటిఫికేషన్‌ మోడ్యూల్‌) కావాలి. సిమ్‌ సామర్థ్యం 256 కిలోబైట్‌ (కేబీ) ఉండాలి. వీటిని బీఎస్‌ఎన్‌ఎల్‌ సరఫరా చేస్తుంది.
* ప్రస్తుతమున్న సిమ్‌కార్డులు 16కె, 32కె ఉన్నాయి. 32కే సిమ్‌ సహాయంతో ఎడ్జ్‌ టెక్నాలజీ ద్వారా జీపీఆర్‌ఎస్‌ సేవలు పొందవచ్చు.
* ప్రస్తుతానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే త్రీజీ సర్వీసులు అందిస్తున్నందున ఇతర కంపెనీల మొబైల్‌ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.