Tuesday, March 2, 2010

పెట్రో ధరలోతగ్గించం : తెగేసి చెప్పిన ప్రధాని


తెగేసి చెప్పిన ప్రధాని
పాక్‌ కలిసొస్తే ఇద్దరికీ మేలు
పొరుగువారితో శాంతి, స్నేహాలనే కోరతాం
సౌదీ పర్యటనలో మన్మోహన్‌ స్పష్టీకరణ
ప్రధాని ప్రత్యేక విమానంలో: పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించే ప్రసక్తి లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. వీటి ధరలు తగ్గించే విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకోలేదన్నారు. ''ఏ వస్తువులకు ధరలు పెరిగినా ప్రజలు ఇబ్బంది పడతారు, కానీ.. దానిని మనం దీర్ఘదృష్టితో చూడాలి'' అని పేర్కొన్నారు. మూడురోజుల సౌదీఅరేబియా పర్యటన ముగించుకుని భారత్‌ తిరిగి వస్తూ ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాకర్షక ఆర్థిక విధానాలతో దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు హాని తప్పదన్నారు. అన్నీ ఇలాంటి విధానాలనే అమలు చేస్తే ద్రవ్యోల్బణం నుంచి ప్రజలను కాపాడలేమని పేర్కొన్నారు. ఇవి పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు సభ గౌరవాన్ని తగ్గించిందని ప్రధాని విమర్శించారు.

వ్యూహాత్మక భాగస్వామ్యంపై 'రియాద్‌ డిక్లరేషన్‌'
రియాద్‌: పాకిస్థాన్‌ ఉగ్రవాదుల విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిందేనని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తేల్చిచెప్పారు. అప్పుడే.. పాక్‌తో మరింత దగ్గరవ్వడానికీ భారత్‌ సిద్ధపడుతుందని స్పష్టం చేశారు. సౌదీ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన సౌదీ కన్సల్టేటివ్‌ కౌన్సిల్‌ 'మజ్లిస్‌ ఆల్‌శూరా'లో ప్రసంగించారు. సౌదీరాజుకు సలహాలిచ్చే ఈ కౌన్సిల్‌లో ప్రధాని ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ''మేం పాకిస్థాన్‌తో సహకారాత్మక సంబంధాలను ఆశిస్తున్నాం. శాశ్వతశాంతి స్థాపన మా లక్ష్యం. ఇరుదేశాల మధ్య సహకారం ఉంటే.. వాణిజ్యం, యాత్రారంగం, ఇతరత్రా అభివృద్ధికి అవకాశాలు విస్తృతమవుతాయి. దానివల్ల ఇరుదేశాలూ సుసంపన్నమవ్వటమే కాకుండా, దక్షణాసియాకూ ప్రయోజనకరం'' అని వ్యాఖ్యానించారు. ఈ స్వప్నం సాకారమవ్వాలంటే పాక్‌ ఉగ్రవాదంపై నిర్ణయాత్మకంగా స్పందించాలి, అప్పుడు భారత్‌ ఒకడుగు ముందుకేసి సమస్యల్ని పరిష్కరించుకుని, కొత్త అధ్యాయం సృష్టించడానికి సిద్ధమవుతుందని పేర్కొన్నారు. సౌదీఅరేబియా, భారత్‌ రెండూ ఉగ్రవాదం, హింస ముప్పును ఎదుర్కొంటున్నాయనీ, ఇలాంటి సందర్భాల్లోనే ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని స్పష్టం చేశారు. మతంపేరిట, ఇతరత్రా కారణాలతో హింస, భయోత్పాతాలు సృష్టించడాన్ని ఆధునిక నాగరక సమాజాలు అంగీకరించవని స్పష్టం చేశారు. భారత్‌ పొరుగు దేశాలన్నింటితో శాంతి, స్నేహాలనే కోరుకుంటోందన్నారు. భారత జాతీయతలో ఇస్లాం ఒక భాగమన్నారు. 'జాతి నిర్మాణంలో ముస్లింలూ తమవంతు కృషి చేశారనీ, మా సంయుక్త సంస్కృతికి మాకెంతో గర్వకారణం' అని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు.

అరబ్‌ శాంతి యత్నాలకు మద్దతు
గల్ఫ్‌ ప్రాంతంలో సౌదీఅరేబియా సుస్థిరతకు మూలస్తంభంలా నిలించిందని ప్రధాని అభివర్ణించారు. పాలస్తీనా ప్రజల పోరాటానికి భారత్‌ మద్దతు ఇస్తుందనీ, అరబ్‌ శాంతి యత్నాలకు అండగా నిలుస్తుందన్నారు. పాలస్తీనా ఆర్థిక, మానవ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తోందనీ, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. సౌదీ రాజు అబ్దుల్లా, ఇతర నేతలతో చర్చలు జరపటం ద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దృఢంగా మారాయన్నారు. ఇంధన, ఆహార భద్రత, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ముప్పులన్నింటిపైనా ఉమ్మడిగా పోరాడతామన్నారు.

ఖైదీల మార్పిడిపై కుదిరిన ఒప్పందం
భారత్‌, సౌదీ అరేబియాల మధ్య ఖైదీల మార్పిడిపై ఒప్పందం కుదిరింది. సౌదీరాజు అబ్దుల్లాతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జరిపిన చర్చల అనంతరం ఇరుదేశాలు ఉగ్రవాదం, మనీలాండరింగ్‌పై ఉమ్మడి పోరు సాగిస్తాయని ప్రకటించారు. ఈ మేరకు చరిత్రాత్మక 'రియాద్‌ డిక్లరేషన్‌'పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఇరుదేశాల మధ్య వూహాత్మక భాగస్వామ్యంతో కొత్తశకం మొదలైందని అందులో పేర్కొన్నారు. ఈ ఒప్పందంతోపాటు శిక్షపడిన ఖైదీల బదిలీ, సాంస్కృతిక సహకారం, అంతరిక్ష వ్యవహారాలు, ఐటీ రంగంపైనా ఒప్పందాలు కుదిరాయి. టాటామోటార్స్‌ సౌదీకి పాఠశాల బస్సులు పంపిణీ చేయడంపైనా అంగీకారం కుదిరింది.

మన్మోహన్‌కు గౌరవ డాక్టరేట్‌
ఆర్థికవేత్తగా, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల శిల్పిగా పేరుపొందిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సౌదీ అరేబియాలోని ప్రఖ్యాత కింగ్‌ సౌద్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ అందించింది. ఈ సందర్భంగా ఐఐటీ, బెంగళూరు, సౌద్‌వర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.