
డీలర్ల వీరబాదుడు
చోద్యం చూస్తున్న అధికారులు
మంత్రి ఇన్‌ఛార్జి జిల్లాలోనే బస్తాకు రూ. 100 అధికం
నల్లబజారులో 'సహకార' ఎరువులు
విచారణ కోరిన ప.గో.కలెక్టర్
హైదరాబాద్ - న్యూస్‌టుడే


రైతు అవసరాల మేరకు ఎరువులను సరఫరా చేయడం, కేంద్రం కేటాయిస్తున్న వాటిని అన్ని ప్రాంతాలకు సమానంగా అందజేయడం, తరచూ దుకాణాల తనిఖీ, నిల్వ, అమ్మకాలు, అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవడం వంటి పనులన్నీ వ్యవసాయ శాఖ అధికారులే చేయాలి. సంయుక్త సంచాలకుల నుంచి మండల వ్యవసాయ అధికారి వరకూ అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే రైతులకందరికీ ఎరువులు అందుబాటులోకి వస్తాయి. ఏ ఒక్క జిల్లాలోనూ అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు, దాడులు, సరఫరా, ధరలపై దృష్టి సారిస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఎరువుల వ్యాపారుల వద్దనుంచి మామూళ్లు దండుకుంటూ వ్యవసాయ శాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినా ఫలితం శూన్యం. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరిపై మాత్రం చర్యలు తీసుకున్నారు. తర్వాత కమిషనరేట్‌లో అన్ని జిల్లాల సంయుక్త సంచాలకులతో సమావేశం ఏర్పాటు చేసినా పరిస్థితిలో మార్పు లేదు.
దిక్కులు చూస్తున్న రైతన్న
* వ్యవసాయ శాఖ మంత్రి ఇన్‌ఛార్జిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో యూరియా బస్తా రూ. 350 చొప్పున విక్రయిస్తున్నారు. వాస్తవ ధర 250.80 రూపాయలు. వరి పాలు పోసుకునే దశలో ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. ఉద్యాన పంటలకు ప్రసిద్ధి చెందిన ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లో 40 వేల ఎకరాల్లో పంటలు సాగుచేయగా అక్కడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పరస్పర సహాయ సహకార సంఘాలు ఒక్కో పాసు పుస్తకానికి బస్తా కంటే ఎక్కువ ఇవ్వడంలేదు. అయిదెకరాలున్నా... రెండు ఎకరాలున్నా ఒక బస్తా ఎరువుతో సరిపెట్టుకోమంటున్నారు. వాస్తవానికి ఒక్కో ఎకరాకు కనీసం మూడు బస్తాలు అవసరం. బయట మార్కెట్‌లో వంద రూపాయలు అధికంగా చెల్లించి కొనుక్కోవడం తప్ప మరో మార్గం లేదు. ఇదీ అక్కడి పరిస్థితి. దీంతో అటు ఉద్యాన పంటలతో పాటు వరి దిగుబడులపై తీవ్ర ప్రభావం పడనుంది.
* కడప జిల్లాలో నెలరోజులుగా ఎరువుల కొరత వేధిస్తోంది. ఏ ఒక్క ఎరువు కూడా లభించడం లేదు. అదేమంటే డీలర్లు డీడీలు కట్టడం లేదంటున్నారు. జిల్లాకు సరఫరా చేసిన ఎరువులు ఏమయ్యాయన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏ ఎరువు కావాలన్నా రూ. 50 అధికంగా చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా కడప-కర్నూలు ఆయకట్టు రైతుల అగచాట్లు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. దీంతో పాటు ఉద్యాన పంటలు కూడా అధికంగా ఉండటంతో బస్తాకు రూ.50-100 వరకు అధికంగా చెల్లించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
* కర్నూలు జిల్లాలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఆదోని కేంద్రంగా ఎరువుల వ్యాపారుల సరఫరా సంఘం పేరుతో కేటాయింపులు చేసుకుని దొడ్డిదారిన కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ విధంగా ఇటీవల కాలంలో వంద లారీలను తరలించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎరువుల కొరత నెపంతో యూరియాపై రూ.100, కాంప్లెక్సు, డీఏపీలపై బస్తాకు రూ.50 అదనంగా చెల్లిస్తే తప్ప లభించడం లేదు. జిల్లాకు అవసరమైన మేరకు సరఫరా చేసినా... ఎరువులు మాత్రం లభ్యం కావడం లేదు. జిల్లాలో హైలెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టులో కొరత తీవ్రంగా ఉంది. దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నా వ్యవసాయ అధికారులకు చీమకుట్టినట్లయినా లేదు. నంద్యాల ప్రాంతంలో రాజకీయ నేతల ప్రాపకంతో బహిరంగంగా ఎరువులను నల్లబజారులో విక్రయిస్తున్నా చర్యలు శూన్యం.
* ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతంలో ఎరువుల బస్తాకు రూ.50-100 అధికంగా వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా వ్యవసాయ శాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. మొత్తం నల్లబజారుకు తరలిపోయినా పట్టించుకునే అధికారి ఒక్కరు కూడా లేరు.
* శ్రీకాకుళం జిల్లాలో యూరియా అందుబాటులో ఉన్నా, అవసరానికి సరిపడా డీఏపీ లభించడం లేదు. అన్ని ఎరువులపై బస్తాకు రూ.30-50 లు అదనంగా వసూలు చేస్తున్నారు.
* వచ్చే నెల 1 నుంచి యూరియా ధరను పది శాతం పెంచనున్నట్లు గత నెల 19న కేంద్రం ప్రకటించింది. ఇపుడే ఇలా ఉంటే అధికారికంగా ధరలు పెంపు వర్తించిన తర్వాత ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోషకాధార రాయితీ విధానంలో భాగంగా డీఏపీ, కాంప్లెక్సు ఎరువుల ధరలు కూడా పెంచనున్న నేపథ్యంలో ప్రస్తుత రబీ సీజనులో కేంద్రం సరఫరా చేసిన ఎరువులను వ్యాపారులు గోదాముల్లో దాచారని, ధరలు పెరిగిన తర్వాత వాటిని డబ్బు చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మేల్కోకపోతే రైతుల భవితవ్యం అంధకారమే.
సరఫరాలోనూ లోపాలే
ప్రతి సంవత్సరం రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం ఎరువులను కేటాయిస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లకు విడివిడిగా అందజేస్తుంది. కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుకుంటూ ఆయా జిల్లాలకు వ్యవసాయ శాఖ రైల్ ర్యాక్‌లను పంపుతుంది. ర్యాక్‌లను అందుబాటులో ఉంచడానికి రైల్వేశాఖ అధికారుల తోడ్పాటు కూడా అవసరం. ఈ సంవత్సరం రైల్వే శాఖ నిర్లక్ష్య ధోరణి కారణంగా ర్యాక్‌లు అందుబాటులో లేకపోవడంతో కేటాయింపుల మేరకు రాష్ట్రానికి ఎరువులు సరఫరా కాలేదు.
సహకార సంఘాల ద్వారా రైతులకు చేరాల్సిన ఎరువులు చివరకు నల్లబజారుకు తరలుతున్నాయి. దీనిపై విచారణ నిర్వహించాల్సిందిగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్ వ్యవసాయ శాఖ కమిషనర్‌ను కోరారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వ రంగ ఎరువుల సంస్థలైన క్రిభ్‌కో, ఇఫ్‌కోలు జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాలు, పరస్పర సహకార సంఘాలకు ఎరువులను సరఫరా చేస్తున్నాయి. రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వరంగ ఎరువుల సంస్థలే భరిస్తున్నాయి. ఇంత ఖర్చు పెట్టి మరీ రైతుల కోసం ఎరువులను పంపుతుంటే... కొన్ని వ్యవసాయ సహకార సంఘాలు, పరస్పర సహకార సంఘాలూ డీలర్లతో కుమ్మకయి... ఎరువులను నల్లబజారుకు తరలిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఎరువులనే డీలర్లు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించుకుంటున్నట్లు సమాచారం. దీనిపై విచారణ నిర్వహించాల్సిందిగా జిల్లా కలెక్టర్ వాణీప్రసాద్ వ్యవశాయ శాఖను కోరారు. సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు స్వలాభం కోసం ఎరువులను డీలర్లకు విక్రయిస్తున్నారని కొందరు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రైతులకందాల్సిన ఎరువులు ఇలా నల్లబజారుకు తరలడంపై కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై కమిషనరేట్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారి ఒకరు త్వరలో ఆ జిల్లాకు వెళ్లి విచారణ నిర్వహిస్తారు.