Monday, March 22, 2010

భారత అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం

భారత అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం
'బ్రహ్మోస్‌' పరీక్ష విజయవంతం
భువనేశ్వర్‌: ప్రపంచంలోనే అత్యుత్తుమ క్రూయిజ్‌ క్షిపణి.. బ్రహ్మోస్‌ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలిసారిగా విన్యాసాలు చేయదగ్గ బ్రహ్మోస్‌ సూపర్‌సొనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని భారత్‌ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. ఒరిస్సా తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో ఈ పరీక్ష జరిగింది. ఉదయం 11.30 గంటలకు భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ నుంచి దీన్ని ప్రయోగించినట్లు బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ చీఫ్‌ ఎ.శివథాను పిళ్త్లె తెలిపారు. ఇది సముద్రానికి సమాంతరంగా ప్రయాణిస్తూ.. గాల్లో విన్యాసాలు చేసుకుంటూ 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ మీన్‌(పాత యుద్ధనౌక)ను ఢీ కొట్టిందని తెలిపారు. యుద్ధనౌక ఎగువున తిరుగుతున్న హెలికాప్టర్లు ఈ దృశ్యాన్ని రికార్డు చేశాయని చెప్పారు. ''విన్యాసాలు చేయదగిన సూపర్‌సొనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి.. భారత్‌ వద్ద మాత్రమే ఉంది'' అని పేర్కొన్నారు. బ్రహ్మోస్‌లో సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగుపరిచినట్లు పిళ్త్లె చెప్పారు. సూపర్‌సొనిక్‌ వేగంతో దూసుకెళుతూ.. విన్యాసాలను కూడా చేయగలిగే సామర్థ్యాన్ని ఈ క్షిపణి ప్రదర్శించిందని తెలిపారు. ఈ విన్యాసాల సామర్థ్యం వల్ల దారిలో తలెత్తిన అడ్డంకులను అధిగమించవచ్చు. బ్రహ్మోస్‌ను పరీక్షించడం ఇది 22వసారి.

సముద్రానికి సమాంతరంగా ప్రయాణించే క్షిపణులను యుద్ధనౌకల్లో అమర్చేందుకు నౌకాదళం ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోస్‌ను విజయవంతంగా పరీక్షించడంపై రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనిలు శాస్త్రవేత్తలను అభినందించారు.

క్షిపణి వివరాలివీ..
* పొడవు- 9 మీటర్లు
* బరువు- 3 టన్నులు
* ఇంజిన్‌- రెండు అంచెల రాకెట్‌/ రామ్‌జెట్‌
* వేగం- 2.8 మ్యాక్‌
* పరిధి- 290 కిలోమీటర్లు
* పేలోడ్‌- 200 నుంచి 300 కిలోలు
వేగమే ప్రధానం
ఫ్గానిస్థాన్‌లో అల్‌ఖైదా అగ్రనాయకుడు ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చేందుకు 1998 ఆగస్టు 20న అమెరికా నౌకాదళం తన యుద్ధనౌకల నుంచి 'తోమహాక్‌' క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించింది. వీటి గరిష్ఠ వేగం గంటకు 550 మైళ్లు (0.8 మ్యాక్‌). ఇవి అరేబియా సముద్రం నుంచి తూర్పు అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను చేరడానికి రెండు గంటలు పట్టింది. అయితే గంట ముందే లాడెన్‌ అక్కడి నుంచి ఉడాయించాడు.

* ఇలాంటి అనేక ఘటనలు క్షిపణుల వేగం పెరగాల్సిన ఆవశ్యకతను చాటిచెబుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద నాయకులు, సముద్ర దొంగల ఆటకట్టించడానికి, పరిమిత స్థాయి ఘర్షణల్లో అత్యంత వేగంగా ప్రయాణించే క్షిపణులు చాలా అవసరం.

* బ్రహ్మోస్‌.. ఈ అవసరాలను బాగా తీరుస్తుంది. ఇది సైన్యం చేతిలో ఉన్న ఏకైక సూపర్‌సొనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వీటిని తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాయి. అమెరికాకు చెందిన హార్పూన్‌ క్షిపణి కంటే బ్రహ్మోస్‌ మూడున్నర రెట్లు ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది.

* బ్రహ్మోస్‌ను భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ, రష్యాకు చెందిన ఎన్‌పీఓ మషినోస్త్రోయేనియా(ఎన్‌పీఓఎం)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారత్‌ రష్యాల్లో ప్రవహించే బ్రహ్మపుత్ర, మొస్కావా నదులకు గుర్తుగా ఈ క్షిపణికి నామకరణం చేశారు.

* అత్యంత సమర్థవంతమైన క్షిపణిగా ఇది పేరు తెచ్చుకుంది. భారత సైన్యంలోను, నౌకాదళంలోనూ ప్రవేశించింది. వైమానిక దళానికీ అందబోతున్నాయి. సుఖోయ్‌-30 యుద్ధవిమానాలకు వీటిని అమర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

* నౌకాదళ బ్రహ్మోస్‌ విషయానికొస్తే..రాడార్‌కు దొరకకుండా శత్రువుల యుద్ధనౌకలను నాశనంచేయగలదు. సముద్రంనుంచి సముద్రంలోని లక్ష్యాలకు, సముద్రం నుంచి నేలమీదున్న లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.

* బ్రహ్మోస్‌ లాంచర్‌ నుంచి 8 క్షిపణులను 2-2.5సెకన్ల తేడాతో ప్రయోగించవచ్చు. క్షిపణికి మార్గమధ్యంలోనూ దిశానిర్దేశం చేయవచ్చు. నౌక డెక్‌కింద అమర్చేలా లాంచర్‌ను రూపొందించారు. అందువల్ల వాతావరణ పరిస్థితులనుంచి దీన్ని రక్షించవచ్చు.

* బ్రహ్మోస్‌-2 పేరిట.. హైపర్‌సొనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులు తయారవుతున్నాయి. ఇవి మ్యాక్‌-4 కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి. మ్యాక్‌-6 వేగంతో లక్ష్యాన్ని తాకిన క్షిపణి మ్యాక్‌-1 క్షిపణి కంటే 36 రెట్లు ఎక్కువ విధ్వంసం కలగచేస్తుంది. బంకర్లు, అణు, జీవ ఆయుధ నిల్వ స్థావరాలను ఛేదించడానికి ఉపయోగపడతాయి.