Tuesday, March 23, 2010

కొత్త వాహనానికి పాత నెంబరు!

న్యూఢిల్లీ: బాగా అచ్చొచ్చిన పాత కారు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కొత్తదానికి కూడా కొనసాగించాలనుకుంటున్నారా? త్వరలోనే మీ కోరిక తీరే అవకాశం కనపడుతోంది. ఒక వ్యక్తి తన పాత వాహనాన్ని విక్రయించడమో, తుక్కు కింద మార్చడమో చేస్తే పాత నెంబర్‌ను కొత్త వాహనానికి అమర్చుకునేందుకు యజమానికి అవకాశం ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. పాత నెంబర్లపై మక్కువ ఉన్న వాళ్లకు, ఆకర్షణీయమైన నెంబర్లు పొందిన వేల మందికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే, తన పాత వాహనాన్ని విక్రయించే యజమాని దాని నెంబర్‌ను మాత్రం ఉంచేసుకోవచ్చు. ఒకవేళ పాత వాహనాన్ని తుక్కుగా మార్చేస్తే ఆ మేరకు స్థానిక ఆర్‌టీవోకు రికార్డులు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వాహనం నెంబర్‌ను అట్టిపెట్టుకోవడానికి యజమానికి అవకాశం కల్పిస్తారు.