మెరుగైన పరిస్థితులే కారణం

ఇప్పుడే ఎందుకంటే.. ఈ ఏడాది తంగమాయిల్ జువెలరీస్‌తో బంగారు రత్నాభరణాల తయారీ, విక్రయ సంస్థల పబ్లిక్ ఇష్యూల ప్రస్థానం ప్రారంభమైంది. ఇదే వరుసలో ఇప్పుడు శ్రీగణేశ్ జువెలరీ హౌస్, గోయెంకా డైమెండ్ అండ్ జువెల్స్ సంస్థలు కూడా ఐపీఓలతో ముందుకు వచ్చాయి. వాస్తవానికి ఈ సంస్థలు 2008 లోనే ఇష్యూకు రావాలని యోచించినప్పటికీ మాంద్యం కారణంగా గత ఏడాది ఇవి ఐపీఓ ప్రణాళికలను పక్కన పెట్టాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడుతుండడంతో పాటు భారత స్టాక్ మార్కెట్ కూడా తిరిగి పుంజుకోవడంతో జువెలరీ సంస్థలు ఐపీఓకు వస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు భారత్ సుమారు రూ.1.18లక్షల కోట్ల రత్నాభరణాలను ఎగుమతి చేసింది. దీంతో పరిస్థితులు తిరిగి గాడినపడుతున్న సంకేతాలను అందుకున్న సంస్థలు పబ్లిక్ ఇష్యూ జోరును పెంచాయి. రూ.29 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఇష్యూకు వచ్చిన తంగమాయిల్ జువెలరీ ఐపీఓ కూడా మిగతా సంస్థలకు స్ఫూర్తి నిచ్చింది. దీంతో మరిన్ని సంస్థలు కూడా పబ్లిక్ ఇష్యూ బాట పడుతున్నాయి. ప్రస్తుతం తాజాగా శ్రీగణేశ్ జువెలరీ హౌస్ సంస్థ రూ.369-383 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ప్రైమరీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.260- 270 ధరల శ్రేణితో ఇష్యూకు వచ్చిన ఈ సంస్థ ఇష్యూ నేటితో ముగియనుంది.
మంచి ఆదరణే.. భారత్‌లో వ్యవస్థీకృతం కాని బంగారు ఆభరణాల వ్యాపారంలో బ్రాండెడ్ ఆభరణాలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. దీనికి తోడుగా కొన్ని ప్రధాన సంస్థలు మాత్రమే బ్రాండెడ్ ఆభరణాల రంగంలో తమ ఉనికిని చాటుతున్నాయి. దీంతో విస్తరణ మార్గాల్లో ఉన్న సంస్థలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న భావనతో మదపురులు ఈ ఇష్యూలకు మెరుగ్గానే స్పందిస్తున్నారు. అదీకాకుండా భారత్‌లో బంగారు అభరణాల రంగానికి ఎప్పటికీ తరగని గిరాకీ ఉంటుందని, ఇదో ప్రత్యేకమైన పోర్ట్‌ఫోలియోగా కూడా కలిసి వస్తుందన్న భావనతో చాలా మంది వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పోయిన నెల లిస్టింగ్ వచ్చిన తంగమాయిల్ జువెలరీస్ గత వారాంతానికి
3.33 శాతం ప్రీమియంతో రూ.77.50 వద్ద ట్రేడవుతోంది, నేటితో ముగియనున్న శ్రీగణేశ్ జువెలరీ హౌస్‌కు సోమవారం వరకు 1.07 రెట్ల స్పందన లభించింది. ఈ క్రమంలో వచ్చిన గోయెంకా డైమండ్స్ ఐపీఓకు కూడా మంచి ఆదరణే లభించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
