
రూ.250 కోట్ల భూములు రూ.16 కోట్లకే!
తిరుపతిలో హథీరాంజీ భూములు ధారాదత్తం!
అనుకూలంగా కదిలిన దస్త్రాలు
వక్రమార్గంలో ప్రభుత్వ పరిష్కారం
చక్రం తిప్పిన మంత్రులు
హైదరాబాద్, తిరుపతి - న్యూస్‌టుడే

అమాత్యుల ఆశీస్సులు
తిరుపతిలో హథీరాంజీ మఠానికి కోట్లాది రూపాయల విలువ చేసే భూములున్నాయి. రూ. 250 కోట్ల విలువ గల ఈ భూములను ఎలాగైనా తెగనమ్మేందుకు ఏళ్ల తరబడీ ప్రయత్నాలు జరుగుతున్నా... కోర్టు కేసుల కారణంగా ఇంతవరకూ ఇది సాధ్యం కాలేదు. ఒక చిన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని అనుకున్న పని కానిచ్చేసేందుకు కొందరు పావులు కదిపారు. అందుకు సంబంధించిన దస్త్రాలు సచివాలయంలో వేగం అందుకున్నాయి. ఒకరిద్దరు మంత్రులు, ఉన్నతాధికారుల ఆశీస్సులతో రేపోమాపో పచ్చ జెండా ఊపేందుకు అవసరమైన కార్యాచరణ పూర్తయింది. దీన్ని అడ్డుకునేవారే లేకపోతే... కోట్లాది రూపాయల హథీరాంజీ మఠం భూములు కారుచౌకగా అన్యాక్రాంతం అయిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.
మార్గాలెన్నో ఉండగా...
ఆదాయమే ముఖ్యమని భావించినపుడు భూములను బహిరంగ వేలం ద్వారాగానీ, లేదా తిరుపతిలోనే ఉన్న 'తుడా' వంటి సంస్థల ద్వారా అభివృద్ధికి ఇచ్చినట్లయితే కోట్లాది రూపాయలను సమకూర్చుకోవచ్చు. మరో విచిత్రం ఏమంటే- నిజానికి విక్రయించదలచుకున్న 53.27 ఎకరాలు ప్రస్తుతం ఖాళీగా లేవు. అక్కడ ఇప్పటికే వందలాదిగా ఇళ్లు వచ్చేశాయి. ఇపుడున్నవారికి ఇళ్లను రెగ్యులరైజ్ చేయడంగానీ, లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించడంగానీ చేయాలి. కానీ ఇవేమీ ప్రభుత్వానికి తట్ట లేదు. ఒక వేళ ప్రభుత్వమే అనుకున్నట్లు ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినా... మరి ప్రస్తుతం అక్కడ ఉంటున్నవారి పరిస్థితి ఏమిటి? వారిని ఏం చేయాలి? సింహాచలం భూములు అన్యాక్రాంతం అయినపుడు ప్రభుత్వం కట్టిన ఇళ్లను క్రమబద్దీకరణ చేసింది. ఇలాంటివి ప్రభుత్వానికి కొత్తకాదు. హథీరాంజీ భూముల్లో కూడా శాశ్వత నివాసాలు ఉన్నపుడు ప్రభుత్వం దీన్ని జాగ్రత్తగా పరిష్కరించాలని భావించకపోవడం శోచనీయం. అసలా భూముల్లో శాశ్వత నివాసాలేమీ లేనట్లే తతంగమంతా నడుస్తోంది. భూమిని అమ్మదలచుకున్నపుడు ఎవరైనా ఓ రూపాయి ఎక్కువ వస్తే మంచిదని భావిస్తారు. హథీరాంజీ మఠం భూముల విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. బహిరంగ వేలం ద్వారాగానీ, టెండరు విధానంలోగానీ ఎక్కువ సొమ్ము వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ భూములను ప్రైవేటు ఒప్పందం ద్వారానే విక్రయించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ప్రభుత్వం ముందున్న ఇతర పరిష్కారాలను పట్టించుకోకుండా ప్రైవేటు ఒప్పందాన్ని అనుమతించేందుకే నిర్ణయించుకుంది. మఠానికి చెందిన 53.27 ఎకరాలను రూ.16 కోట్లకు అమ్మేందుకు 'మెసర్స్ బిలియర్డ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్' డైరెక్టర్ ఎ.సీతారామారావుతో హథీరాంజీ మఠం మహంత్ 2009 మార్చి 23న ఒక ప్రైవేటు ఒప్పందం చేసుకున్నారు.
హైకోర్టు ఉత్తర్వులకీ విరుద్ధమే
హథీరాంజీ భూములను విక్రయించడానికి ప్రైవేటు ఒప్పందం కుదుర్చుకున్న తేదీ 2009 మార్చి 23. భూములను విక్రయించడానికి వీల్లేదంటూ 2006 సెప్టెంబరు ఏడో తేదీనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత... ఒప్పందం జరిగిందన్నది విస్పష్టంగా తెలుస్తున్నది. ఈ అంశంలో- ప్రభుత్వం అరుదైన పరిస్థితుల్లో మాత్రమే నిబంధనల పరిధి దాటి వ్యవహరించవచ్చంటూ హైకోర్టు గత ఏడాది నవంబరు 17న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రైవేటు ఒప్పందం గత ఏదాది మార్చికే జరిగిపోయింది. ఎలా చూసినా కూడా ప్రైవేటు ఒప్పందానికి చట్టబద్ధత లేదని తెలుస్తోంది. ఈ ఒప్పందానికే ఇపుడు అధికారులు కదలిక తీసుకువచ్చారు. దేవాదాయ చట్టం ప్రకారం హిందూ మఠం ఆస్తుల అమ్మకానికి దేవాదాయ శాఖ ముందస్తు అనుమతి అవసరం. ఇవేమీ లేకుండా... మీరు మఠం ఆస్తిని ఎలా విక్రయిస్తారంటూ ప్రశ్నించాల్సిన అధికారులే... ఈ క్రతువుకు ఆమోదముద్ర వేయబోవడం విశేషం.
నిన్కొక మాట... నేడొక మాట!
తిరుపతిలోని హథీరాంజీ మఠం భూముల విక్రయానికి సంబంధించి అనుమతి ఇచ్చే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలి. అసలే విషయం కోర్టుల్లో నలుగుతుండటంతో రెవిన్యూ శాఖ ఎందుకైనా మంచిదని ఈ మేరకు న్యాయశాఖకు ఒక లేఖ రాసింది. ప్రైవేటు ఒప్పందానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయశాఖ తేల్చి చెప్పింది. అయితే న్యాయశాఖ ఇచ్చిన ఈ సూచన ఓ నెల రోజుల్లోనే తారుమారైంది. ఇలా ఎందుకు జరిగిందనేది సుస్పష్టం.
పుణ్యక్షేత్రం తిరుపతిలో కలిసిపోయిన అవిలాల గ్రామంలో బుగ్గామఠం, కోచి కుటుంబం చేతుల్లో ఉమ్మడిగా 174.75 ఎకరాల భూములు ఉన్నాయి. 1856 డిసెంబరులో కోచి కుటుంబం తన వాటాను బుగ్గామఠానికి లీజుకు ఇచ్చింది. తర్వాత కాలంలో బుగ్గామఠం తన సగంవాటాను శ్రీ స్వామి హథీరాంజీ మఠానికి విక్రయించింది. అదే సమయంలో కోచి కుటుంబానికి సంబంధించి తాను కలిగి ఉన్న శాశ్వత లీజు హక్కును కూడా 1884లో స్వామి హథీరాంజీమఠానికి బదలాయించింది. ఈ భూములను అమ్మి తద్వారా వచ్చే ఆదాయాన్ని కోచి కుటుంబానికీ, తమకూ పంచాలని హథీరాంజీ మఠం అధికారులు దేవాదాయశాఖకు 1983లో విన్నవించారు. ఈ విజ్ఞాపన పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే... 2007 నవంబరులో చిత్తూరులోని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ మఠానికి 53.27 ఎకరాలను కౌలుదారులు, ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని హథీరాంజీ మఠానికి అప్పగించారు. ఈ 53.27 ఎకరాల భూమిని ఏ విధంగానైనా అమ్మే అధికారం మఠానికి లేదంటూ 2006 సెప్టెంబరులో హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇదీ మఠం వాదన: భూమి అమ్మకంపై ఉన్న నిషేధాన్ని తొలగించి అమ్మకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా హథీరాంజీ మఠం తరఫున మహంత్ హైకోర్టుకు వెళ్లారు. మఠం ఆస్తులను అమ్మేందుకు ఆయన కొన్ని కారణాలను చూపించారు. 1999-2000 నుంచి 2003-04 మధ్య రూ.4.14 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించలేదని, అందు కారణంగా ఆదాయపన్నుశాఖ తమ దగ్గరున్న రూ.7.62 కోట్లనూ స్వాధీనం చేసుకుందన్నారు. డబ్బులు లేకపోవడం వల్ల మఠం కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయని, ఈ కారణంగానే తాము 'మెసర్స్ బిలియర్డ్ ఫార్మ్స్'కు భూములను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెబుతున్నారు.
2009 నవంబరులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో గతంలో ఇచ్చిన ఆదేశాన్ని న్యాయస్థానం సవరించింది. దేవాదాయ చట్టం సెక్షన్ 80 కింద- తగిన ఆదేశం ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు చేసింది. నిర్ణయాధికారం ఎప్పుడైతే ప్రభుత్వానికి దఖలు పడిందో భూముల విక్రయానికి తెరలేచింది.
ముందు వద్దని... తర్వాత సరేనని...!
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా రెవెన్యూశాఖ (దేవాదాయ) ముఖ్యకార్యదర్శి రమణాచారి న్యాయశాఖ కార్యదర్శి వి.ఎస్.అప్పారావును కోరారు. ఈ భూముల అమ్మకం వ్యవహారంపై న్యాయశాఖ కార్యదర్శి స్పందించారు. 'కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా చేసుకునే ఒప్పందం చెల్లదు. స్థిరాస్థి అమ్మకానికి సంబంధించి కమిషనర్ తెలిపే ఆమోదానికి కూడా టెండర్ లేదా బహిరంగ వేలం నిర్వహించాలి. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి. ప్రైవేట్‌గా నిర్వహించిన సంప్రదింపుల ద్వారా భూమి అమ్మకానికి సంబంధించి హథీరాంజీ మఠం సమర్థనీయమైన కారణాలు చెప్పలేకపోయింది. ఆర్థిక ఇబ్బందులు... భూముల అమ్మకానికి ప్రాతిపదిక కాదని' న్యాయశాఖ కార్యదర్శి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. బహిరంగ వేలం ద్వారా ఎక్కువ ఆదాయం రావొచ్చని, అందువల్ల మఠం విజ్ఞప్తి (భూమి అమ్మకంపై)ని తిరస్కరించే అవకాశం దేవాదాయశాఖకు ఉందని గత డిసెంబరు 17వ తేదీన ఆయన అభిప్రాయపడ్డారు.
తెరపైకి కొత్త వాదన
భూమి అమ్మకంపై మఠం చేసుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తే అది హైకోర్టు ఉత్తర్వు ఉల్లంఘన కిందకు వస్తుందో, రాదో తెలియజేయాలని రెవెన్యూశాఖ (దేవాదాయ) ముఖ్యకార్యదర్శి రమణాచారి న్యాయశాఖ కార్యదర్శిని మరోసారి కోరారు. దీనిపై న్యాయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కార్యదర్శి స్పందిస్తూ... మఠం విజ్ఞాపనను ప్రభుత్వం తిరస్కరించవచ్చని స్పష్టం చేశారు. తిరస్కరణ ప్రభుత్వ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే నిర్ణయం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఉల్లంఘన కిందకు రాదని గత డిసెంబరు 22వ తేదీన ఆయన తెలియజేశారు.
తిరకాసు ఎక్కడుంది?
మఠం చేసుకున్న ఒప్పందాన్ని న్యాయశాఖ ఒకసారి తప్పు పట్టిన తర్వాత కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకు అప్పగించడానికి ఎవరూ అంగీకరించరు. దాని రద్దుకే మొగ్గు చూపుతారు. ఆక్రమణలను నిరోధించే పరిస్థితిలో మఠం లేదని రమణాచారి న్యాయశాఖ దృష్టికి తీసుకెళ్లారు. చట్టబద్ద బకాయిలు, వేతనాలు, పింఛన్ల చెల్లించాల్సి ఉందని, సాధువుల రోజువారీ అవసరాలు, గోపోషణ కూడా చూడాల్సి ఉందని తెలిపారు. వేద సంస్కృతి పరిరక్షణ తదితరాలను పరిగణనలోకి తీసుకునే భూముల అమ్మకానికి మఠం నిర్ణయించుకుందని తెలిపారు. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి సూచనపై ఈసారి న్యాయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కార్యదర్శి ఇలా వివరణ ఇచ్చారు.
ధార్మిక, దేవాదాయ సంస్థలకు చెందిన స్థిరాస్తులను బదలాయింపు లేదా విక్రయానికి సంబంధించి దేవాదాయ చట్టంలోని సెక్షన్ 80 నిర్వచిస్తోంది. అందులోని సెక్షన్ 80 (1)(సి) ప్రకారం టెండర్ లేదా బహిరంగ వేలం ద్వారా మాత్రమే భూ విక్రయం జరగాలి. దీనికి మినహాయింపునిస్తూ హైకోర్టు ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాన్ని కట్టబెట్టింది. ప్రత్యేక పరిస్థితుల్లో థార్మిక, దేవాదాయ ప్రయోజనాల నిమిత్తం బహిరంగ వేలం నిర్వహించకుండానే స్థిరాస్థిని వేరొకరికి బదలాయించవచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. సెక్షన్ 80 (1)(బి)లో పేర్కొన్న విధంగా బదలాయింపు నిర్ణయం... సంస్థ ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించినదై ఉండాలి. ఈ సెక్షన్ ప్రకారం
* సంస్థ ప్రయోజనాల పరిరక్షణకు స్థిరాస్థి బదలాయింపు అవసరమా అన్న విషయాన్ని పరిశీలించాలి.
* స్థిరాస్థి కలిగి ఉండటం, నిర్వహించడం ఆర్థికంగా లాభదాయకం కానిదైనపుడు
* వీటన్నింటిని పరిశీలించి అనంతరం సముచిత నిర్ణయం తీసుకోవాలి.
బహిరంగ వేలం నిర్వహించకుండా స్థిరాస్థిని అప్పగించవచ్చని, ఏరకంగా అప్పగించినా... సంస్థ ప్రయోజనాలు ముఖ్యమని న్యాయశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి స్పష్టం చేస్తూనే హథీరాంజీ భూముల బదలాయింపు (విక్రయానికి)నకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయవచ్చని గత నెల 29వ తేదీన తెలిపారు. మఠం నిర్ణయాన్ని తప్పు పట్టడమేగాక అది చేసిన విజ్ఞాపనను తిరస్కరించే అధికారం దేవాదాయశాఖకు ఉందని డిసెంబరు 12వ తేదీన అదే శాఖ కార్యదర్శి అభిప్రాయపడడం గమనార్హం. ఇది ఎలా ఉన్నా ఇన్‌ఛార్జ్ కార్యదర్శి సూచనను పరిగణనలోకి తీసుకుని దస్త్రం కదిలిపోతోంది. దీంతో మెసర్స్ బిలియర్డ్ ఫార్మ్స్‌తో గతంలో చేసుకున్న ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
రాసిన మాట నిజమే
న్యాయశాఖ కార్యదర్శి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మళ్లీ పరిశీలన చేయాలని కోరిన మాట వాస్తవమేనని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి రమణాచారి చెప్పారు. ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని 'న్యూస్‌టుడే' అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందని అన్నారు.