
మిత్రులను సమాధానపరచే యంత్రాంగం మాకుంది
పారిఖ్ సిఫార్సులు అమలవుతాయి
నష్టాలొచ్చిపుడల్లా ధరలు పెంచం
ఆర్థిక మంత్రి ప్రణబ్ స్పష్టీకరణ
'న్యూస్‌టుడే'కు ప్రత్యేక ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: శుక్రవారం పార్లమెంటులో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం రాజకీయ పత్రమేనని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. ఆ పత్రం కాంగ్రెస్ పార్టీ దార్శనికతను ప్రతిఫలిస్తోందని, ఎక్కడా ఆమ్ ఆద్మీని నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అత్యంత క్లిష్టమైన, అసాధారణమైన, అనిశ్చితమైన పరిస్థితుల్లో ఈ బడ్జెట్ రూపొందించానన్నారు. ''ఒక త్రైమాసికం వర్షాలు తక్కువైతే, మరో త్రైమాసికం ఏకంగా కరవు అలముకొని, అందరూ నిర్లిప్తంగా ఉన్నారు. ప్రపంచ నేతలు కూడా ఎవరూ తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని అంచనా వేయలేదు. అలాంటి వాతావరణంలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు నేనీ బడ్జెట్ రూపకల్పనకు పూనుకోవాల్సి వచ్చింది'' అని వివరణ ఇచ్చారు. బడ్జెట్ అనంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆయన ఆదివారం తీరిక చేసుకొని 'న్యూస్‌టుడే'కు ప్రత్యేక ఇంటర్వ్యూఇచ్చారు. పెంచిన పెట్రో ధరలను తగ్గించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు. ''ద్రవ్య స్థిరీకరణ అత్యంత ప్రాధాన్యమైన అంశం. దానికోసం తీవ్రంగా కృషి చేశా. 13వ ఆర్థిక సంఘం సిఫార్సులే నాకు స్ఫూర్తి. వాళ్లొక మార్గం చూపించారు. నేను అనుసరించా'' అన్నారు. దానికి మరింత మెరుగులు దిద్దే ప్రయత్నం చేశానని చెప్పారు.
''ద్రవ్యోల్బణం ఆందోళనకరమైన విషయమే. అయితే, ప్రస్తుత ద్రవ్యోల్బణ ఒత్తిడి ఏర్పడింది సరఫరాలో సమస్యల వల్లే. నాలుగైదు ఆహార వస్తువులే ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడానికి కారణం. మొదటి మూడు... వంట నూనె, పప్పులు, చక్కెర. వీటన్నింటినీ మార్కెట్లోకి విడుదల చేస్తే సరఫరా సమస్యలు తీరిపోతాయి'' అన్నారు.
బడ్జెట్ ఆమోదం పొందకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. ప్రజలు అది కోరుకుంటున్నారని అనుకోవడం లేదు. డీఎంకే ఆరేళ్లుగా మాతో కలిసి నడుస్తోంది. మిత్రుల్లో అభిప్రాయ భేదాలు సహజం. ఇలాంటివి పరిష్కరించేందుకు మాకో యంత్రాంగం ఉంది.
ఆదాయపు పన్ను రాయితీలు బాగానే ఇచ్చారు. కిందిస్థాయి వేతన జీవుల వద్దకు వచ్చేసరికి.... 'ఆమ్‌ఆద్మీ' సంగతేమిటి?
ఆదాయ పన్ను చెల్లింపుదార్లతో ఆమ్ ఆద్మీని కలపొద్దు. ఈ దేశంలో పన్ను చెల్లింపుదార్లు చాలా తక్కువ. రూ.1.6 లక్షల వరకు ఆదాయానికి పన్ను నుంచి మినహాయింపు ఉంది. సాంకేతికంగా చూస్తే రూ.2.8 లక్షల వరకు మినహాయింపు ఉందనుకోవాలి. ఒక పన్నుఅంచెలో కొందరు లాభపడతారు. కొందరు నష్టపోతారు.
సేవాపన్ను పరిధిని విస్తరించడంలో మీరు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి?
కొన్ని వస్తువులను మాత్రమే తీసుకున్నా. 2011 నుంచి అమల్లోకి రానున్న జీఎస్‌టీలో చేర్చడానికి ఆయా రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్త పరచిన వస్తువుల్ని మాత్రమే చేర్చా. మిగతా వస్తువులపై సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో హరిత విప్లవం అన్నారు. రూ.400 కోట్లు ఎలా సరిపోతాయి?
నిజమే. హరిత విప్లవం అనగానే కేంద్రం ఆర్థిక సహాయం చేస్తుందని అర్థంకాదు. హరిత విప్లవం అంటే.. విత్తనాల దిగుమతి, భూమి సంస్కరణలు, ప్రాసెసింగ్ మీద శ్రద్ధ. సంక్షోభంలోనున్న అన్ని రంగాలకూ నిధులు కేటాయించాం. వాటిలో వ్యవసాయం 31 శాతం కేటాయింపులతో అగ్రస్థానంలో ఉంది. వ్యవసాయ పరిశోధనకే 175 కోట్లు కేటాయించాం. రాష్ట్రాల పెట్టుబడి ఉండనే ఉంది.
ఒక కొత్త ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలంటే ముందు ఎంతో కొంత నిధులు కేటాయించాలి. అది కార్యరూపం దాల్చి డిమాండ్ పెరిగితే మరిన్ని నిధులు ఇవ్వొచ్చు. మేం రాజీవ్‌గాంధీ మురికివాడల అభివృద్ధి పథకాన్ని ప్రారంభించినపుడు కేవలం రూ.150 కోట్లు ఇచ్చాం. పథకం వూపందుకోవడంతో ఇప్పుడు అది రూ.1250 కోట్లకు చేరింది.
మార్కెట్‌లో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న వేళ పన్నుల వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి? మీరు కస్టమ్స్ ఎక్సైజ్ పన్నుల మీద బాగా ఆధారపడినట్లు కనిపిస్తున్నారు. మళ్లీ పరోక్ష పన్నుల విధానానికి వెళుతున్నారా?
లేదు. ఒకసారి పన్నుల తీరు చూడండి. ప్రత్యక్ష పన్నుల ద్వారానే ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి.
నేను వ్యవసాయానికి అనేక రాయితీలు ప్రకటించా. సభలో అవి వినిపించలేదు. వ్యవసాయంలో 4 శాతం సాధిస్తే అన్ని రంగాలూ కలిసి తొమ్మిది శాతం వృద్ధిరేటు సాధ్యం అవుతుంది. అందుకే పలు రకాల వ్యవసాయ సంబంధ పనిముట్ల దిగుమతికి అనుమతి ఇచ్చా.
మీరు 13వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయడం గురించి మాట్లాడుతున్నారు. మరోపక్క ఆర్థిక క్రమశిక్షణ బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని ఇంతవరకు అమలు చేయని కేరళ లాంటి రాష్ట్రాలున్నాయి. అలాంటి రాష్ట్రాలతో ఎలా వ్యవహరిస్తారు?
అమలు చేయని రాష్ట్రాలకు నిధులు రావు. మూడు రాష్ట్రాలే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం అలముకొన్న వేళ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎలా ఉండబోతున్నాయి?
ఎఫ్‌డీఐలకు అడ్డంపడుతున్న పలు విధానపరమైన సమస్యలను పరిష్కరించి, సరళం చేశాను. విదేశీ పెట్టుబడిదారు అనుసరించాల్సిన అన్ని నిబంధనల గురించి ఒకే పత్రంలో సమాచారం ఇస్తున్నాం. ప్రపంచం ఎలా ఉన్నా భారత్ ఇప్పటికీ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగానే ఉంది.
చమురు రంగానికి సంబంధించి కిరీట్ పారిఖ్ కమిటీ సిఫార్సులు అమలవుతాయా?
వ్యతిరేకత ఉంది. ప్రజాస్వామ్యం పనిచేసేది ఇలాగే. ఇక్కడ విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. నష్టాలు వచ్చినపుడల్లా చమురు సంస్థలు ధరలు పెంచుతాయని, ప్రత్యామ్నాయ మార్గాలు ఏవీ లేవని అనుకోరాదు.
విద్యుత్ రంగంలో సంస్కరణలు వేగం అందుకుంటాయా?
సంస్కరణలే కాదు. విద్యుదుత్పత్తిలో లోటు కూడా ఉంది. మనం లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నాం. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 78 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థ్యం సృష్టించాలి. 54 వేల మెగావాట్ల సామర్థ్యం సృష్టించాం. ఇవి ప్రోత్సాహకరమైన గణాంకాలు కాదు. విద్యుత్ వృధాలు ఉండొచ్చు. దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. విద్యుత్తులో ప్రైవేటు రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. అప్పుడు మనకు కొరత సమస్య ఉండదు. విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రాలు బొగ్గు దొరికే రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని, బొగ్గు ఉత్పత్తయ్యే చోటే థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించేలా కేంద్రం ప్రోత్సహిస్తోంది.