Tuesday, March 2, 2010

విశాఖ వైపూ ఐటీ చూపు


9న ఐబీఎం బృందం రాక
కేంద్రం ఏర్పాటుచేసే అవకాశం
అదొస్తే 50దాకా ఖాయం!
ఐటీ నిపుణుల అంచనా
ఏయూతో మైక్రోసాఫ్ట్‌ ఒప్పందం
ప్రారంభానికి విప్రో సిద్ధం
విశాఖపట్నం - న్యూస్‌టుడే
టీ దిగ్గజాల చూపు విశాఖపట్నంవైపు మళ్లిందా? ఇప్పటిదాకా ఒకటి అరా కంపెనీలతో సరిపెట్టుకున్న ఈ సాగరతీరం ఐటీ హబ్‌గా మారనుందా? ఒక్కొక్కటిగా వస్తున్న కంపెనీలతో నగరం రూపురేఖలు మారనున్నాయా? అవుననే అనిపిస్తోంది. ఇటీవలి పరిణామాలను చూస్తుంటే... మాంద్యం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఐటీ దిగ్గజాలన్నీ ఈ నగరంవైపు దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ప్రపంచ ఐటీ రంగంలో పెద్ద కంపెనీగా భావించే ఐబీఎం విశాఖలో తన కేంద్రాన్ని ప్రారంభించే ఆలోచనతో ఉంది. ఈ నేపథ్యంలోనే వాతావరణం, మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత, ఇక్కడి ఐటీ రంగం పరిస్థితిని అంచనావేసేందుకు అమెరికా నుంచి ఆ సంస్థకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం ఈ నెల 9న విశాఖ వస్తోంది. ఒక్క ఐబీఎం వస్తే దాని వెంట కనీసం 50 ఐటీ కంపెనీలైనా విశాఖ బాట పడతాయని నిపుణులు భావిస్తున్నారు. మరో అగ్రశ్రేణి ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయంతో మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఈ నెల 12న కీలకమైన అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)కుదుర్చుకోనుంది. ఇక దేశీయ అగ్రశ్రేణి ఐటీ కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.

మాంద్యం బారి నుంచి ఐటీ రంగం కోలుకుంటున్న నేపథ్యంలో విశాఖలోని ఐటీ సెజ్‌లలో నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. కంపెనీలూ ఈ నగరం పట్ల ఆసక్తి చూపుతుండటంతో మరో ఒకటి రెండు సంవత్సరాలు గడిచేసరికి ఐటీ రంగంలో విశాఖ అత్యంత కీలకంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఐబీఎం రాక కీలక మలుపు!
ఐబీఎం రావడం విశాఖ ఐటీ రంగంలో కీలకమైన మలుపుగా భావిస్తున్నారు. ఇంతవరకూ విదేశాలకు చెందిన సంస్థల్లో కెనెక్సా, సదర్‌లాండ్‌, హెచ్‌ఎస్‌బీసీ నగరంలో ఉన్నాయి. హెచ్‌ఎస్‌బీసీ బీపీవో రంగానికే పరిమితంకాగా, కెనెక్సా, సదర్లాండ్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశాయి. వాస్తవానికి కెనెక్సాకి చెందిన భవనంలోనే సదర్‌లాండ్‌ సంస్థ కొంత భాగం అద్దెకు తీసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజాల్లో సత్యం, విప్రో మాత్రమే విశాఖలో అడుగు పెట్టాయి. సత్యం మూడేళ్ల క్రితమే తమ కార్యకలాపాలు మొదలు పెట్టగా, విప్రో నగరం నడిబొడ్డున ఎనిమిది ఎకరాల్లో భవనం నిర్మించి వూరుకుంది. ఇప్పటిదాకా మాంద్యం కారణంగా జాప్యం జరిగింది. మాంద్యం తగ్గుముఖం పట్టడంతో త్వరలో కార్యలాపాలను ప్రారంభించాలని నిర్ణయించింది.

సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) విశాఖ విభాగం గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషి ఫలితంగా ఐబీఎం బృందం విశాఖకు వస్తోంది. విమానాశ్రయం, ఐటీ పార్కులు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్ని ఈ బృందం సందర్శించనుంది. మానవ వనరుల లభ్యతపై ఏయూలో గంటపాటు ప్రత్యేక ప్రెజేంటేషన్‌ను ఏర్పాటు చేసినట్లు రిజిస్ట్రార్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి 'న్యూస్‌టుడే'కి తెలిపారు. ఐబీఎం వంటి కంపెనీ విశాఖకు వస్తోందంటే ఇప్పటికే ఇక్కడి పరిస్థితులపై ఒక అవగాహనకు వచ్చి ఉంటుందని, వసతులపై ఏ మాత్రం సంతృప్తి చెందినా త్వరలోనే విశాఖలో ఆ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్‌ ఉచిత సాఫ్ట్‌వేర్‌
మైక్రోసాఫ్ట్‌ సంస్థ భవిష్యత్తులో తాము విడుదల చేయబోయే సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేందుకు అవసరమైన నిపుణుల్ని ఇప్పటి నుంచే తయారు చేసుకునేందుకు ఏయూతో కీలకమైన ఎంవోయూ కుదుర్చుకోబోతోంది. ఇప్పటికే జేఎన్‌టీయూ- హైదరాబాద్‌, అన్నా విశ్వవిద్యాలయాలతో ఇలాంటి ఒప్పందం ఉంది. ఒప్పందంలో భాగంగా ఏయూ పరిధిలోని 630 కళాశాలల్లో ఇంజినీరింగ్‌, సైన్స్‌ గ్రూపులు చదువుతున్న 3 లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తులో తాము మార్కెట్‌లోకి విడుదల చేయబోయే సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా అందజేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకు వచ్చింది. దానిని సద్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో తొలి విడతలో 100 కాలేజీల్లోని 75వేల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ లైసెన్సులు జారీ చేస్తున్నట్లు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రతి కళాశాలలో కొంత మంది విద్యార్థులకు ప్రాజెక్టు వర్కులు ఇచ్చేందుకు, అధ్యాపకులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా మైక్రోసాఫ్ట్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈనెల 12న జరిగే కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్‌ భారతవిభాగం అధిపతి వస్తున్నారని వెల్లడించారు.

ముందుంది బూమ్‌..!
హైదరాబాద్‌ తర్వాత ఐటీ రంగం అభివృద్ధికి అవకాశాలున్న ద్వితీయశ్రేణి నగరంగా విశాఖను పరిగణిస్తున్నారు. హైదరాబాద్‌లో కాలుష్యం, స్థలాల ధరలు పెరగడం, మానవ వనరుల ఖర్చూ ఎక్కువగా ఉండటంతో ఐటీ కంపెనీల దృష్టి సహజంగానే విశాఖవైపు పడింది. మధురవాడలోని రెండు కొండలపై ఏర్పాటుచేసిన ఐటీ సెజ్‌లలో 27 కంపెనీలకు స్థలాలు కేటాయించగా ఇప్పటికే ఐదు పని చేస్తున్నాయి. మిగతావి వేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి. 2వేల మంది అక్కడ పనిచేస్తున్నారు. ఈ కంపెనీలన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకుని కార్యకలాపాలు మొదలు పెడితే... ఒక్కో షిఫ్ట్‌లో 20వేల మంది చొప్పున మూడు షిఫ్టుల్లో 60వేల మంది పనిచేసే అవకాశం ఉంటుంది.