ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రాకుకాంట్రాక్టు ఇవ్వొచ్చా?
ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రాకుకాంట్రాక్టు ఇవ్వొచ్చా?
ఆదాయ పన్ను శాఖ అభిప్రాయాన్ని కోరిన జార్ఖండ్ ప్రభుత్వం హైదరాబాద్: ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు రూ.253 కోట్ల నీటి సరఫరా ప్రాజెక్టును ఇచ్చే విషయంపై జార్ఖండ్ ప్రభుత్వం ఆదాయ, విజిలెన్స్ శాఖల అభిప్రాయాన్ని కోరింది. 'దర్యాప్తు సంస్థల పరిశీలనలో సంస్థ ఉన్నట్లు మేం కొన్ని నివేదికలు చదివాం. ఈ నేపథ్యంలో ఈ కంపెనీకి ప్రాజెక్టును ఇవ్వడం సబబా కాదా అన్న విషయం ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటోంద'ని తాగునీరు, మురుగునీటి శాఖ(డీడబ్ల్యూఎస్‌డీ) కార్యదర్శి పి.కె. జొజోరియా అన్నారు. రెండు శాఖ(ఐటీ, విజిలెన్స్)ల సమాధానం కోసం తాము వేచిచూస్తున్నట్లు పీటీఐతో ఆయన ఫోన్లో పేర్కొన్నారు. రాంచీలో చేపట్టబోయే ఈ నీటి ప్రాజెక్టుకు సంబంధించిన ఐవీఆర్‌సీఎల్ బిడ్‌కు పది రోజుల కిందటే టెండర్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ విషయంపై ఐవీఆర్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ 'టెండర్ ప్రక్రియలో ఎల్1(లోయస్ట్ బిడ్డర్)గా వచ్చామని, కాంట్రాక్టు మాకే రావాలన్నారు. 'జార్ఖండ్ ప్రభుత్వ అభిప్రాయమేమిటో.. ఆదాయ పన్ను శాఖ లేదా ఏ ఇతర శాఖైనా మా అర్హతను దేని ఆధారంగా తేలుస్తుందో మాకు తెలియద'ని ఆయన అన్నారు. సంస్థ ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఝుమ్రి తిలయ్యా, డియోఘర్‌లలో వరుసగా రూ.26 కోట్లు; రూ.47 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను చేపట్టింది. కాగా, 'కంపెనీకి చెందిన ఏ కార్యాలయంలోను సోదాలు జరగలేదని.. ఐటీ శాఖ సోదాలు నిర్వహించిందంటూ వచ్చిన వార్తలు నిరాధారమని సంస్థ ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే.