తేనెలూరటం లేదు! గిరిజన ఉత్పత్తుల్లో ప్రధానమైన సంప్రదాయ తేనె సేకరణకు గడ్డు కాలం దాపురించింది. వాతావరణంలో వస్తున్న పెను మార్పులతో పట్టు తేనె క్రమంగా పట్టు కోల్పోతోంది. గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) రిటైల్ వ్యాపారంలో 20 శాతం వరకు ఆదాయం సమకూరుస్తున్న 'గిరిజన్ హనీ' ఇప్పుడు లక్ష్య సాధనలో ఎదురీదుతోంది. గిరాకీని తట్టుకునేందుకు గతంలో నిరుత్సాహపరిచిన 'పెట్టె తేనె'నే మళ్లీ ఆశ్రయించాలని జీసీసీ యత్నిస్తోంది.
లక్ష్య సాధనలో జీసీసీ ఎదురీత
మళ్లీ పెట్టెతేనే శరణ్యం?
తేనె.. అందాన్ని, ఆరోగ్యాన్ని తీర్చి దిద్దేదిగా ప్రజల్లో బలమైన ముద్ర వేసుకుంది. ఔషధ గుణాలు కలిగిన దీనిని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు విరివిగా వినియోగించవచ్చు. పంచదార కన్నా తేనెలో ఎక్కువ క్యాలరీల శక్తి ఉంది. బహిరంగ మార్కెట్లో అనేక బ్రాండులతో అమ్మకాలు జరుగుతున్నప్పటికీ, జీసీసీ విక్రయిస్తున్న 'గిరిజన్ హనీ' బ్రాండ్ జాతీయంగా మంచి ఆదరణకు నోచుకొంది. ఒకప్పుడు పెద్ద సంఖ్యలో చెట్లకు అంటిపెట్టుకుని కనిపించే తేనెపట్లు ఇప్పుడు బాగా తగ్గిపోవడానికి, గత కొన్నేళ్లుగా వాతావరణంలో వచ్చిన మార్పులు కారణం అయ్యాయంటున్నారు. ఉష్ణోగ్రతలో సమతౌల్యం లోపించటం, పోడు వ్యవసాయంలో చెట్ల నరికివేత, తేనె సేకరణకు గిరిజనులు అనుసరిస్తున్న పద్ధతులు తేనెటీగల వలసకు దారితీస్తున్నాయి. వెరసి తేనె సేకరణ లక్ష్యాలపైన పెను ప్రభావాన్ని కలగజేస్తున్నాయి. వాతావరణ మార్పులతో..
విశాఖ ఏజెన్సీతో పాటు రంపచోడవరం, శ్రీశైలం, కడప, చిత్తూరు, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో జీసీసీ తేనెను సేకరిస్తోంది. అన్ని చోట్ల ఒకే విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోవడం, చెట్లు, పుష్ప జాతుల సాంద్రత బాగా తగ్గిపోతుండడం ఏజెన్సీలో ఒకప్పుడు ఉన్న చల్లదనాన్ని క్రమంగా లోపించేలా చేస్తున్నాయి. బాక్సైట్ నిక్షేపాల వెలికితీత మొదలు కాక ముందే వాతావరణం ఇలా ఉంటే, ఆ తరువాత పరిస్థితులు మరెలా మారుతాయో అనే ఆందోళన మన్యం వాసుల్లో లేకపోలేదు. సెల్‌ఫోన్ టవర్ల ఏర్పాటు తేనె పట్లు తగ్గిపోవడానికి ఒక కారణమన్న ప్రచారం ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, సెల్ టవర్లకు సమీపంలోని చెట్లపై ఎక్కడా తేనెపట్ల ఆనవాళ్లు లేవు! దీంతో గతంలో గిరిజనులతో బలవంతంగా విరమింపజేసిన పెట్టెల్లో తేనె తయారీ ప్రక్రియ వైపు జీసీసీ మళ్లీ మొగ్గు చూపిస్తోంది. ఇదొక్కటే తమకున్న ఏకైక ప్రత్యామ్నాయ మార్గమని సంబంధిత అధికారులు చెప్తున్నారు. పట్టు తేనెతో పోలిస్తే పెట్టె తేనెకే మంచి ధర వస్తుందని, దీని నిర్వహణ ప్రమాద రహితమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
గతంలో ఏటా 2,200 నుంచి 2,300 క్వింటాళ్ల వరకు తేనె వచ్చేది. ఈ ఏడాది 1,000 క్వింటాళ్లు రావడమూ కష్టమేనేమో. ఇదివరకటి కన్నా కిలోకు పది రూపాయలు ధర పెంచాం. తేనె ఉంటే కదా, రావడానికి.. పెట్టె తేనెను ప్రోత్సహించాలని చూస్తున్నాం.ఇప్పటికే ఖాదీ బోర్డు అధికారులతో మాట్లాడాం. నర్సరీలు ఉన్న ప్రాంతాల్లో పెట్టెలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. - ఎస్.ఆదినారాయణ, జనరల్ మేనేజర్, జీసీసీ |
రాక్ బీ అనే పెద్ద రకం తేనెటీగలు రాళ్లపై, చెట్లపైనా పట్టులు పెడుతుంటాయి. చెట్టు పరిణామాన్ని బట్టి 40, 50 నుంచి వందా, రెండు వందల వరకు పట్లు పెడతాయి. వీటిలో నుంచి 15- 20 కిలోల తేనె వస్తుంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పు, చెట్ల నరికివేత, పోడు వ్యవసాయం, పారిశ్రామికీకరణ వంటి పలు కారణాల వల్ల తేనెటీగలు తగ్గిపోతున్నాయి. వర్షాభావం మరో చిక్కు తెచ్చింది. పట్టుతేనె బాగా తగ్గిపోవడానికి ఇవన్నీ కారకాలే. - శ్రీకాంత్, చింతపల్లి ఆర్‌ఎఆర్‌ఎస్ శాస్త్రవేత్త |
ఏప్రిల్, మేలో పెద్ద సీజను, అక్టోబరు, నవంబరులో చిన్న సీజను ఉంటాయి. గతంలో ఈ రెండు సమయాల్లో తేనె బాగా వచ్చేది. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. వాతావరణ పరిస్థితులు మారిపోవడం వల్లే ఇలా జరుగుతుందని అనుకుంటున్నాం. చెట్లపై వందల సంఖ్యలో ఉండే తేనెపట్లు ఇప్పుడు పదుల్లో కూడా ఉండటం లేదు. జీసీసీ పెట్టెలను సరఫరా చేస్తే వాటి ద్వారా తేనేను సేకరించి తిరిగి సంస్థకు అమ్మకాలు జరుపుతాం. అది మాకూ లాభసాటిగానే ఉంటుందని భావిస్తున్నాం. - రామారావు, రాంబాబు, రామగెడ్డ వాసులు |


