చేతికందని కాయకష్టం
నోటికందని పట్టెడన్నం
కాగితంపైనే 'నోటు'మాట
పేదలపై 'స్మార్ట్'గా దెబ్బ

మెదక్ జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామాన్నే తీసుకుందాం. రెక్కాడితేగానీ డొక్కాడని పల్లె బతుకులు వారివి. ఊరి జనమంతా కదిలారు. ఉపాధి హామీ కింద చెరువులో పూడిక తీత పనులు చేపట్టారు. దాదాపు 500 మంది ఈ పనిలో పాల్గొన్నారు. వీరికి రోజుకు ఒక్కొక్కరికి రూ.100 ఇవ్వాలి. కానీ నిన్నమొన్నటిదాకా రూ.80 మాత్రమే దక్కేది. మిగిలిన రూ.20 'పరుల' పాలయ్యేది. ప్రస్తుతం ఆ రూ.80 కూడా వారి చేతికందడంలేదు. ప్రతి 15 రోజులకు ఓసారి ఇవ్వాల్సిన ఈ డబ్బు వారాలు గడుస్తున్నా రావడంలేదు. దీనికీ ఓ కారణముంది. అదే ప్రభుత్వం స్మార్ట్‌గా తీసిన దెబ్బ. గతంలో వీరందరికీ పోస్టాఫీసుద్వారా డబ్బులు చెల్లించేవారు. ఇప్పుడు దానిని ఆపేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డు విధానంలో డబ్బులు చెల్లించాలనే నిబంధన తెచ్చారు. కొత్త నిబంధన ప్రకారమైనా చెల్లింపులు జరుపుతున్నారా? అంటే అదీలేదు. దీంతో పేదల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. మామిడ్యాలకు చెందిన పేదలకు ఇప్పుడు డబ్బులే అందడంలేదు. దీంతో వాళ్ల కడుపులు మాడుతున్నాయి. చేసిన పనులకు సంబంధించిన డబ్బుల వివరాలను తెల్ల కాగితాలపై రాసి... వాటినే దాచి పెట్టుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితి మామిడ్యాల గ్రామానికే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు 'న్యూస్‌టుడే' పరిశీలనలో వెల్లడైంది.
దామరకుంటదీ అదే దారి
మెదక్ జిల్లాలోనే మరో వూరు దామరకుంట పరిస్థితీ ఇదే. 'న్యూస్‌టుడే' ఆ గ్రామానికి వెళ్లినప్పుడు సుమారు 500 మంది ఎండలో పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా చేసిన పనికి సకాలంలో డబ్బులు రాకపోయినా... అలవాటైన మీదేమో... పనిచేసుకుంటూ పోతున్నారు. 'ఉపాధి హామీ పనుల్లో మీకు డబ్బులు చేతికొస్తున్నాయా?' అని 'న్యూస్‌టుడే' ప్రశ్నించగా... 'ఇంకా రాలేదయ్యా! మూడు వారాలకి.. ఒక వారమే (డబ్బులే) ఇచ్చిన్రు. ఇయ్యాల కాకపోతే రేపన్నా అస్తయ్ కదాని పనికివోతన్నం'' అన్నాడు అక్కడున్న ఓ నిరుపేద. దామరకుంటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి దాదాపు రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంది.
ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఉపయోగించుకోలేకపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1,500 కోట్లు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులే అంగీకరిస్తున్నారు. నగదు బదలాయింపులో జాప్యం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇప్పటివరకూ అనుసరిస్తూ వచ్చిన పద్ధతిని సవరించారు. 'కేంద్ర ద్రవ్యనిధి వ్యవస్థ'ను ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం... కూలీలకు స్మార్ట్ కార్డులిచ్చి ప్రత్యేక వ్యవస్థద్వారా డబ్బులు అందజేయాలని నిర్ణయించారు. అక్కడ మంచి ఫలితాలు వచ్చాయని చెబుతూ రాష్ట్రమంతా ఈ కార్డుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇబ్బందులను పూర్తిగా అధిగమించలేకపోయారు. ఈ కార్డుల జారీపై దృష్టి పెట్టడంవల్ల డబ్బుల పంపిణీలో జాప్యం జరుగుతోందని క్షేత్ర స్థాయిలోని పర్యవేక్షకులు చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఇదీ పరిస్థితి
దేశంలోనే తొలిసారిగా కూలీ డబ్బులు చెల్లించేందుకు నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన 'బయోమెట్రిక్' విధానం 8 నెలలు గడుస్తున్నా బాలారిష్టాలు దాటకపోవటంతో కూలీలు అవస్థలు పడుతున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానంలో కూలీల నమోదు, పనుల రికార్డు, చెల్లింపులకు 'ఏపీ ఆన్‌లైన్'తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కూలీల రెండు చిటికెన వేళ్లు మినహా మిగిలిన వేళ్ల ముద్రలను సేకరించారు. వీటిలో ఏ ఒక్క వేలిముద్ర సరిపోలినా డబ్బులు ఇస్తారు. 2009 జూన్ నెల 22 తేదీన దేశంలో మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో 'బయోమెట్రిక్' ద్వారా కూలీలకు డబ్బులు చెల్లించే ఈ విధానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లాలోని 36 మండలాల్లో ఈ విధానంలోనే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. ఇందులో పనిచేసిన మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించాల్సి ఉండగా మూడు నెలలు దాటినా ఇచ్చే పరిస్థితి లేదు. వేలిముద్రలు సరిపోలడంలేదని డబ్బులు ఇవ్వటంలేదు.
* లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన కలాల్ చంద్రకళకు మూర్చ వ్యాధి ఉంది. ప్రతిరోజూ మందులు వేసుకుంటూ పొట్ట కూటి కోసం మండు టెండలో కూలీ పనికి వెళ్తోంది. ఐదు నెలలుగా వారానికొకటి చొప్పున ఇచ్చిన 14 చీటీలు ఆమె వద్ద ఉన్నాయి. మొత్తం రూ.6,500 రావాలి. వేలిముద్రలు సరితూగటం లేదని ఇంతవరకూ నయాపైసా ఆమెకు ఇవ్వలేదు. |
* కోరంపల్లి రాజగౌడ్‌దీ ఇదే పరిస్థితి. ఈయనకు రూ.3వేలు రావాలి. జనవరి నుంచి డబ్బులు ఇవ్వటంలేదు. అంతకుముందు మూడుసార్లు వేలిముద్రల ద్వారా తీసుకున్నాడు. ఇప్పుడేమో యంత్రం అంగీకరించటంలేదని ఇవ్వడం లేదు. చేసిన పనికి డబ్బులు రాకపోవటంతో అప్పుచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. |
| * వేలిముద్రలు సరిగాపడటం కోసం డిచ్‌పల్లి మండలం అమృతాపూర్ కూలీలు అనుసరిస్తున్న ఉపాయాలు ఆశ్చర్యపరుస్తాయి. నేలపై వేలిని రాయటం, గోడకు రాపిడి చేయటం, రాత్రికి వ్యాజ్‌లిన్ పెట్టుకుని తెల్లవారుజామున బయోమెట్రిక్ యంత్రం వద్దకు వెళ్లడం వీరి దినచర్య. కిరణ్, శ్రీకాంత్, శారద, దత్తు, బాలమణి, లక్ష్మణ్, భూదేవి, అనిత అనే కూలీలకు ఒక్కొరికికి రూ.4వేల నుంచి రూ.5వేలు రావాల్సి ఉంది. మూడు నెలలుగా చెల్లింపుల్లేవు. |

