Monday, March 22, 2010

ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధం

నియంత్రణలు ఎత్తేసిన ఫలితం
గడువుకు ముందే ప్రయత్నాలు
ఎస్‌ఎస్‌పీని రూ.250 నుంచి 300 వరకూ పెంచే యత్నం
డీఏపీ డిమాండును తగ్గించే యోచనలో ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఫాస్ఫేట్‌, పొటాష్‌లపై ఉన్న నియంత్రణలను ప్రభుత్వం ఎత్తివేసిన నేపథ్యంలోఎరువుల ధరలను పెంచుకునేందుకు కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ధరలను పెంచుకునేందుకు వచ్చే నెల ఒకటో తేదీ వరకూ సమయం ఉన్నా... అప్పుడే కంపెనీలు ధరలను పెంచేపనిలోపడ్డాయి. ఇప్పటికే డీలర్లు అనధికారికంగా ఎరువుల ధరలను పెంచేశారు. సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ (ఎస్‌ఎస్‌పీ)లో 16 శాతం ఫాస్ఫరస్‌, 11 శాతం సల్ఫర్‌ ఉండటంతో అధికారికంగా ముందు దీని ధరను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఎస్‌ఎస్‌పీ 50 కిలోల బస్తా ధరను ప్రభుత్వం గతంలో రూ.190గా నిర్ణయించింది. డీఏపీ బస్తా రూ.500 ఉండగా, రూ.30 పెరిగే అవకాశం ఉందని అధికారులే భావిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఎస్‌ఎస్‌పీ ధరను 250 నుంచి 300 రూపాయల వరకూ పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఎస్‌పీ ఎరువు ధర రూ.230 (బస్తా) కంటే తక్కువ ఉండేలా చూడాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలను కోరే అవకాశం కన్పిస్తోంది.

డై అమ్మోనియం ఫాస్ఫేట్‌ (డీఏపీ) బదులుగా రైతులు ఎస్‌ఎస్‌పీని వాడుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. డీఏపీని దిగుమతి చేసుకుంటున్నందున దాని డిమాండును తగ్గిస్తే... సబ్సిడీ భారం కొంత తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్‌ఎస్‌పీ ధర ఎట్టిపరిస్థితుల్లో రూ.230 మించడానికి వీల్లేదని ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే 60 లక్షల టన్నుల డీఏపీని దిగుమతి చేసుకుంది. స్థానికంగా 30 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని సమాచారం. ఏటా 25 లక్షల ఎస్‌ఎస్‌పీ ఎరువు మన దేశంలోని 80 కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి.