ఏప్రిల్-మేలో సిమెంట్ ధరలు తగ్గొచ్చు
ఏప్రిల్-మేలో సిమెంట్ ధరలు తగ్గొచ్చు 
ముంబయి: స్థిరాస్తుల ధరలు ఎగువకు పయనిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, సిమెంటు ధరలు ఏప్రిల్-మే కల్లా క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎగసిన సిమెంటు ధరలు, పలు కంపెనీలు ఇటీవల వాటి ఉత్పత్తి సామర్థ్యాల్ని పెంపొందించుకొన్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి దిగి రావచ్చని ఈ రంగం పరిశీలకులు తలపోస్తున్నారు. సిమెంటుకు పెరుగుతున్న గిరాకీని సరఫరాలు అధిగమించగలవని, తత్ఫలితంగా ఏర్పడే ఒత్తిడి వల్ల ధరలు ప్రభావితం అవుతాయని షేర్‌ఖాన్ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. 'కంపెనీలు గిరాకీని బట్టి వాటి ఉత్పత్తి సామర్థ్య వినియోగ ప్రణాళికలను రూపొందించుకొంటాయి. దీర్ఘ కాలంలో అవి గిరాకీకి, సరఫరాలకు మధ్య సమతూకాన్ని సాధించాయంటే గనక సిమెంట్ ధరలు స్థిరపడతాయి. అయితే కంపెనీలు తమ స్థిర వ్యయాలు అనుమతించే స్థాయి వరకు మాత్రమే వినియోగ స్థాయిలను కుదించుకోగలుగుతాయి. ఆరు నెలల్లో సామర్థ్య వినియోగం 50-60 శాతం దాకా పెరగవచ్చు. రెండంకెల స్థాయిలో వర్ధిల్లుతున్న డిమాండ్ ఏప్రిల్- మేకల్లా తగ్గుతుంది' అని కార్వీ స్టాక్ బ్రోకింగ్ రిసర్చ్ అనలిస్ట్ అమిత్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. గత జనవరి వరకు దేశ వ్యాప్తంగా 10 మిలియన్ టన్నుల (ఎంటీ) కొత్త సామర్థ్యం ఈ పరిశ్రమకు తోడయినట్లు మరొక విశ్లేషకుడు లెక్కగట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక సిమెంట్ మిగులు 6 ఎంటీ ఉండగా, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇది మూడింతలై 22 ఎంటీకి చేరుతుందని భావిస్తున్నట్లు ఎంకే గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ తెలిపింది. సిమెంట్ ధరలు 2009 జులై మధ్య నాటి అధిక స్థాయి అయిన రూ.257ను మించిపోయే అవకాశం తక్కువని ఈ సంస్థ పేర్కొంది. ఏంజెల్ కమోడిటీస్ అనలిస్ట్ వి.శ్రీనివాసన్ 'కామన్‌వెల్త్ క్రీడలు, మౌలిక సదుపాయాల కల్పన వ్యయం, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం జోరు వంటి వాటి కారణంగా తలెత్తిన గిరాకీ మే నెల వరకు సిమెంట్ ధరలను నిలకడగా ఉంచగలుగుతుంది. అయితే, గత కొద్ది నెలలుగా కంపెనీల కొత్త ఉత్పత్తి సామర్థ్య వినియోగంలోకి వచ్చి ధరల్లో దిద్దుబాటుకు తావు ఇవ్వచ్చనుకుంటున్నాం' అని వివరించారు.