మూడేళ్లలో 3% వృద్ధి
ఆర్‌బీఐ అధ్యయనంలో వెల్లడి
పర్షియా సింధు శాఖ ప్రాంత దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల నుంచి ఇండియాకు జరుగుతున్న చెల్లింపులు మూడేళ్ల కాలంలో 3% పెరిగినట్లు వెల్లడి అయింది. 2006లో 24 శాతంగా ఉన్న గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐల చెల్లింపులు 2009కల్లా 27 శాతానికి ఎగశాయని రిజర్వ్ బ్యాంకు అధ్యయనంలో తేలింది. ఇదే సమీక్షా కాలానికి ఉత్తర అమెరికా నుంచి ఎన్‌ఆర్‌ఐల చెల్లింపులు 44% స్థాయి నుంచి 38% స్థాయికి పడిపోవడం గమనార్హం. అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఉద్యోగ కోతలు వెరసి.. ప్రవాసులకు మాతృ దేశానికి పంపించేందుకు తగినంత డబ్బును వారి వద్ద మిగల్చలేదని తెలుస్తోంది. మరో పక్క సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, యూఏఈ, బహ్రెయిన్‌ల వంటి చమురు దేశాల నుంచి భారత్‌కు ప్రవాసులు జరిపిన చెల్లింపుల వెనుక ముడి చమురు ధరల్లో చోటు చేసుకొన్న మార్పుల ప్రభావం ఉన్నట్లు అర్థం అవుతోంది. ఆమధ్య కొంత కాలం నుంచి భారతీయ బ్యాంకులు వ్యాపార కార్యకలాపాలను విదేశాలకు విస్తరించడం మొదలుపెట్టాయి. విదేశాల్లో, ముఖ్యంగా చమురు దేశాల్లో శాఖలను పనిచేస్తున్న భారతీయులపై ఇవి దృష్టి పెడుతున్నాయి. వారి పొదుపు మొత్తాల నిర్వహణను, ఇంటికి పంపే డబ్బు లావాదేవీలను ఈ బ్యాంకుల శాఖలు ఆకర్షించడం భారత్‌కు ప్రవాసుల అధికారిక చెల్లింపులు వృద్ధి చెందడానికి కొంత కారణం. అంత క్రితం వరకు ప్రవాసులు హవాలా వంటి అనధికార మార్గాలను ఆశ్రయించేవారన్నది విదితమే. భారత్‌కు ప్రవాసులు జరిపిన చెల్లింపులు గతేడాది రూ.2.16లక్షల కోట్లు ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనా.
స్వదేశ ఉపాధి బాటలో ఎన్నారైలు న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల (ఎన్నారైల)కు, విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్నవారికి భారతీయ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడం అనేది గత రెండేళ్లలో అధికం అవుతోంది. ఎన్‌ఆర్‌ఐలు, ఎక్స్‌పాట్రియేట్ వర్గాలు ఉపాధి కోసం స్వదేశానికే తిరిగి చేరుకోవడానికి తగిన బలమైన కారణాలు లేకపోలేదని గ్లోబల్‌హంట్ ఇండియా, ఈఎంఏ పార్ట్‌నర్స్ ఇంటర్‌నేషనల్ వంటి మానవ వనరుల భర్తీ సంస్థలు పేర్కొంటున్నాయి. భారత కంపెనీలు తమ కార్యకలాపాలను వివిధ దేశాలకు విస్తరించబూనడం, వృత్తి నైపుణ్యంతో పాటు అనుభవం ఉన్న వారి సేవలను అన్వేషించడం, పోటీ కంపెనీలకు దీటుగా జీతభత్యాలను ఇవ్వజూపుతుండడం ఈ కారణాల్లో కొన్ని అని అవి వివరిస్తున్నాయి. అదీ కాక, విదేశాల్లో ఆర్థిక సంక్షోభం అనంతరం ఆర్థిక వ్యవస్థలు కోలుకొనే ప్రక్రియ కాస్త నెమ్మదిగా ఉండటం కూడా పలువురిని భారత్ వైపు మళ్లేటట్లు చేస్తోందని పరిశీలక వర్గాలు చెప్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న వారిని ఉద్యోగాల్లోకి తీసుకొంటున్న భారత కంపెనీల్లో ముఖ్యంగా బ్యాంకింగ్- ఫైనాన్షియల్ సేవల (బీఎఫ్‌ఎస్) రంగం, వాహన రంగం, మౌలిక సదుపాయాల కల్పన రంగం, ఔషధ ఉత్పత్తి, చిల్లర వర్తక రంగం వంటివి ఉన్నాయట. వాహన రంగంలో ఎక్స్‌ప్యాట్ల నియామకాలు మూడింతలు పెరగగా, బీఎఫ్‌ఎస్ రంగంలో ఇది అయిదు నుంచి ఆరింతలు ఉందని తెలుస్తోంది.