Tuesday, March 2, 2010

బడ్జెట్‌ బండికి విదేశీ కందెన

బడ్జెట్‌ బండికి విదేశీ కందెన
పెరుగుతున్న ప్రపంచ బ్యాంకు రుణాలు
వాటితోపాటు ఆంక్షలూ పెంపు
మరిన్ని పథకాలకు విదేశీసాయం
వైపు సర్కారు చూపు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్ర బడ్జెట్‌లో విదేశీ రుణాల వాటా క్రమేణా పెరుగుతోంది. వివిధ పథకాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రపంచ బ్యాంకు వంటి విదేశీ ఆర్థిక సంస్థలపై రాష్ట్ర సర్కారు మరింతగా ఆధారపడబోతోంది. కొత్త బడ్జెట్లోని వార్షిక ప్రణాళిక కేటాయింపుల్లో 7.39 శాతం ఇప్పుడు విదేశీ సంస్థల నుంచే రావాల్సివుంది. ఇలా నిధులను ఇవ్వటానికి ఆయా సంస్థలు విధించే ఆంక్షలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అమల్లోకి తేవాల్సివుంటుంది.

బడ్జెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పరిమితంటూ లేకుండా అప్పుల్ని తెచ్చుకోనే అధికారం కావాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు విదేశీ రుణాలకూ ఎగబడుతోంది. తాజా 2010-11 వార్షిక ప్రణాళికలోని 17 రకాల కార్యక్రమాల్ని ఇలా విదేశీ సాయంతోనేచేపట్టదలచింది. వార్షిక ప్రణాళిక మొత్తం రూ.36,727 కోట్లలోనూ ఇలా విదేశీ సాయం ద్వారా రూ.2,716 కోట్లు(7.39 శాతం) రావాల్సివుంది. ఇందులో అత్యధిక భాగం ప్రపంచ బ్యాంకు నుంచే వస్తుంది. బ్రిటన్‌కు చెందిన డీఎఫ్‌ఐడీ వంటివి కూడా కొంతమేర సాయపడతాయి. ఆయా సంస్థలు ఇప్పటికే అంగీకరించిన పథకాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇలా బడ్జెట్లో కేటాయింపులు జరుపుతుంది. చేయూత అందివ్వాలంటూ ప్రపంచ బ్యాంకును కోరటం ఇటీవల ఎక్కువయింది. ఈ వైఖరి కొత్త వార్షిక ప్రణాళికలో ప్రస్ఫుటమయింది. ఇటీవల కొన్ని కొత్త పథకాలకు నిధులు ఇవ్వటానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించటం వల్లే వార్షిక ప్రణాళికలో విదేశీసాయం వాటా కూడా పెరిగింది. 2006-07 వార్షిక ప్రణాళిక ద్వారా ఖర్చుపెట్టిన మొత్తంలో ఇలా విదేశీ సంస్థల నుంచి వచ్చిన రుణాలు 9.18 శాతం ఉన్నాయి. ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ శాతం తక్కువగానే ఉంటూ వచ్చి ఇప్పుడు కొత్త ప్రణాళికలో మళ్లీ ఎగబాకింది.

ఎన్నికలకు ముందు గత ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టిన 2019-10 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో విదేశీ సాయం వాటాను 9.57 శాతంగా చూపించి బడ్జెట్‌కు నిండుతనం చేకూర్చినా ఆ తర్వాత పూర్థిస్థాయి బడ్జెట్‌లో దాన్ని తగ్గించక తప్పలేదు. తాజా సవరణలో ఇది ఇంకా 5.31 శాతానికి తగ్గింది. వివిధ నిబంధనలను అమలుచేయటం లేదని ప్రపంచ బ్యాంకు భావిస్తే ఇలా నిధుల మంజూరీని నిలిపివేస్తుంది. సర్దుబాటు రుణాన్ని నిలిపివేయటం ఇందుకో నిదర్శనం. ఆర్డినెన్సు స్థానంలో పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ బిల్లును తేకపోవటం వల్లే దాదాపు రూ.200 కోట్ల రుణాన్ని ప్రపంచబ్యాంకు ప్రస్తుతం తొక్కిపెట్టింది. ఈ రుణం తక్కువే అయినప్పటికీ ప్రపంచ బ్యాంకు నిబంధనలను పాటించటమే ముఖ్యం కనుక బిల్లును తేవటానికి ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ఇటువంటి నిబంధనలు మరెన్నింటినో అమలుచేస్తోంది. ప్రపంచబ్యాంకు ఇచ్చే రుణాలపై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. తిరిగి చెల్లించనక్కరలేని గ్రాంట్లు కూడా కొంతమేర అందుతాయి. ఈ కారణాల వల్లనే విదేశీ రుణాల కోసం రాష్ట్రం ఎగపడుతోంది. ఇటీవల వరదలకు అతలాకుతలమైన ప్రాంతాల్లో పునర్‌ నిర్మాణ పనులకు, గ్రామీణాభివృద్ధి పథకాలకు సాయపడాలంటూ కూడా ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరబోతోంది.