బఫెట్ సూత్రావళి కామేశం స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టాడు. రంగంలోకి దిగడమైతే దిగాడు కానీ ఏ షేర్లు కొనాలి.. ఎన్ని కొనాలి.. ఎపుడు కొనాలి.. ఎపుడు అమ్మాలి అనే కాదు.. ఏ కంపెనీలను ఎంచుకోవాలి.. ఏవి కూడదు.. ఇలా సవాలక్ష అనుమానాలొచ్చాయి. తెలిసిన వారిని.. స్నేహితులను వాకబు చేశాడు. ఇప్పటికే కాస్త అనుభవం ఉన్న వారిని గురువులుగా భావించి సలహాలు తీసుకుంటూనే ఉన్నాడు. అయితే తాను వూహించినట్లుగా ఏమీ జరగలేదు.. ఎందుకిలా..?
మనలో ఎందరో కామేశాలకు కలిగే అనుభవమే ఇది. కాస్తాకూస్తో అనుభవం ఉన్నవారినే మనం ప్రమాణంగా తీసుకుంటున్నపుడు ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకున్న, కాకలు తీరిన పెట్టుబడిదారు వారెన్ బఫెట్ సలహాలు ఎందుకు పరిశీలించకూడదు..? పెట్టుబడులు పెట్టే విషయంలో బఫెట్ అనుసరించే ప్రధాన సూత్రం ఒకటే.. అది ఆర్థికంగా నిలబడి ఉన్న కంపెనీలను ఎంచుకోవడమే. ఆ తర్వాత.. *సంబంధిత కంపెనీ వినియోగదారు విశ్వాసాన్ని చూరగొని మంచి బ్రాండ్‌గా ఉందా?
*కంపెనీ స్థిరంగా లాభాలను ఆర్జించడమే గాక ఆదాయాలను పెంచుకుంటూ పోతోందా?
*రుణాలు, ఈక్విటీ నిష్పత్తి తక్కువగా ఉందా? లేదా ఆదాయ, రుణ నిష్పత్తి ఎక్కువగా ఉందా? అంటే కొన్నేళ్లలో కంపెనీకి తన ఆదాయాల ద్వారా అప్పులన్నీ తీర్చే సత్తా ఉందా?
*గత కాలంలో ఈక్విటీపై ప్రతిఫలం(ఆర్‌ఓఈ) అధికంగానే ఉందా? అది పరిశ్రమ సగటు కంటే ఎక్కువగా ఉందా? మొత్తం మూలధనంపై అధిక, స్థిరమైన ప్రతిఫలాలను పొందుతోందా?
* కంపెనీ తన ఆదాయాలను మంచి వ్యాపార అవకాశాల్లో తిరిగి పెట్టుబడులు పెడుతోందా?
* ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తక్కువగానే ఉన్నాయా?
ఈ అంశాలకు తోడు షేర్లు ఎప్పుడు కొనాలన్నది అత్యంత కీలక సమయమని చెబుతారు బఫెట్. కంపెనీ షేరు విలువ సరిగ్గా అంచనా వేయలేనపుడు అసలు తొందరపడకూడదు అంటారాయన. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నా.. పడుతున్నా.. నిర్ణయాలు మాత్రం స్థిరంగా ఉండాలంటారు బఫెట్.