Monday, March 22, 2010

కుమర్‌కోమ్‌ పంచాయతీ ప్రత్యేకత


కుమర్‌కోమ్‌ పంచాయతీ ప్రత్యేకత
రెండేళ్లలో రూ.37 లక్షల ఆదాయం
అధ్యయనంపై విదేశీ సంస్థల ఆసక్తి
వినూత్నం
కేరళ బ్యాక్‌వాటర్స్‌లో అదో గ్రామ పంచాయతీ.. పేరు కుమరకోమ్‌. కొబ్బరి చెట్లు, పడవ ఇళ్లు, ఎటు చూసినా నీళ్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. సాధారణంగానే ఇవన్నీ పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. విదేశీయుల్ని అయితే మరీనూ. కేరళలో కుమరకోమ్‌కు పర్యాటకుల సందడి ఎక్కువే. ఈ గ్రామంపై ఇప్పుడు అందరి దృష్టీ పడుతోంది. కారణం.. రెస్పాన్స్‌బుల్‌ టూరిజం.

పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తూ.. వాళ్లు తిరిగి వెళ్లేవరకు వారి అవసరాలను నెరవేరుస్తూ.. తలలో నాలుకలా వ్యవహరిస్తూ.. వారికి ఆహ్లాదాన్ని కలిగించడమే గాక, నాలుగు రాళ్లు వెనకేసుకోవడం ఈ రెస్పాన్స్‌బుల్‌ టూరిజం ప్రధానోద్దేశం. రెండేళ్ల కిందట దీన్ని ప్రారంభించినపుడు పెద్దగా ప్రయోజనం ఉంటుందని ఎవరూ భావించలేదు. కేవలం 1600 మంది జనాభాతో కూడిన ఈ గ్రామ పంచాయతీ ఈ రెండు సంవత్సరాల్లో రూ.37 లక్షలను ఆర్జించింది. స్థానికులకు ఆర్థిక ఆసరానిచ్చే ఈ పథకం ఎలా ఉంటుందంటే..

ఇలా సాధించారు: పర్యాటకానికి వచ్చే విదేశీయులకు అక్కడి స్థానికులు తమ నైపుణ్యాన్ని చూపిస్తారు.. అంతేకాదు తమ ఉత్పత్తులనూ విక్రయిస్తారు. స్థానికులతో పాటు వెళ్లి పర్యాటకులు సైతం చేపలు పట్టడం.. పొలాలు సాగు చేయడం వంటివి చేస్తారు. ఇది వారికి అదనపు ఆదాయాన్ని అందిస్తుంది. అంతే కాదు కేరళకు మరింత పర్యాటకులు వచ్చేందుకూ దోహదం చేస్తోంది. పరోక్షంగా చెప్పాలంటే స్థానికులే అక్కడి పర్యాటకానికి ప్రచారకర్తలన్న మాట. తొలుత ఈ పథకం మార్చి 2008లో కూరగాయల సాగు ద్వారా ప్రారంభమైంది. పంచాయతీలోని వివిధ హోటళ్లకు ఈ బృందాలు కూరగాయలను సరఫరా చేసేవి. ప్రస్తుతం అక్కడున్న 15 హోటళ్లు(విలాసవంతమైన హోటళ్లు సహా) ఈ బృందాలందించే కూరగాయలనే వాడుతున్నాయి. గత ఏడాదిన్నరలో ఇక్కడి స్థానికుల జీవితంలో చాలా మార్పు వచ్చింది. గ్రామీణ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించవచ్చు. ఈ పథకం వల్ల స్థానికులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి బాటలో పయనించడం గమనార్హం.

ప్రభుత్వ అవార్డు సైతం
కుమరకోమ్‌ సాధించిన విజయానికి 2008-09 ఏడాదికి ఉత్తమ బాధ్యతాయుత పర్యాటక అవార్డును భారత ప్రభుత్వం అందించింది. అంతే కాదు ఈ పర్యాటకానికి కుమరకోమ్‌ మోడల్‌ అని పిలిచేంతలా ఆ పంచాయతీ ఎదిగింది. వివిధ విదేశీ సంస్థలు ఈ మోడల్‌ను ఆకళింపు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. హాంకాంగ్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, బెల్జియంల నుంచి పలు బృందాలు సైతం ఇక్కడకు వచ్చి అధ్యయనాలు చేస్తున్నాయంటే ఈ స్థానిక విజయం ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. సాధించిన విజయం ఆనందకరమేనని అయితే ప్రస్తుత పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్‌ జి.సి. దామోదరన్‌ పేర్కొనడం విశేషం.