Tuesday, March 2, 2010

పాకెట్‌ మనీ కాదు.. జీతం : ఇంజినీరింగ్‌ అధ్యాపకుల వేతనాలు

పాకెట్‌ మనీ కాదు.. జీతం
ఇంజినీరింగ్‌ అధ్యాపకుల వేతనాలు
రూ.4 వేలతో మొదలు
యాజమాన్యం దగ్గరే నియామక పత్రాలు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలోని ఒక గ్రామీణ ఇంజినీరింగ్‌ కళాశాలలో అధ్యాపకుడికి ఇస్తున్న జీతం నెలకు నాలుగు వేల రూపాయలు. అదీ రసీదు రూపంలో. ఇది రాష్ట్రంలో చాలామంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల పాకెట్‌ మనీ కన్నా తక్కువే. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపకులు తీవ్ర అసంతృప్తితో బతుకు బండి లాగిస్తున్నారు. కష్టపడి ఉన్నత చదువులు చదివి, ఆసక్తితో బోధనావృత్తిలో అడుగు పెట్టిన వీరికి అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. అనుభవానికి తగిన వేతనాలను ఇవ్వకపోవడంతో చాలామంది సాఫ్ట్‌వేర్‌ రంగంవైపు దృష్టి సారిస్తున్నారు. కొత్తగా అధ్యాపక వృత్తిలోకి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలోని 656 ఇంజినీరింగ్‌, 278 ఫార్మసీ కళాశాల్లో 70 వేలమంది అధ్యాపకులుగా పని చేస్తున్నారు. వీరి స్థితిగతులపై ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం (అపేక్టా) అధ్యయనం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

* సహాయ ఆచార్యుడికి రూ.24,000, సహ ఆచార్యుడికి రూ.35,000, ఆచార్యుడికి రూ.45 వేలు వేతనంగా ఇవ్వాలి. ఎక్కడో తప్ప అమలు కావడం లేదు. ఆరో వేతన సంఘం సూచనల ప్రకారం అయితే రూ.35000, రూ.50000, రూ.80,000 చొప్పున ఇవ్వాల్సి ఉంది.
* పేరున్న కళాశాలల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉన్న అధ్యాపకులకు రూ.20 వేల నుంచి రూ.35 వేలు చెల్లిస్తున్నారు. భౌతిక శాస్త్రం, ఆంగ్లం, లెక్కలు, రసాయన శాస్త్రం బోధించే అధ్యాపకులకు 6-8 వేల రూపాయల వేతనం ఇస్తున్నారు.
* పీహెచ్‌డీ అర్హత కలిగిన వారికి కాస్త డిమాండ్‌ ఉంది. ఎక్కువ మంది అధ్యాపకులు బీటెక్‌ అర్హతతోనే పాఠాలు చెబుతున్నారు.
* చాలామంది అధ్యాపకులకు నియామక పత్రాలు లేవు. మరికొన్ని చోట్ల నియామక పత్రాన్ని ఇస్తూనే, తిరిగి తీసుకొని తమ దగ్గర పెట్టుకుంటున్నాయి.
* కొన్నిచోట్ల 'సెమిస్టర్‌' పద్ధతిలో గుత్త వేతనాలు కుదుర్చుకుంటున్నారు.
* ఇబ్రహీంపట్నం లాంటి చోట్ల పక్కపక్కనే ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండటంతో వారానికి మూడు రోజులు ఒక కళాశాలలో, మరో మూడు రోజులు ఇంకో కళాశాలలో బోధకులుగా పనిచేస్తున్నారు. వీరికి అక్కడ 'మొబైల్‌ ఫ్యాకల్టీ'గా ముద్దుపేరు పెట్టుకున్నారు.
* అధ్యాపకులు ఒకే కళాశాలలో నిలకడగా పని చేయడం లేదు. వెయ్యి రూపాయలు ఎక్కువ వచ్చినా చాలునని పరిగెత్తుతున్నారు.
* విధుల నిర్వహణలో యాజమాన్యంతో తలెత్తే సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులను సంప్రదించే అవకాశమే అధ్యాపకులకు లేదు.
* అధ్యాపకుల నియామకంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిర్దేశించిన ప్రమాణాలను ఎవరూ పాటించడం లేదు. కళాశాలలకు అనుమతులు, కోర్సుల గుర్తింపుల మంజూరు సమయంలో పారదర్శకత ఉండటం లేదు.
* ఇచ్చే స్వల్ప వేతనాలూ సకాలంలో అందడం లేదు. కొన్ని కళాశాలల యాజమాన్యాలకు ఆర్థిక సమస్యలు లేకున్నా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు పెడుతూ... అధ్యాపకుల వేతనాలను రెండు, మూడు నెలలు ఆలస్యంగా చెల్లిస్తున్నాయి.
* రాష్ట్ర ప్రభుత్వం బోధనా ఫీజు చెల్లింపు పథకం కింద నిధుల చెల్లింపులో తీవ్ర జాప్యం కూడా అధ్యాపకుల వేతనాల చెల్లింపుపై ప్రభావం చూపుతోంది.