Tuesday, March 2, 2010

తప్పలేదు.. రిస్క్‌ తీసుకున్నా :వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో ప్రణబ్‌

తప్పలేదు.. రిస్క్‌ తీసుకున్నా
ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్ఠమవ్వాలి
అప్పటిదాకా ఉద్దీపనలు ఉపసంహరించం
త్వరలోనే రెండంకెల వృద్ధి
ఎగుమతుల పరిధి పెరగాలి
వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో ప్రణబ్‌
న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ కార్పొరేట్‌ వర్గాలకు భరోసా ఇచ్చారు. బడ్జెట్‌లో తీసుకున్న చర్యల ద్వారా ఆర్థిక వృద్ధి రేటు దూసుకుపోగలదనే ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. శనివారమిక్కడ జరిగిన ఫిక్కీ వార్షిక సాధారణ సమావేశంలో ప్రణబ్‌ పాల్గొని, ప్రసంగించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

మరో పదేళ్లు ఆశాజనక పెట్టుబడులు
అత్యంత సమీప భవిష్యత్తులో రెండంకెల వృద్ధిరేటు లక్ష్యాన్ని భారత్‌ ఛేదించగలదని నాకు పూర్తి నమ్మకం ఉంది. పేదరికాన్ని తగ్గించేందుకు ఆ స్థాయిలో దేశం పురోగమించటం అత్యవసరం. ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని పుంజుకొనేవరకు (రొబస్ట్‌ రికవరీ) ఉద్దీపన పథకాలను పూర్తిగా వెనుకకు తీసుకునే ఆలోచన ఏదీ లేదు. ఇటీవల సాధించిన ఆశాజనకమైన పురోగతి తాలూకూ సానుకూల ఫలితాల ముసుగులో ప్రతికూల అంశాలు కనిపించకుండా పోయాయి. మధ్య, దీర్ఘ కాలాల్లో ఆర్థిక వ్యవస్థలోని వృద్ధి నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో ఆర్థిక స్థిరీకరణ (ఫిస్కల్‌ కన్సాలిడేషన్‌)కు కృషి చేసేందుకు కట్టుబడ్డాను. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు.. ఈ రెండూ తగినంత పుష్టిగా ఉన్నపుడే ఇది సాధ్యపడుతుంది. ఇప్పటివరకు ఆర్థిక వృద్ధికి కీలక చోదక శక్తిగా ఉన్న పెట్టుబడులు కనీసం మరో పదేళ్ల పాటు అదే విధంగా కొనసాగవచ్చు.

ఈ సంవత్సరం 7.2% వృద్ధి ఖాయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 వార్షిక వృద్ధి రేటు సాధిస్తామని చెప్పగలను. వ్యవసాయ రంగం పేలవమైన ప్రదర్శన వల్లే మూడో త్రైమాసికంలో జీడీపీ తక్కువగా వృద్ధి చెందింది. మొదటి త్రైమాసికంలో వ్యవసాయ రంగం 2% వృద్ధి చెందింది. రెండో త్రైమాసికంలో అది ఒకటి శాతం కన్నా తక్కువే ఉన్నా, మైనస్‌లోకి వెళ్లలేదు. కానీ అక్టోబరు- డిసెంబరులోనే మైనస్‌ 2.6 శాతంగా ఉంది. రెండో త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి దేశ ఆర్థిక రంగాన్ని పెద్ద మలుపు తిప్పింది. నేననుకోవడం.. కేంద్ర గణాంక సంస్థ ముందస్తుగా అంచనా వేసినట్లు ఈ సంవత్సరానికి 7.2 శాతం వృద్ధి ఉండవచ్చు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో డీటీసీ బిల్లు
సవరించిన ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ)ని రూపొందించేందుకు కసరత్తు చేస్తామని కంపెనీలకు హామీ ఇస్తున్నాను. దానికి తుది రూపును ఇచ్చే ముందు అందరి అభిప్రాయాలను సేకరిస్తాం. ఆ తరువాతే దానికి చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమవుతాను. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతుంది. తరువాత దానిని స్థాయీసంఘం పరిశీలనకు నివేదిస్తాం. ఆ సంఘం నుంచి నివేదిక అందాక బహుశా శీతకాల సమావేశాల చివరికల్లా తుది బిల్లును పార్లమెంట్‌ ఆమోదం కోసం నివేదిస్తాం.

ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించవచ్చు
అదనపు నిధులను సమీకరించే ఉద్దేశంతో వివిధ వస్తు శ్రేణిపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచే రిస్క్‌ తీసుకున్నాను. దీని వల్ల టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంపై 0.41 శాతం మేర భారం పడొచ్చు, అయితే దీని ప్రభావం కొంత కాలమే ఉండవచ్చు. ప్రస్తుతం 8.56 శాతం వద్ద టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఉండటానికి ప్రధానంగా గోధుమలు, చక్కెర, పప్పు ధాన్యాలు, బియ్యం ధరలే కారణం అవుతున్నాయి. దీనిని ద్రవ్య విధానం ద్వారా కాక సరఫరాలను మెరుగుపరచడం ద్వారా పరిష్కరించవచ్చు. కొన్ని నిత్యావసర సరుకుల సరఫరాలో లోటుపాట్లు, సకాలంలో రుతుపవనాలు రాకపోవడం వల్ల ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. మనం ఒక్కసారి అంతక్రితం ఏడాదితో పోల్చి చూసుకుంటే గత డిసెంబరులో 7.3 శాతం టోకు ధరల సూచీ (డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం, 19.8 శాతం ఆహార సరుకుల ద్రవ్యోల్బణం నమోదయ్యాయి. 2008-09 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అంతర్జాతీయ వ్యయ ప్రేరిత కారకాల వల్ల డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం 13 శాతానికి ఎగబాకింది. ఈ ఆర్థిక సంవత్సరం (2009-10) ద్వితీయార్థంలో మాత్రం ప్రధానంగా ధరల పెరుగుదల ఆహార పదార్థాలకు పరిమితం అయింది. ఫిబ్రవరి 13తో ముగిసిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 17.58 శాతంగా నమోదవగా, ఇంధనం, కందెనలు, విద్యుత్తు 9.89 శాతం మాత్రమే ఎగశాయి. ఆదాయపు పన్ను మినహాయింపునకు వీలు కల్పించే పొదుపు పరిమితిని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచాలన్న సూచనపై వచ్చే ఏడాది, లేదా తగిన సమయంలో తప్పకుండా పరిశీలిస్తాను. గతేడాది నవంబరులో ప్రారంభమైన ఎగుమతుల రికవరీని కొనసాగించేందుకు భారత్‌ ఎగుమతుల వ్యూహాన్ని పునస్సమీక్షించుకోవలసి ఉంది. సరికొత్త మార్కెట్లకు విస్తరించడం ద్వారా పురోగతి మాయం అవకుండా చూసుకోవచ్చు.