ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.వేల కోట్ల బకాయిలు
రాయితీలు, కొనుగోళ్ల నిధులివ్వని సర్కారు
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రానికి వెలుగులు అందించే విద్యుత్ సంస్థలు అప్పుల భారం, ఆర్థికలోటుతో కుదేలవుతున్నాయి. ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన రాయితీ , కొనుగోళ్ల నిధులను ఇవ్వడం లేదు. కనీసం బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ములూ ఇవ్వడం లేదు. ఫలితంగా ఏపీట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అమలుచేస్తున్న ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు నుంచి రాయితీ మొత్తాన్ని విడుదల చేయలేదు. ఈ నెల కలిపితే రూ.1168 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. 2008-09లో.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న సర్కారు.. ఎంత ధర పెట్త్టెనా విద్యుత్ కొనాలని ఆదేశించింది. బయటి సంస్థల నుంచి భారీ మొత్తానికి ఎడాపెడా కొనుగోలు చేయడంతో భారం రూ.6468 కోట్లకు చేరింది. ట్రాన్స్‌కో వద్ద కొనుగోళ్లకు డబ్బు లేకపోవడంతో బ్యాంకుల వద్ద రుణం తీసుకుని కొనాలని, ఆ తర్వాత తాను చెల్లిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రూ.100 కోట్లు మాత్రం ఇచ్చి మిగిలిన మొత్తం గురించి మాట్లాడం లేదు. ఇంధన సర్దుబాటు కింద వినియోగదారులపై రూ.1397కోట్లు భారంవేసి వసూలు చేసుకోనేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అనుమతిస్తే బాదుడే తరువాయి. అంటే విద్యుత్ కొనుగోళ్ల తాలూకూ బకాయి ఇంకా రూ.4968కోట్లు మిగిలే ఉంది. నాలుగు నెలల రాయితీ మొత్తాన్ని దీనికి కలిపితే అయ్యే మొత్తం రూ.6136 కోట్లు. విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిస్కంలు గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రూ.1850 కోట్ల విలువైన కరెంటు కొన్నాయి. ఏపీ ట్రాన్స్‌కోని మినహాయిస్తే.. డిస్కంల రెవెన్యూలోటు రూ.12వేలకోట్లకు చేరుకుంది. పాత బకాయిల గురించి పెదవి విప్పని సర్కారు తాజాగా మళ్లీ విద్యుత్ కొనుగోళ్లకు ఆదేశించింది. రోజూ 3 మిలియన్ యూనిట్ల మేరకు కొనాలని సూచించింది. ఇందుకయ్యే మొత్తాన్ని ఏపీట్రాన్స్‌కో మళ్లీ బ్యాంకుల నుంచి సేకరించాల్సిందే. విద్యుత్ సంస్థలను నిండా ముంచిన సర్కారు ఇప్పుడు వేరే మార్గాలు వెతుక్కోమని సూచిస్తోంది. బాండ్ల అమ్మకం ద్వారా నిధులు సేకరించి అప్పులు తీర్చుకోవడంతోపాటు రెవెన్యూలోటు పూడ్చుకోవాలని సూచిస్తోంది. రోగం పూర్తిగా నయం చేయడానికి బదులు తాత్కాలిక ఉపశమనంతో సరిపెట్టాలని చూస్తోంది.