Tuesday, March 2, 2010

బడ్జెట్‌కు ఆకర్షణ తగ్గుతోందా?

బడ్జెట్‌కు ఆకర్షణ తగ్గుతోందా?
డ్జెట్‌ ఇదివరకటి తన ప్రాధాన్యాన్ని ఇపుడు కోల్పోయిందా.. నిశితంగా పరిశీలిస్తే పరస్పరం భిన్నమైన అభిప్రాయాలు రేకెత్తుతున్నాయి.
మునుపు ఆర్థిక మంత్రి సాయంత్రం 5 గంటలకు చట్ట సభలో బడ్జెట్‌ ప్రసంగాన్ని మొదలుపెట్టే వారు. అందులో అనేక ప్రధానమైన విధాన ప్రకటనలు చోటు చేసుకొనేవి. కానీ తరువాత తరువాత బడ్జెట్‌ ప్రసంగాలను మిట్ట మధ్యాహ్నం కన్నా ముందుకు జరిపివేశారు. బహుశా ఎలక్ట్రానిక్‌ మీడియా పరిధి విస్తృతం కావటం, స్టాక్‌ మార్కెట్లకు అనువుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు దారి తీసి ఉండవచ్చు.

పన్నుల్లో మార్పులు ఎలా ఉంటాయో అని ఉత్కంఠగా వేచి ఉండే వారు. మంత్రి చెప్పే దాకా ఎంతో ఆందోళన రాజ్యమేలేది. ఇపుడలా కాదు.. పన్నులు కచ్చితంగా ఏ విధంగా ఉండబోయేదీ తెలియకపోవచ్చు గాని అవి ఏ దిశగా కదిలేదీ మాత్రం ఉజ్జాయింపుగా ముందుగానే అర్థమైపోతోంది. (ఉదాహరణకు ప్రస్తుత బడ్జెట్‌లో ఉద్దీపన పథకాలను పాక్షికంగానైనా ఉపసంహరిస్తారని మార్కెట్‌ వర్గాలు ఊహించాయి. బడ్జెటులో కేంద్రం చేసిందదే.)

సంకీర్ణాల శకమూ కారణమేనా..
కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను బడ్జెట్‌ ప్రసంగ పాఠంలో భాగంగా వెల్లడించాలన్న సంప్రదాయానికి స్వస్తి చెప్పినట్లు కనిపిస్తోంది. ఏడాదికి ఒకసారి వచ్చే సాధారణ బడ్జెటుకు వెలుపలే ఈ నిర్ణయాలను వెలువరించడం అనే ధోరణి పెరుగుతోంది. మంత్రివర్గ సమావేశాలు పూర్తి కాగానే బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో వివరాలను చెప్పడమో, రాష్ట్రపతి ప్రసంగంలో భాగంగా చేర్చడమో కూడా జరగవచ్చు. ఉదాహరణకు తీసుకొంటే, ఇటీవల ఎరువుల ధరల నిర్ణయ విధానంలో మార్పులను బడ్జెట్‌ సమర్పణ తేదీ కన్నా 8 రోజుల ముందు సమాచార, ప్రసార శాఖ మంత్రి నోట చెప్పించారు. పాత పద్ధతిలో అయితే అది విత్త మంత్రి బడ్జెట్‌ ప్రసంగ ప్రతుల్లో నిక్షిప్తం అయి ఉండేది. అధికార పక్షానికి మిత్ర పక్షాలుగా ఉన్న పార్టీలు రాష్ట్రపతి ప్రసంగంలో కొన్ని ప్రభుత్వ విధానాల వెల్లడికి హర్షించే అవకాశం ఉంటుంది.

బడ్జెట్‌ ప్రాధాన్య పరిధి కుదించుకుపోవడంలో సంకీర్ణ రాజకీయాల పాత్రా లేకపోలేదు. వ్యవసాయ, ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ, రైల్వేలు, టెలికామ్‌, పౌర విమానయాన శాఖల వంటి ముఖ్యమైన శాఖలు పాలక కాంగ్రెస్‌కు మిత్ర పక్షాలైన ఎన్‌సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకేల వంటి వాటి నియంత్రణలో ఉన్నాయని మరచిపోకూడదు. వారు తమ పార్టీ అధినేతల కనుసన్నల్లో నడచుకొంటారు. అదను దొరికితే తమ శాఖల అంశాలను గురించి తామే ప్రకటించడానికి వారు మొగ్గు చూపే అవకాశం ఉంది. తమ శాఖలో జరిగే విషయాలను అధికార పక్షానికి చెందిన ఆర్థిక మంత్రి పార్లమెంట్‌ వేదికగా చాటిచెప్పడం, తద్వారా ఆయన మాత్రమే వెలుగులో ఉండాలని వారు ఎందుకు అనుకుంటారు చెప్పండి? ఎయిరిండియాకు కేంద్రం రూ.800 కోట్లు సాయం అందించనుందని పౌర విమానయాన శాఖ మంత్రి విలేకరులకు తెలపడం ఈ సందర్భంగా గమనార్హం. తీరా బడ్జెటులో విత్త మంత్రి ప్రణబ్‌ ఇదే సంగతిని మరోమారు ప్రస్తావించారు.

అమెరికా, యూరో జోన్‌ల వంటి పశ్చిమ దేశాల్లో ఆర్థిక మాంద్యం తలెత్తిన నేపథ్యంలో బ్యాంకుల వైఫల్యాల పరంపర, వ్యాపార సంస్థల ఆర్థిక పటిష్ఠత క్షీణించడం, ఉద్యోగ నష్టాలు, నిరుద్యోగ సమస్యలు వంటి వాటి వల్ల ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడటం అక్కడ పెరిగిపోయింది. ప్రభుత్వ బడ్జెటులు ఆయా ఆర్థిక రంగాలకు ప్రాణాధారంగా మారాయి. అయితే దీని కన్నా భిన్నమైంది చైనా, భారత్‌ల వంటి ప్రవర్ధమాన దేశాల విజయ గాథ. గత నాలుగేళ్లుగా భారత్‌ వృద్ధి పథంలో ముందంజ వేస్తోంది. ఈ ఏడాదైతే చైనాలో 10 శాతం, భారత్‌ వృద్ధి రేటు సగటున చూస్తే 7 శాతంగా నమోదు అవుతున్నాయి. భారత దేశం వంటి వినియోగ ఆధారిత దేశంలో బడ్జెట్‌లో పన్నులను పెంచే ప్రస్తావనలు ఉన్నా కూడా భారీ సంఖ్యలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజలు పెద్ద అండగా ఉన్నందున, పొదుపు రేటు 32.5 శాతంగా నమోదు అయినందున ఇండియా ఇంక్‌. వృద్ధి రేటుపైన పెద్దగా బెంగ పెట్టుకోనక్కరలేదన్న వాదన వినవస్తోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నందువల్ల పారిశ్రామిక పెట్టుబడులు పెరగగలవన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది.

రానున్న మూడేళ్లు కీలకం
బడ్జెట్‌కు ప్రాధాన్యం లేదా అన్న ప్రశ్న ఉదయించవచ్చు. బడ్జెట్‌కు ఉండే ప్రాధాన్యం దానికి ఎటూ ఉంటుంది; ముఖ్యంగా ఆదాయపు పన్ను రేట్ల వంటి విషయాలను తీసుకొంటే. గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా అంతగా బడ్జెట్‌కు లేని ప్రాధాన్యం రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లో దక్కనున్నట్లు తోస్తున్నది. ఎందుకంటే భారత దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని పూర్తిగా అధిగమించి వృద్ధి రేటు సాధనలో ఎంతగా పురోగమించేదీ లేదా తిరోగమించేదీ తేల్చేది ఈ కాలమే కాబట్టి. మరి అలాంటి వృద్ధికి దోహదం చేసే విధానాలను వల్లె వేసేది బడ్జెటే కదా. కేంద్ర ప్రభుత్వం వృద్ధి రేటుకు భంగం కలగకుండా ఆర్థిక లోటును ఎలా తగ్గించుకోనుందీ ఇక ఆసక్తిదాయకంగా మారనుంది. రిజర్వ్‌ బ్యాంకుల వంటి కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి తమ వంతుగా కొన్ని చర్యలను తీసుకొన్నప్పటికీ ప్రభుత్వం వంతుగా తీసుకోదగ్గ చర్యలు అంటూ ఉండకపోవు. కేంద్ర ప్రభుత్వాల కోశ విధాన స్వరూపంలో మార్పు చేర్పులు చేయడానికి బడ్జెటే వేదిక అవుతుంది.