Tuesday, March 2, 2010

ఇక వీధికో బ్యాంకు!

ఇక వీధికో బ్యాంకు!
దూసుకుపోనున్న బ్యాంకింగ్‌ రంగం
పావులు కదుపుతున్న ప్రైవేట్‌ సంస్థలు
బడ్జెట్‌ ప్రభావం
టాటా బ్యాంక్‌.. బిర్లా బ్యాంక్‌.. ఎల్‌&టీ బ్యాంక్‌.. ఎం&ఎం బ్యాంక్‌.. అనిల్‌ అంబానీ బ్యాంక్‌..
మిటి ఇవన్నీ ఎక్కడున్నాయి అనుకుంటున్నారా.. ఇంకా రాలేదు లెండి.. ప్రైవేటు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లకు బ్యాంకింగ్‌ లైసెన్సులు ఇస్తామని కేంద్ర విత్తమంత్రి బడ్జెట్‌లో ప్రకటించడంతోనే సరికొత్త పరుగుకు తెరలేచింది.

సరిగ్గా దశాబ్దం క్రితం 2000వ సంవత్సరంలో ప్రైవేటు రంగంలో బ్యాంకుల స్థాపనకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అనుమతిచ్చింది.కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌ ఏర్పడ్డాయి.

మళ్లీ ఇప్పుడు.. 2010-11 బడ్జెట్‌లోనే ఈ ప్రస్తావన వచ్చింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం అర్హత సాధిస్తే.. అని ప్రణబ్‌ ముఖర్జీ ప్రకటించడంతో, బడా సంస్థల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇవన్నీ అనుమతులు పొందితే, సరికొత్త సేవల పోటీ తప్పదు. ఏతావాతా ఖాతాదారు ఇంటి ముంగిటికే వచ్చిన బ్యాంకింగ్‌ సేవలు, మరింత నాజూకుతనం సంతరించుకోవచ్చు.

ఇన్ని కంపెనీలు సిద్ధంగా..: టాటా, అనిల్‌ అంబానీ అడాగ్‌ గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌, ఐడీఎఫ్‌సీ, ఇండియా బుల్స్‌, రెలిగేర్‌, ఎం&ఎం, ఎల్‌&టీ, చోళమండలం గ్రూప్‌, శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌, ఐఎఫ్‌సీఐ రంగంలో ఉంటాయన్నది అంచనా.

అనిల్‌ అంబానీ నేతృత్వంలోని అడాగ్‌కు చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌, ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎల్‌&టీ 'బ్యాంకింగ్‌ రంగంలోకి రావాలన్న ఆకాంక్షను' వెంటనే బయటపెట్టేశాయి కూడా. మరిన్ని వివరాలు, మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నట్లు రెలిగేర్‌ ప్రకటించింది. రూ.1000 కోట్ల రుణాలతో ఆరంభించి, రూ.25000 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని, బ్యాంకు ఏర్పాటుకు సంసిద్ధత ప్రకటిస్తూ శ్రీరామ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఆర్‌ త్యాగరాజన్‌ వెల్లడించారు.

10% వాటానే: ప్రైవేటు సంస్థలు బ్యాంక్‌ ప్రారంభంలో 10% కంటే ఎక్కువ వాటాను ఉంచుకోడానికి అనుమతిస్తారు. క్రమేణా వాటా మొత్తాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది.
* ఒకే వాటాదారుడికి బ్యాంక్‌లో 10% కంటే ఎక్కువ వాటా ఉండటాన్ని అంత సమంజసంగా భావించరు.
* కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ రాజస్థాన్‌, యెస్‌ బ్యాంక్‌ ప్రమోటర్లకు ఇప్పటికీ 10% కంటే అధిక వాటాలున్నాయి.
నిశిత పరిశీలన: మరిన్ని ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం 'ఆర్థికస్థితి, అతిపెద్ద సంఘటిత ఆర్థికశక్తుల పనితీరు'ను స్థూలంగా గమనించేందుకు 'ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి'ని నెలకొల్పనుంది. అంతర్గత అంశాల సమన్వయకర్తగానూ మండలి వ్యవహరిస్తుంది.
ప్రభుత్వరంగ బ్యాంకులకు..: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో టైర్‌ -1 పెట్టుబడి 8% ఉండేలా చూసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం, వచ్చే ఏడాది రూ.16,500 కోట్లు కేటాయించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా మూలధన సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. ఇందువల్ల తగినంత రుణాలు ఇవ్వడానికి గ్రామీణ బ్యాంకులకు అవకాశం ఏర్పడుతుంది.

దేశంలోని ప్రైవేటు బ్యాంకులు
సీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ రాజస్థాన్‌, క్యాథొలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, ధనలక్ష్మీ బ్యాంక్‌, డెవలప్‌మెంట్‌ క్రెడిట్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌, కరూర్‌ వైశ్యాబ్యాంక్‌, జమ్ము&కాశ్మీర్‌ బ్యాంక్‌, కర్ణాటక బ్యాంక్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ వెస్ట్రన్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

పనితీరుకే అగ్రాసనం
ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వ్యాపార పరిధి, లాభాలతో అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబరు 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ రూ.1,101 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.818.50 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.655.98 కోట్ల నికర లాభాన్నిఆర్జించి తమ పనితనాన్ని చాటాయి.

వేగంగా సేవలు
బ్యాంకు శాఖలు, ఏటీఎంలు విస్తృతంగా ఏర్పాటు చేయడం, దాదాపు ఖాతాదారులందరికీ ఏటీఎం/డెబిట్‌కార్డుల జారీ; వేర్వేరు ప్రాంతాల్లోని ఖాతాలకు నగదు త్వరగా బదిలీ, మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి విధానాలతో ప్రైవేటు రంగ బ్యాంకులు ఆకట్టుకున్నాయి. కొత్త బ్యాంకులు రంగ ప్రవేశం చేస్తే పోటీ మరింత పెరిగి, ఖాతాదారులకు మరిన్ని వినూత్న సేవలు అందే అవకాశం ఉంది.