Tuesday, March 2, 2010

రిలయన్స్‌ చేజారనున్న లియోండెల్‌!

రిలయన్స్‌ చేజారనున్న లియోండెల్‌!
న్యూయార్క్‌: దివాలా దశలో ఉన్న డచ్‌ పెట్రోకెమికల్‌దిగ్గజం లియోండెల్‌ బాసిల్‌ను చేజిక్కించుకోవాలనుకున్న రిలయన్స్‌ ఆశయానికి గండిపడేట్టు ఉంది. లియోండెల్‌ బాసిల్‌ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సమర్పించిన బిడ్‌ను అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో మేనేజ్‌మెంట్‌ నేతృత్వంలోని ఒక రుణదాతల బృందం తిరస్కరించే అవకాశం ఉందని న్యూయార్క్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది. ఈ చర్య లియోండెల్‌ను అపోలోకు చెందిన హెక్సియాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌, ఆపరేషన్స్‌లో విలీనం చేసేందుకు దోహదం చేస్తుందని ఆ పత్రిక తెలిపింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ న్యూయార్క్‌ పోస్ట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. లియోండెల్‌ బాసిల్‌ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 14.5 బిలియన్‌ డాలర్ల బిడ్‌ను సమర్పించినట్లుగా పత్రిక వెల్లడించింది. తక్కువగా బిడ్‌ దాఖలు చేస్తూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తప్పు చేస్తున్నట్లుగా లియోండెల్‌ రుణదాతలు అభిప్రాయపడుతున్నట్లు పత్రిక తెలిపింది. ఈ వ్యవహారంపై అపోలో మేనేజ్‌మెంట్‌ వెంటనే ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. కాగా, లియోండెల్‌ సంస్థ సోమవారం అమెరికాలోని మన్‌హట్టన్‌ దివాలా వ్యవహారాల కోర్టులో కొత్త పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక సమర్పించే అవకాశం ఉంది. ఈ పత్రాల ప్రకారం సంస్థ యాజమాన్యం రుణదాతల చేతుల్లోకి రానుంది.