Tuesday, March 2, 2010

క్యాంపస్‌ శాస్త్రవేత్తలు

సైన్స్‌... పాఠ్యపుస్తకాల బైండింగుల్లోంచి బయటపడి, లేబొరేటరీల తలుపులు బద్దలుకొట్టుకుని, కాన్ఫరెన్స్‌హాళ్ల కిటికీ సందుల్లోంచి తప్పించుకుని నేరుగా 'సైన్స్‌ ఫెస్టివల్స్‌'కు వచ్చేస్తోంది. సమాజానికీ టెక్నాలజీకీ మధ్య వారధిగా నిలబడుతున్న క్యాంపస్‌ శాస్త్రవేత్తలకు 'జాతీయ సైన్స్‌ దినోత్సవ' శుభాకాంక్షలు!
స్నానం చేస్తుంటాడు.
ఠక్కున ఐడియా వెలుగుతుంది.
బయటికి పరిగెత్తుకొస్తాడు.
ఆర్క్‌మెడిస్‌ కాదు.
చెట్టుకింద కునుకుతీస్తుంటాడు.
నెత్తిమీద రెట్టపడుతుంది.
బుర్రలో ఏదో మెరుస్తుంది.
న్యూటన్‌ కాదు.
వైఫల్యం. వైఫల్యం. వైఫల్యం.
వెయ్యిసార్లు బొక్కబోర్లాపడతాడు.
వేయిన్నొక్కసారి సాధిస్తాడు.
ఎడిసన్‌ కాదు.
వీళ్లేనా, ఇంకా చాలామంది ఉన్నారు. ఏ క్యాంపస్‌కెళ్లినా కనిపిస్తారు. గుర్తుపట్టడం పెద్దకష్టమేం కాదు. అన్నం తింటారో క్వశ్చన్‌బ్యాంకుల్ని తింటారో కానీ, వెుహాలెప్పుడూ ప్రశ్నార్థకంగా ఉంటాయి. ఇరవైనాలుగ్గంటలూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. గాల్లో రాతలు రాస్తుంటారు. మనకైతే ఒక్కటీ అర్థంకావు. ఒట్టి అయోమయం మాస్టార్లు! జేబులో సెల్‌ఫోన్‌ పెట్టుకుని ఆడిటోరియం అంతా వెతుకుతుంటారు. హెడ్డుగారికి (శ్రీమాన్‌ హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌) అడ్డుతగిలి, పైథాగరస్‌ పెద్ద అబద్ధాలకోరనో డాప్లర్‌ ఎఫెక్టు అంత పర్ఫెక్టు కాదనో అడ్డంగా వాదించేస్తుంటారు. క్యాంటీన్‌ పిట్టగోడల మీద కూర్చుని E=mc2 ఎందుక్కాదో పేద్ద ఉపన్యాసం దంచేస్తుంటారు. లైబ్రరీలో ఈ మహానుభావులు రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి పుస్తకాలు చదువుకున్న స్థలంలో పుట్టలు వెులిచుంటాయి. 'పుట్టినరోజు గుర్తుపెట్టుకోకపోవడం' అన్న తప్పు వరుసగా నాలుగుసార్లు చేసి, నలుగురు గాళ్‌ఫ్రెండ్స్‌తో 'గుడ్‌ బై' చెప్పించుకునుంటారు. అలా అని అంకెల ఫోబియా లాంటిదేమైనా ఉందనుకుంటే పొరపాటే. అన్నయ్యలు హ్యూమన్‌ కంప్యూటర్లు. లెక్కలంటే లెక్కేలేదు. ఒకటో తరగతినుంచే వందకి వంద. ఇక, సైన్సంటే ప్రాణం. గుళ్లోకెళ్లినంత భక్తిగా, లేబొరేటరీలో కాలుపెడతారు. 'మీకు నచ్చిన పండగ గురించి రాయండి' అనడిగితే, హాయిగా ఏ దసరా గురించో దీపావళి గురించో రాసుకోకుండా, 'సైన్స్‌ ఫెస్టివల్‌' సంగతులెత్తుకుంటారు.
నిజంగానే వాళ్లు సైన్స్‌ ఇష్టులు.
రేపటి సైంటిస్టులు!
నవతరం ఐన్‌స్టీన్‌లకూ నయా న్యూటన్‌లకూ సైన్స్‌ ఫెస్టివల్‌ వస్తోందంటే ఓ సవాలు! ఏడాదంతా ఎదురుచూసేది ఆ నాల్రోజుల కోసమే. కొత్తగా ఏదో ఒకటి సృష్టించేసి, జనానికి త్రీడీలో 'మాయాబజార్‌' చూపించాలని తెగ ఆరాటం. స్కూటరు చక్రాలు, చెక్క ముక్కలు, సైకిలు డైనవోలు...ఇవేవాళ్ల ముడిసరుకు. 'త్రీ ఇడియట్స్‌'లో అమీర్‌ఖాన్‌లా, చదువంటే వాళ్లకో నిశ్చితాభిప్రాయం ఉంటుంది. బట్టీల్ని ద్వేషిస్తారు. సృజనని స్వాగతిస్తారు. అన్నింటికీ మించి, దేశమంటే వల్లమాలిన అభిమానం. ''పుట్టి బుద్ధెరిగినప్పట్నుంచీ సాంఘికశాస్త్రం పుస్తకాల్లో 'అభివృద్ధి చెందుతున్న దేశం' అన్న మాట చదివీచదివీ విసుగొచ్చింది. ఆ పేజీల్ని తగలబెట్టేసి, 'అభివృద్ధి చెందిన దేశం... భారత్‌' అని రాసున్న పుస్తకాల్ని మళ్లీ ముద్రించాలి. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాం'' అంటారు ఆవేశంగా. ఆ ఆవేశమే వాళ్లతో సాంకేతిక విన్యాసాలు చేయిస్తోంది. కార్పొరేట్‌ ప్రపంచమంతా ఇప్పుడు ఆ క్యాంపస్‌ శాస్త్రవేత్తల ఆవిష్కరణలవైపు ఆశగా చూస్తోంది. ఎవరూ బొట్టుపెట్టి పిలవకపోయినా, సైన్స్‌ పండగలకి వెళ్తోంది. ఆ కుర్రాళ్లేం చెబుతున్నారో చెవులు రిక్కించి వింటోంది. ఆ ఆలోచనల్లోంచి బిజినెస్‌ ఐడియాల్ని ఏరుకుంటోంది.

కొత్త ఐడియాల లోకం...
ప్రపంచాన్ని మార్చేశక్తి డబ్బుకు లేదని అర్థమైపోయింది. ఆయుధాలకు లేదని తేలిపోయింది. రాజకీయాలవల్లా కాదని నిర్ధారణ అయింది. ఇక మిగిలింది...సైన్స్‌! అవును, సైన్స్‌ మాత్రమే. కానీ ఆ సైన్సు విశ్వవిద్యాలయాల లేబొరేటరీలకో, ప్రొఫెసర్ల లాప్‌టాప్‌లకో పరిమితమైతే లక్ష్యం నెరవేరదు. ఆ గాజు నాళికల్ని బద్దలుకొట్టుకుని బయటికి రావాలి. ఆ లాప్‌టాప్‌ పాస్‌వర్డ్‌లను ఛేదించుకుని జనం మధ్యకి చేరాలి. అప్పుడే ఆ సృష్టికి అర్థం, పరమార్థం. క్యాంపస్‌ సైన్స్‌ ఫెస్టివల్స్‌లో ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయిప్పుడు.

ముంబయి ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) ఆవరణైతే ఆ నాల్రోజులూ ఐడియాల కూడలిగా మారిపోతుంది. ఓ స్టాల్లో రంగురంగుల చేప రోబో నీళ్లలో కదులుతూ కనిపిస్తుంది. 'భలేభలే, పిల్లలు ఆడుకోడానికి పనికొస్తుంది..' అని వ్యాఖ్యానించారనుకోండి, పక్కనే ఉన్న వాలంటీర్లు వింతగా చూస్తారు. 'థింక్‌ బిగ్‌...మిత్రమా' అని సలహా ఇస్తారు. 'భవిష్యత్‌లో సముద్రగర్భంలో జరగాల్సిన పరిశోధనలన్నీ ఈ చేప రోబోల సాయంతోనే జరుగుతాయి' అంటూ అసలు సంగతి చెబుతారు.

వేళ్లతో టకాటకా ఆడించగానే పనిచేసుకుపోయే కీబోర్డుల సంగతి సరే. చేతులూ, వేళ్లూ స్వాధీనంలోలేని దురదృష్టవంతుల మాటేమిటి? అలాంటివాళ్ల కోసమే 'ఐ రైటర్‌'ను సృష్టించాడో టెక్నోజీవి. ఇంకేముంది, కంటిచూపుతో రాసెయ్యెుచ్చు. ఇందుకయ్యే ఖర్చూ తక్కువే.

ఏ మారుమూల ప్రాంతంలోనో ఉంటాం. సెల్‌ఫోన్‌ బ్యాటరీ ఛార్జి చేసుకునే అవకాశమే ఉండదు. ఇక, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్టేనా? 'మన శరీరంలోనే అపారమైన శక్తి ఉంది. దాంతోనే రీఛార్జి చేసుకోవచ్చుగా' అంటాడు కోల్‌కతాలో ఇంజినీరింగ్‌ చదువుతున్న దమన్‌. ఆ పరికరం చుట్టూ ఒక్కసారి అరచేతులతో రాపిడి చేసినా, ఐదు నిమిషాలకు సరిపడేంత శక్తి పుట్టుకొస్తుంది. పుణె ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులైతే 'వాక్‌ అండ్‌ ఛార్జ్‌' పేరుతో ఓ పరికరాన్ని కనిపెట్టారు. ఇరవై నిమిషాలు నడిస్తే చాలు, ఆ శక్తితోనే సెల్‌ఫోను ఛార్జి అయిపోతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాకి ఆదా. బావుంది కదా!

రోజూ పేపర్లలో వచ్చే 'పట్టాలు తప్పిన రైలు...పదిమంది మృతి' తరహా వార్తలు ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థుల హృదయాల్ని కదిలించాయి. దాంతోపాటే వాళ్ల టెక్నికల్‌ బుర్రలూ కదిలాయి. పట్టాలు తప్పగానే బండి ఠక్కున ఆగిపోయేలా, ప్రత్యేకమైన బ్రేకులు సృష్టించారు. బండి పట్టాలు తప్పగానే, బోగీల్లోని 'సెన్సర్‌' ఆ సంగతి గ్రహిస్తుంది. 'స్టాప్‌..' అంటూ బ్రేకులకు సందేశం పంపిస్తుంది. ఇదంతా మహా అయితే మూడు సెకెన్లలో జరిగిపోతుంది. ఓ పెద్ద ప్రమాదం తప్పిపోతుంది. ఇదే ఆవరణలో ఇంకో మంచిపనీ జరిగింది. మెటీరియల్‌ సైన్స్‌ విభాగానికి చెందిన సుందర్‌ మనోహరన్‌ హృద్రోగుల కోసం 'నానో కోటెడ్‌ స్టెంట్‌' రూపొందించాడు. ఇప్పటిదాకా వాడుతున్న డ్రగ్‌ కోటెడ్‌ స్టెంట్లు దుష్ప్రభావాలు చూపుతున్నాయనే ఫిర్యాదులొస్తున్నాయి. కొత్త స్టెంట్‌తో ఆ ఇబ్బంది ఉండదు. ఖర్చూ తక్కువే.

కోయంబత్తూరులోని పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో బాధపడే పిల్లల కోసం చవకైన వెంటిలేటర్లు రూపొందించారు. ఇప్పటిదాకా మనం వాటిని అమెరికాలాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ధర నాలుగైదు లక్షల దాకా ఉంటుంది. అదే మన దగ్గర తయారుచేసుకుంటే, సగానికి సగం మిగులుతుందంటారు. రక్తంలో ఎంజైమ్‌ శాతాన్ని లెక్కించే బయోసెన్సర్‌ను నామమాత్రపు ఖర్చుతో తయారుచేశాడు పుణెలోని సింహ్‌గఢ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ధృవ. మార్కెట్లో దాదాపు నాలుగు లక్షల ఖరీదుచేసే ఈ యంత్రాన్ని పదిహేను వందలకే ఇవ్వొచ్చని ధీమాగా చెబుతున్నాడు.

గుండెనిండా గాలి పీల్చుకోవాలన్నా మనకు భయమే. కాలుష్యం వూపిరితిత్తుల్ని చిత్తుచేస్తుందేవో అన్న అనుమానం. మంచినీళ్లు శుభ్రంచేయడానికి 'వాటర్‌ ప్యూరిఫయర్‌' ఉన్నట్టు, గాలిని జల్లెడపట్టడానికీ ఓ పరికరం ఉంటే, అదీ అందుబాటు ధరలో దొరికితే ఎంత బావుండు?...సగటు మనిషి కోరికను నిజం చేశాడు భువనేశ్వర్‌లోని ట్రిడెంట్‌ అకాడమీ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థి దేవాశిశ్‌ పాండా. దీని ఖరీదు ఏడెనిమిది వేలకు మించదు.

మన క్యాంపస్‌ కుర్రాళ్లకు బక్కరైతంటే చచ్చేంత ఇష్టం. మెదక్‌లోని నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు అభిలాష, రుచిక, సౌమ్య బృందం అతి చవకైన పంటకోత యంత్రాన్ని తయారు చేసింది. ఓ ఐఐటీ విద్యార్థి కూడా ఇలాగే, రైతులకు పనికొచ్చే ప్రయోగం చేశాడు. మనకున్న నీటివనరుల్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకోవచ్చనే విషయం మీద దృష్టిపెట్టాడు. మట్టిలో తడి శాతమెంతో గుర్తించే పరికరాన్ని కనిపెట్టాడు. రైతు ఆ లెక్కల్ని బట్టి పంటకి అవసరమైనన్ని నీళ్లు పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎంతో సాగునీరు ఆదా అవుతుంది.

ఆ యువతీయువకులు ఏ శూన్యంలోంచో సృష్టించడం లేదు. కొరుకుడుపడని టెక్నాలజీని వాడుకోవడం లేదు. కోట్లకొద్దీ డబ్బు వెదజల్లడం లేదు. వాళ్లదంతా 'గాంధీ టెక్నాలజీ'. ఎక్కడా ఆడంబరం ఉండదు. వనరుల దుర్వినియోగం ఉండదు. అంతకుమించి, పర్యావరణానికి హాని ఉండదు. రసాయన విధ్వంసం ఉండదు. చెప్పిందే చేస్తారు. చేశాకే చెబుతారు. అంతెందుకు, ఈమధ్య జరిగిన ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌ ఉత్సవాల్లో ఎక్కడా పర్యావరణానికి హానిలేకుండా జాగ్రత్తపడ్డారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. మరీ అత్యవసరం అయితే తప్ప, జెరాక్స్‌ ప్రింట్లు వద్దనుకున్నారు. వ్యర్థాల్ని చెత్తబుట్టపాలు చేయకుండా, ఏదో ఒకరూపంలో మళ్లీ ఉపయోగించుకున్నారు. 'బిజినెస్‌ ప్లాన్‌' పోటీల్లో కూడా దేశవాళీ ఆలోచనలకే పెద్దపీట వేస్తున్నారు. మన పిల్లలని గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ, క్యాంపస్‌ విద్యార్థుల ఆలోచనల్లో ఆవిష్కరణల్లో బోలెడంత తడి ఉంది. మన దేశం, మన ప్రజలు, మన సమస్యలు, మన గ్రామాలు...అన్న సామాజిక బాధ్యత ఉంది.

సైన్స్‌ మే సవాల్‌!
'ఫ్రెండ్స్‌! మన దేశంలో ఇంకా కరెంటు వెలుగులకు నోచుకోని గ్రామాలున్నాయంటే, నమ్ముతారా? అవున్నిజం. కొన్ని కోట్లమంది చీకటిని జయించలేకపోతున్నారు. గుడ్డిదీపాల వెలుగుల్లో బతుకుతున్నారు. అలాంటివాళ్లకు మనం సాయం చేయలేమా? విద్యుత్‌ సంక్షోభాన్ని తిప్పికొట్టలేమా? పర్యావరణానికి ఎలాంటి హానీ చేయకుండానే, కరెంటు పుట్టించే దారుంటే చెప్పండి? విజేతకు లక్ష రూపాయల నజరానా!' ...ఓ క్యాంపస్‌లో దండోరా వోగుతుంది.

'మన మట్టి బంగారం. ఏ పంటైనా పండుతుంది. మన రైతు శ్రమజీవి. చెమటోడ్చి పనిచేస్తాడు. అయినా, ఇంత దరిద్రమెందుకు? రైతన్నల జీవితాల్ని బాగుపరిచే టెక్నాలజీ మీదగ్గరుందా? అయితే, వివరాలు పంపండి. విజేతల్ని సముచితంగా సత్కరిస్తాం' ...ఓ కాలేజీ నోటీసుబోర్డు మీద ప్రకటన ప్రత్యక్షమవుతుంది.

...దాదాపు అన్ని సైన్స్‌ పండగలూ మనదేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు మూలాల్ని వెతికిపట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని రూపుమాపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. పల్లెల మీదా సంప్రదాయేతర వనరుల మీదా దృష్టిపెడుతున్నాయి. చవకైన టెక్నాలజీకే పట్టంకడుతున్నాయి. విద్యార్థుల వైపు నుంచి కూడా చక్కటి స్పందన వస్తోంది. వేలకొద్దీ ఐడియాలు పోటీకి దిగుతున్నాయి. ఈ లెక్కన దేశంలోని చిన్నాపెద్దా క్యాంపస్‌లన్నీ కలుపుకుంటే...ఏటా మన దేశంలో దాదాపు ఆరులక్షల ఆలోచనలు పుట్టుకొస్తున్నాయని అంచనా. వాటిలో సగానికి సగం ప్రాణంపోసుకున్నా...అద్భుతాలు జరుగుతాయి.

హంగామా!
సైన్స్‌ఫెస్ట్‌ అంటే, 'మేధావి మార్కు' సోడాబుడ్డి కళ్లద్దాలకో 'సైంటిస్టు లుక్కు' బట్టతల బాబాయిలకో మాత్రమే ప్రవేశం ఉంటుందనుకుంటే పొరపాటే. రిజిస్ట్రేషన్లు అవసరం లేదు. ఎంట్రీ ఫీజుల్లేవు. సైన్సును ప్రేమించడమే ప్రవేశార్హత. టెక్నాలజీ మీదున్న వోజే సభ్యత్వ రుసుము! ఎవరైనా వెళ్లొచ్చు. స్టాల్స్‌ చుట్టేసి రావొచ్చు. సందేహాలుంటే తీర్చుకోవచ్చు. మనకూ ఏమైనా ఆలోచనలుంటే పంచుకోవచ్చు. పజిల్స్‌, క్విజ్‌, కోడింగ్‌...తదితర పోటీల్లో బోలెడన్ని బహుమతులు. నగదు, లాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు...వరుసకట్టి ఊరిస్తుంటాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అయితే, వెుత్తం బహుమతుల విలువ యాభైలక్షలు! పోటీ ఆషామాషీగా ఏం ఉండదు. ఐఐటీ ముంబయి 'టెక్‌ఫెస్ట్‌'లో దేశవ్యాప్తంగా రెండు వేల కాలేజీల నుంచి విద్యార్థులొచ్చారు. పదిహేను దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ లాంటి చోటయితే, రోబోటిక్‌ పోటీలు విఠలాచార్య సినిమాల్ని తలపిస్తాయి. అదో హంగామా. ఐఐటీ ముంబయి రోబోటిక్‌ పోటీల ప్రాథమిక దశలు అంతర్జాతీయంగా జరుగుతాయి. ఫైనలిస్టులంతా భారతదేశానికొస్తారు. వ్యవసాయం నుంచి వంటింటి దాకా...నిత్యజీవితంలో మనకి సాయం చేసే రకరకాల రోబోలు రంగంలో దిగుతాయి. విజేతలకు అక్షరాలా నాలుగు లక్షల బహుమానం. ఇక నాలుగు కొత్త విషయాలు తెలుసుకుందామని వచ్చే జిజ్ఞాసుల కోసం సెమినార్లూ వర్క్‌షాప్‌లూ ఉండనే ఉంటాయి. ఆ కొద్దిసేపు ఆక్సిజన్‌తో పాటు ఐడియాల్నీ శ్వాసిస్తాం. సాయంత్రమయ్యేసరికి సైన్స్‌ మన ఆలోచనల్లో భాగమైపోతుంది.

పేరున్న విద్యాసంస్థల్లో సైన్స్‌ ఫెస్టివల్‌ జరుగుతుందంటే, కార్పొరేట్‌ ప్రపంచం చూపులన్నీ అటే ఉంటాయి. ఎవరి సిఫార్సూ అక్కర్లేదు. ఎవరి ప్రాపకం అవసరం లేదు. ప్రతిభ ఉంటే చాలు. గుర్తించి గండపెండేరం తొడుగుతారు. కొల్హాపూర్‌లోని తాంత్యాసాహెబ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఐటీ విద్యార్థులు బ్రిజేష్‌, సాకేత్‌ కుళాయి పైపుల్లో నీళ్లు పారుతున్నప్పుడు పుట్టుకొచ్చే శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చుకోవచ్చని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. సరిగ్గా అదే సమయానికి ముంబయి ఐఐటీ టెక్‌ఫెస్టివల్‌ిలో పాల్గొనే అవకాశవెుచ్చింది. ఓ కార్పొరేట్‌ సంస్థకు ఆ ఐడియా నచ్చింది. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. సైన్సంటే ప్రాణమిచ్చే కుర్రాళ్లకు సైన్స్‌ఫెస్టివల్‌ అందించిన గొప్ప అవకాశమిది.

పొద్దున్న రేమండ్స్‌ సూట్‌ జంటిల్‌మాన్‌లా హుందాగా, గంభీరంగా కనిపించే ఫెస్టివల్స్‌...పొద్దుగుంకే సమయానికి పెపే జీన్స్‌ కుర్రాడిలా హుషారుగా, చిలిపిగా మారిపోతాయి. రాక్‌బ్యాండ్స్‌ రంగంలో దిగుతాయి. లేజర్‌షోలు ఆకాశాన్ని ఆక్రమిస్తాయి. హఠాత్తుగా ఏ అమీర్‌ఖానో ప్రత్యక్షం కావచ్చు. నిషా కళ్ల బిపాసా స్టేజీమీద ప్రత్యక్షమై సుతారంగా చేతులు ఊపొచ్చు. ఎవరికి తెలుసు, ఆ పదీపదిహేనువేల యువ అతిథుల్లో మీరు ఎంతోకాలంగా వెతుకుతున్న ఓ అపురూప వ్యక్తి తారసపడొచ్చు. కాఫీడే వాళ్ల 'లాట్‌ కెన్‌ హ్యాపెన్‌ ఓవర్‌ ఎ కప్‌ ఆఫ్‌ కాఫీ' క్యాప్షన్‌ని కాపీ కొట్టి, కాస్త అటూఇటుగా మార్చేసుకుంటే... 'సైన్స్‌ఫెస్ట్‌ ముగిసేలోపు ఏ అద్భుతమైనా జరగొచ్చు!'

పనికొచ్చే పరీక్ష!
సైన్స్‌ ఫెస్టివల్‌ తేదీ తరుముకొస్తున్నకొద్దీ విద్యార్థుల్లో ఒకటే టెన్షన్‌. ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. కార్యక్రమాల్ని ఖరారు చేయాలి. కాలేజీ స్థాయిని బట్టి స్థానికంగానో రాష్ట్రవ్యాప్తంగానో జాతీయంగానో అంతర్జాతీయంగానో ఆహ్వానపత్రాలు పంపాలి. వెబ్‌సైట్‌లో తాజా వివరాలు చేర్చాలి. స్టాల్స్‌ కేటాయించాలి. స్పాన్సర్లని వెదికిపట్టుకోవాలి. ముఖ్య అతిథుల్ని ఆహ్వానించాలి. కార్పొరేట్లని ఒప్పించి నిధులు సమకూర్చుకోవాలి. ఎక్కడెక్కడి నుంచోవచ్చేవారికి వసతి, భోజనాలు, రవాణా... వూపిరి పీల్చుకోలేనంత పని. అదో నాయకత్వ శిక్షణ!

పోటీల్లో పాల్గొనే బృందాల పరిస్థితీ దాదాపుగా అంతే. ఏదో ఒకటి అనుకోడానికి వీల్లేదు. పర్యావరణ ప్రియమైన టెక్నాలజీనే ఉపయోగించాలనో గ్రామీణభారతానికి పనికొచ్చే ఆవిష్కరణే అయివుండాలనో... నిర్వాహక సంస్థ నిబంధన పెడుతుంది. ఆ ప్రకారమే సిద్ధం కావాలి. ఆలోచన, ప్రణాళిక, అమలు... ఆ తర్వాత, ఆ రోబోల్నో సైన్స్‌ పరికరాల్నో చంటిపాపలంత జాగ్రత్తగా కాపాడుకుంటూ బస్సులెక్కీ రైళ్లెక్కీ వేలమైళ్లు ప్రయాణించి ఫెస్టివల్స్‌కు వెళ్లాలి. బహుమతి వచ్చిందా సంతోషమే. రాకపోతే, ఆ కష్టమంతా వృథా. తీపికబురు కోసం ఎదురుచూస్తున్న వందలమంది సహపాఠీలకు సమాధానం చెప్పాల్సివుంటుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు తాము తయారుచేసిన రోబోను ముంబయిలో జరిగిన 'రోబో వార్‌'కు తీసుకెళ్లారు. తీరా వెళ్లాక, అక్కడ నేల చదునుగా లేదు. రోబో ముందుకు కదల్లేకపోయింది. ఈ కుర్రాళ్లు తయారుచేసిన రోబో నున్నటి గ్రానైట్‌ ఫ్లోర్‌ మీద మాత్రమే పరుగులు పెడుతుంది. ఎత్తుపల్లాలుంటే మాత్రం కుప్పకూలిపోతుంది. దీంతో వైఫల్యం తప్పలేదు. 'ఆదివారాలని లేదు. పండగ పబ్బాలని లేదు. మూడు నెలలు రాత్రీపగలూ కష్టపడ్డాం. అయినా ఫలితం లేకుండాపోయింది. అయితేనేం, ఈ ప్రాజెక్టు మాకో గొప్ప పాఠం నేర్పింది. ఇంకాస్త కష్టపడితే అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొనగలమనే ధైర్యం వచ్చింది' అంటారు ఆ బృందంలోని విద్యార్థులు.

సైన్స్‌ ఫెస్టివల్స్‌ మూస ఆలోచనల్లోంచి బయటపడటం ఎలాగో నేర్పిస్తాయి, కొత్త ఐడియాలతో సమాజం ముందు నిలబడటానికి సరిపడా ధైర్యాన్నిస్తాయి, వైఫల్యాన్ని తట్టుకోగల గుండె ధైర్యాన్నిస్తాయి, మనం ఎక్కడున్నావో బేరీజువేసుకోగల నిజాయతీనిస్తాయి. ఆ అనుభవం జీవితంలోనూ పనికొస్తుంది. ఎంతపెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుందన్న నమ్మకం కలుగుతుంది. అందర్లా కాకుండా, అందరికోసం ఆలోచించడం వెుదలుపెడతాం. సైన్స్‌ లక్ష్యం కూడా అదే!


* * *
చిన్నప్పుడు ఓ కథ వినుంటాం. ఓ రాజుగారి దగ్గర్నుంచి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి.. ఒక్కొక్కరే వెళ్లిపోతారు. ధైర్యలక్ష్మిని మాత్రం రాజు వెళ్లనివ్వడు. దీంతో మిగిలినవాళ్లంతా వెనక్కి వచ్చేస్తారు. సైన్స్‌ కూడా ధైర్యలక్ష్మి లాంటిదే. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఎన్ని విపత్తులనైనా తట్టుకు నిలబడుతుంది. ఎన్ని సంక్షోభాల్ని అయినా గట్టెక్కుతుంది. ఎందుకంటే, సైన్స్‌ ఆలోచననిస్తుంది. హేతువాదాన్నిస్తుంది. శాస్త్రీయ దృక్పథాన్నిస్తుంది. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో...డాలర్లనే నమ్ముకున్న అమెరికా కుప్పకూలిపోయింది. టెక్నాలజీని నమ్ముకున్న జపాన్‌ మరీ ఇబ్బందిపడ్డ దాఖలాల్లేవు. సైన్స్‌ విజయానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదంటారు విశ్లేషకులు.
మనం కూడా 'సాంకేతిక భారతదేశాన్ని' కలగందాం! కల అంటే...నిద్రలో వచ్చి, నిద్రలో పోయేది కాదు. నిద్రపోనివ్వనిది.
పెద్ద పండగలు!
వీలుంటే చూసితీరాల్సిన, దమ్ముంటే పాల్గొనితీరాల్సిన సైన్స్‌ ఫెస్టివల్స్‌ ఇవి. పోటీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. బహుమతులు లక్షల్లో ఉంటాయి. మీడియా మహాగొప్పగా ప్రచారం కల్పిస్తుంది.

టెక్‌ఫెస్ట్‌
ముంబయి ఐఐటీలో ఘనంగా జరుగుతుంది. ఆసియాలోనే అతిపెద్ద సైన్స్‌ ఫెస్టివల్‌. దాదాపు లక్షమంది విద్యార్థులొస్తారు. ఇరవై వేల కాలేజీలు పాల్గొంటాయి. పన్నెండు దేశాలు హాజరువేసుకుంటాయి.

క్షితిజ
ఖరగ్‌పూర్‌ ఐఐటీ సాంకేతికోత్సవం. ఐదేళ్ల క్రితమే ప్రారంభమైనా అనూహ్యంగా ప్రచారం పొందింది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్ని ఎంపిక చేసుకుని, అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేయడం 'క్షితిజ' గొప్పదనం.

టెక్రితి
కాన్పూర్‌ ఐఐటీలో అతిపెద్ద పండగ. ఓ వైపు సైన్స్‌ ఫెస్టివల్‌, మరోవైపు బిజినెస్‌ ఫెస్టివల్‌ ఒకేసారి జరగడం విశేషం. ఆలోచన, అమలు...పక్కపక్కనే ఉంటే తిరుగేముంది.

కాగ్నిజెన్స్‌
రూర్కీ ఐఐటీ సైన్స్‌ ఫెస్టివల్‌. 'డిజైన్‌ యువర్‌ రోబో' పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతర్జాతీయ రోబో సృష్టికర్తలంతా రంగంలో దిగుతారు. 'ఇన్‌సోమ్నియా' పేరుతో రాత్రంతా జరిగే 'కోడింగ్‌' పోటీల్లో పాల్గొనడం గొప్ప అనుభూతి.

చావోస్‌
అహ్మదాబాద్‌ ఐఐఎమ్‌లో ఏటా జరిగే ఫెస్టివల్‌. ఆటపాటల కంటే, పర్యావరణ ప్రచారానికే పెద్దపీట. ఆ నాల్రోజులూ ఎక్కడ చూసినా ఆ నినాదాలే, ఆ పోస్టర్లే, ఆ డాక్యుమెంటరీలే. అతిథులు కూడా పర్యావరణానికి హాని చేయం అని హామీ ఇవ్వాలి.

ట్రిస్ట్‌
'శుక్రగ్రహం మీద మనిషి, నీళ్లతో నడిచే కారు, అంతరిక్షంలో విందులు ...సామాన్యుల ఊహ ఎక్కడ అంతమవుతుందో అక్కడే మా సృజన వెుదలవుతుంది'...అంటున్నారు ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు. రాక్‌ డాన్స్‌లూ, రోబో ఫైట్లూ షరా మామూలే!

శాస్త్ర
'దేశంలోని అత్యుత్తమ బుద్ధిజీవులకు స్వాగతం' అనడంలోనే ఐఐటీ చెన్నై సాంకేతికోత్సవం సత్తా అర్థమైపోతుంది. నాలుగు రాత్రులూ ఐదు పగళ్లూ జరిగే ఈ పండగలో పాల్గొనాలంటే పెట్టిపుట్టాలి. పుణె, సూరత్‌లలో 'సంపర్క్‌' పేరుతో మినీ ఉత్సవాలు జరుగుతాయి.

నివాళి...
ప్రఖ్యాత శాస్త్రవేత్త సి.వి.రామన్‌ 'కాంతి సూత్రానికి' 1930 ఫిబ్రవరి 28న నోబెల్‌ బహుమతి లభించింది. ఆ మహామేధావి గౌరవార్థం ఏటా ఫిబ్రవరి 28వ తేదీని 'జాతీయ సైన్స్‌ దినోత్సవం'గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సైన్స్‌ పరిశోధనల్లో అగ్రస్థానంలో నిలిచే సంస్థల్నీ వ్యక్తుల్నీ ఆరోజు ప్రత్యేకంగా సత్కరిస్తారు. గత ఏడాది విక్రమ్‌సారాభాయ్‌ కమ్యూనిటీ సైన్స్‌ సెంటర్‌కు ఆ గౌరవం దక్కింది. 'భూమితల్లిని అర్థంచేసుకుందాం'...ఈ ఏడాది సైన్స్‌ డే నినాదం!