డీలర్లకు రూ.25 కమీషన్
ఎస్‌బీఐ బీమా, మైసూర్ శాండల్ సబ్బులు కూడా
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో చిల్లర సమస్య తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చౌకధరల దుకాణాలద్వారా ప్రజలకు చిల్లర అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రతిపాదనల మేరకు తొలుత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో చౌకధరల దుకాణాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతరం జిల్లా, మండల కేంద్రాలకు విస్తరించనున్నారు. రేషన్‌షాపుల్లో అన్ని రకాల వస్తువులు, సేవలు అందుబాటులోకి తేవడంలో భాగంగా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. ఇక నుంచి అన్ని రేషన్‌షాపుల్లో రూ.1, రూ.2, రూ.5 నాణేల కూడా లభిస్తాయి. ఆర్‌బీఐ ఈ నాణేలను సరఫరా చేస్తుంది. ప్రతి రేషన్ డీలర్‌కు గుర్తింపు కార్డు ఇస్తారు. దానిని సమీప ఏదైనా జాతీయ బ్యాంకులో చూపించి నోట్లు ఇచ్చి దానికి సామానమైన చిల్లర తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాగులో రూ.2,500 విలువైన నాణేలు ఉంటాయి. వాటిని నోట్ల రూపంలోకి మార్చితే రూ.25 వరకు డీలర్‌కు ఆర్‌బీఐ కమీషన్ కింద చెల్లిస్తుంది. ఈ విధానం వల్ల చిల్లర సమస్యతోపాటు డీలర్లకు ఆర్థికంగా వెసులుబాటు అవుతుందని ఓ అధికారి తెలిపారు. బీమా ఏజెంట్లుగా: రేషన్ డీలర్లను బీమా ఏజెంట్లుగా నియమించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మేరకు పౌరసరఫరాలశాఖతో చర్చిస్తోంది. ఇందులో భాగంగా ఇక నుంచి రేషన్ డీలర్ వద్దే బీమా పాలసీ తీసుకునేఅవకాశం ఉంటుంది. ఇందుకు గానూ వారికి పాలసీపై కమీషన్ ఇస్తారు. అంతేకాక మైసూర్ శాండిల్ సబ్బులు కూడా రేషన్‌షాపుల్లో లభించనున్నాయి. బయట మార్కెట్ కంటే ఇక్కడ తక్కువ ధరకే విక్రయించనున్నారు. త్వరలోనే ఈ సేవలన్నీ అందుబాటులోకి రానున్నాయని హైదరాబాద్ పౌరసరఫరాలశాఖ ముఖ్య అధికారి లోకేష్‌కుమార్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు.