Tuesday, March 2, 2010

పరుగో పరుగు.. ఫిబ్రవరిలోనూ వాహన అమ్మకాల జోరు

పరుగో పరుగు..
ఫిబ్రవరిలోనూ వాహన అమ్మకాల జోరు
ముంబయి:ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కడాన్ని సూచిస్తూదేశీయంగా వాహనాల అమ్మకాలు ఫిబ్రవరిలోనూ పెరిగాయి. గత నెలలోటాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల అమ్మకాలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 67 శాతం పెరిగి 39,205 వాహనాలకు చేరాయి. మధ్య శ్రేణి, భారీ వాణిజ్య వాహనాల విక్రయాలైతే దాదాపు వంద శాతం మేర వృద్ధి చెంది 7,441 వాహనాలకు చేరినట్లుగా సంస్థ తెలిపింది. ఫిబ్రవరిలో మొత్తం టాటా మోటార్స్‌ అమ్మకాలు 58% ఎగసి 69,427 వాహనాలుగా నమోదు అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 43,811గా ఉంది.

అత్యధిక స్థాయిలో త్రిచక్ర వాహన విక్రయాలు: టీవీఎస్‌.. ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ అమ్మకాలు ఫిబ్రవరిలో 31 శాతం పెరిగి 1,40,544 వాహనాలకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ అమ్మకాలు 1,07,301 వాహనాలుగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా త్రిచక్ర వాహనాల విభాగంలో సంస్థ రికార్డు స్థాయిలో 2,132 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థఅమ్మకాలు కేవలం 550 వాహనాలుగా నమోదు అయ్యాయి.

బేషుగ్గా బెంజ్‌ అమ్మకాలు: మెర్సిడెజ్‌ బెంజ్‌ ఫిబ్రవరి అమ్మకాల్లో అత్యధిక స్థాయిలో 78 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో మొత్తం 439 వాహనాలను విక్రయించింది. పోయిన ఏడాది ఇదే కాలంలో సంస్థ అమ్మకాలు కేవలం 246 వాహనాలు మాత్రమే.


ఆకర్షణీయ ధరల్లో లావా మొబైల్స్‌
హైదరాబాద్‌: సువిశాలమైన భారత గ్రామీణ ప్రాంత మొబైల్‌ మార్కెట్‌లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చక్కటి ఫీచర్లతో కూడిన మొబైల్‌ ఫోన్‌లను ఆకర్షణీయమైన ధరలకు అందిస్తున్నట్లు లావా ఇంటర్‌నేషనల్‌ తెలిపింది. డ్యూయల్‌ సిమ్‌, మొబైల్‌ ట్రాకర్‌, మూవింగ్‌ సెన్సర్‌ వంటి ప్రత్యేకతలతో పాటు బ్యాటరీ బ్యాకప్‌, స్థానిక భాష, టార్చ్‌ వంటి సౌకర్యాలు ఉండే ఈ ఫోన్‌లు రూ.1,699 నుంచి రూ.5,500 ధరల శ్రేణిలో లభిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది. పట్టణ ప్రాంతాల వారి కోసం పూర్తి మల్టిమీడియా మొబైల్స్‌ శ్రేణిని రానున్న నెలల్లో ప్రవేశపెట్టనున్నట్లు లావా ఇంటర్‌నేషనల్‌ విక్రయాలు, మార్కెటింగ్‌ విభాగం అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.

ఎస్‌బీహెచ్‌ డైరెక్టర్‌గా నరసింహ
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌)లో సహాయ జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్న పి.నరసింహను ఆ బ్యాంకు బోర్డులో డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. బ్యాంకు అధికారుల (ఆఫీసర్‌ ఎంప్లాయి) తరఫు డైరెక్టర్‌గా ఈ నియామకం చేసినట్లు బ్యాంకు తెలిపింది.