తొలగించమంటే.. పెంచారు
కష్టకాలంలో మద్దతు కరవు
బులియన్ వర్గాల ఆవేదన
అధిక ధర వల్ల అమ్మకాలపై ప్రభావం ఉండదు

ధర స్థిరపడుతున్న తరుణంలో..: గత డిసెంబరులో 10 గ్రాముల బంగారం ధర రూ.18,000 దాటింది. ఈ ఏడాదిలో రూ.15,500 నుంచి రూ.16,000 మధ్య స్థిరపడవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధర స్థిరపడితే.. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటివరకు బులియన్ వర్గాలు భావించాయి. తాజా నిర్ణయం వల్ల దిగుమతులపై ప్రభావాన్ని పరిశీలిస్తున్నారు. 'గత ఒకటి రెండు సంవత్సరాలుగా పసిడి ధర ఎక్కువగా ఉండడం వల్ల వినియోగదారులు పాత బంగారాన్ని బాగా విక్రయించారు. వ్యాపారులు కూడా చాలా స్వల్పంగా దిగుమతి చేసుకున్నారు. దీంతో దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 2007లో దాదాపు 797 టన్నుల పైడి దిగుమతి అయింది. 2008లో 439 టన్నులకు తగ్గింది. గత ఏడాదికి 200 టన్నులకే పరిమితం కాగలదని అంచనా వేసినప్పటికీ, 340 టన్నులు దిగుమతి చేసుకున్నారు. ఈసారి (2010) దిగుమతులు 500 టన్నులను మించగలవని భావిస్తున్నారు. తాజా నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి..' అని జంటనగరాల బులియన్ వర్తకుల సంఘం ప్రతినిధి తెలిపారు. దిగుమతి చేసుకున్న బంగారంతో నగలు తయారు చేసి ఎగుమతి చేస్తే ఆ బంగారంపై దిగుమతి సుంకం ఉండదు.
ఎగుమతులపైనా చిన్న చూపే
మద్దతు ఇచ్చి ఆదుకోవలసిన తరుణంలో ప్రభుత్వం వెనుకడుగు వేసిందని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. ఎగుమతిదారులకు 2 శాతం వడ్డీ మినహాయింపును వచ్చే ఏడాది మార్చి వరకు బడ్జెట్‌లో పొడిగించారు. అయితే.. దీన్ని రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు వర్తింపచేయలేదని జీజేఈపీసీ ఛైర్మన్ వసంత్ మెహతా తెలిపారు. దీనివల్ల పోటీ దేశాలతో పోలిస్తే ఎగుమతిదారులకు నగల తయారీ వ్యయం పెరుగుతుంది. దీని ప్రభావం ఎగుమతులపై ఉంటుందని ఆయన అన్నారు. 2008-09లో విలువైన రాళ్లు, ఆభరణాల పరిశ్రమ 2500 కోట్ల డాలర్ల ఎగుమతులు చేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా గత ఏడాదిన్నర కాలంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. ఈ పరిశ్రమకు కేంద్రమైన సూరత్‌లో కొన్ని వేల మంది శ్రామికులు ఉపాధి కోల్పోయారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) పెంపు కూడా నగల అమ్మకాలను ప్రభావితం చేస్తుందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. బంగారం ఆభరణాలకు మెరుగు దిద్దే రోడియమ్ దిగుమతులపై సుంకాన్ని 10 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం, ఇతర మార్పుల వల్ల కలిగే ప్రయోజనం స్వల్పమేనని నగల తయారీదారులు అంటున్నారు.                         
