Tuesday, March 2, 2010

ఉద్దీపనలు వెనక్కి తీసుకున్నా ప్రగతి ప్రయాణం ఆగదు

ఉద్దీపనలు వెనక్కి తీసుకున్నా
ప్రగతి ప్రయాణం ఆగదు
సీఐఐ-ఏపీ సదస్సులో నిపుణుల విశ్లేషణ
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: గత ఏడాదిన్నర కాలంలో మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పధకాల ద్వారా పరిశ్రమకు రూ.1.86 లక్షల కోట్ల మేరకు చేయూతనిచ్చింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో నెమ్మదిగా ఈ ఉద్దీపనలను వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టింది. బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిందిదే. దీనిపై కొన్ని పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే దీనివల్ల ఇబ్బందేమీ లేదని, ఉద్దీపనలు వెనక్కి తీసుకున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ఆగదని సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆంధ్రప్రదేశ్‌ విభాగం ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. శనివారం ఉదయం ఇక్కడ జరిగిన సదస్సులో యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సీనియర్‌ సలహాదారుడైన బి.శంకర్‌ మాట్లాడుతూ పరిశ్రమలపై పరోక్ష పన్నుల ప్రభావాన్ని వివరించారు. సేవల పన్ను కిందకు వచ్చే కొత్త సేవల వివరాలను విశ్లేషించారు. జీఎస్‌టీ (గూడ్స్‌ అండ్‌ సరీసెస్‌ టాక్స్‌) అమలును వచ్చే ఏడాదికి వాయిదా వేసిన నేపథ్యంలో, ముందే అంచనా వేసినట్లుగా సేవల పన్ను రేటును మార్చలేదని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో మంచి బడ్జెట్‌ అని ఎం. ఆనందం అండ్‌ కో భాగస్వామి అయిన ఎం.ఆర్‌.విక్రమ్‌ అభిప్రాయపడ్డారు. వృద్ధి బాట నుంచి తప్పకోకుండా ఆర్థిక స్థిరత్వానికి ప్రణబ్‌ ముఖర్జీ పెద్దపీట వేశారని విశ్లేషించారు. ప్రభుత్వ ఆదాయాల స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే 15 శాతం నుంచి 18 శాతానికి మ్యాట్‌ పెంపు సహేతుంగానే కనిపిస్తోందని అన్నారు. సీఐఐ-ఏపీ వైస్‌ఛైర్మన్‌, ఏడీపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ శక్తిసాగర్‌ మాట్లాడుతూ తమ అంచనాలకు అనుగుణంగానే నూతన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారని అన్నారు. స్పష్టంగా ఆర్థిక లోటు లక్ష్యాలు నిర్దేశించుకోవడం, పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళిక ద్వారా మూలధన అవసరాలకు నిధుల సమీకరణ, ఉద్దీపన పథకాలను నుంచి నెమ్మదిగా వైదొలగే చర్యలు ప్రకటించడం బాగున్నాయని అన్నారు. మెరుగైన ఆర్థికాభివృద్ధికి తగిన వేదికను ప్రణబ్‌ ముఖర్జీ సిద్ధం చేస్తున్నట్లుగా ఉందని విశ్లేషించారు.