పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం
వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం
పారిశ్రామికవేత్తలకు సీఎం హామీ
హైదరాబాద్, న్యూస్‌టుడే: పెట్టుబడులకు రాష్ట్రం అత్యంత అనుకూలమని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. పారిశ్రామిక రంగానికి త్వరలో వరాలనుకురిపించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఆదివారంతన నివాసంలో కలిసిన కొందరు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. త్వరలో చేపట్టేబోయే కొత్త పారిశ్రామిక విధానంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు. జిల్లాల వారిగా పరిశీలనలు జరిపి రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో పత్తి దిగుబడులను దృష్టిలో పెట్టుకొని జౌళి రంగ అభివృద్ధికి కొత్త విధానం రూపొందిస్తున్నట్లు చెప్పారు. స్పిన్నింగు, చేనేత మిల్లులను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తూ కొత్త పారిశ్రామిక విధానం రూపొందించాలని టెలిఫోన్‌లో రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి కన్నా లక్ష్మినారాయణను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. ఇటీవల ఇబ్బందులెదురైనా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచినందుకు ఐటీ కంపెనీలు, పరిశ్రమలకు సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యామ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.