రుణాల రేట్లు ఇప్పుడే పెంచం
ఎస్‌బీఐ ఛైర్మన్
ఒ.పి.భట్ స్పష్టీకరణ
ముంబయి: దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణ వడ్డీ రేట్లను తక్షణం పెంచే ఉద్దేశం లేదని ఆ బ్యాంకు ఛైర్మన్ ఒ.పి.భట్ అన్నారు. ఎస్‌బీఐ వెయ్యో శాఖను, 10వేలవ ఏటీఎమ్‌ను ఆయన శనివారమిక్కడ ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దీంతో ఎస్‌బీఐ శాఖల సంఖ్య 12,448కి చేరింది. అలాగే ఈ బ్యాంకుకు 21,000కు పైగా ఏటీఎమ్‌లు ఉన్నట్లవుతోంది. 'మేం వచ్చే నెల రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్ష వెలువరించే వరకు వేచి ఉండి, అది అందించే సంకేతాలను గమనించి ఒక నిర్ణయానికి వస్తామ'ని భట్ చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే ఆలోచనతోనే ఆర్‌బీఐ రెపో, రివర్స్ రెపో రేట్లను చెరి పావు శాతం మేర పెంచినట్లు స్పష్టం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ చర్యపై వివిధ బ్యాంకర్లు శుక్రవారం ప్రతిస్పందిస్తూ తమ తమ బ్యాంకుల గృహ రుణాలు, వాహన రుణాల వడ్డీ రేట్లలో మార్పుచేర్పులు చేసేందుకు కొంతకాలం వేచి ఉంటామని, మార్కెట్ పరిస్థితులను మదింపు చేస్తామని పేర్కొన్న విషయం విదితమే. కాగా రానున్న ఆర్థిక సంవత్సరం 2010-11లో ఆర్‌బీఐ ద్రవ్య విధానాన్ని మరింత కఠినం చేయవచ్చని భట్ అంచనా వేశారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో చాలినంత ద్రవ్య లభ్యత ఉందని ఆయన తెలిపారు. ఎస్‌బీఐ ఈ ఏడాది రుణ వితరణలో 18 శాతం వృద్ధిని, వచ్చే ఏడాదికి రుణ వితరణలో 20 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. టాటా మోటర్స్ ఫైనాన్స్ (టీఎంఎఫ్‌ఎల్)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసే అంశంపై భట్ మాట్లాడుతూ, ఆ కంపెనీలో 30 శాతం వరకు స్టేక్ పెంచుకోవడానికి ఆర్‌బీఐ అనుమతిని కోరినట్లు వెల్లడించారు. (30 శాతం కన్నా ఎక్కువ వాటా సొంతం చేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతిని పొందవలసి ఉంటుంది.) జైన్ టెలికాం కొనుగోలుకు యత్నిస్తున్న భారతీ ఎయిర్‌టెల్‌కు రుణం ఇచ్చేందుకు ఎస్‌బీఐ ఎలాంటి హామీని ఇవ్వలేదన్నారు. అంత క్రితం శుక్రవారం రాత్రి ఎస్‌బీఐ ముఖ్య ఫైనాన్షియల్ అధికారి ఎస్.ఎస్.రంజన్ ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ఆర్‌బీఐ చర్యతో తమ బ్యాంకు రుణ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.