Tuesday, March 23, 2010

రష్యాలో చమురు క్షేత్రాల కొనుగోలుపై ఓఎన్‌జీసీ కన్ను

న్యూఢిల్లీ: రష్యా, సీఐఎస్‌ ప్రాంతాల్లో చమురు క్షేత్రాల కొనుగోలు చేసేందుకు మూడు రష్యా కంపెనీలతో ఓఎన్‌జీసీ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓఎన్‌జీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఎస్‌.శర్మ తెలిపారు. రోజ్‌నెఫ్ట్‌, గాజ్‌ప్రోమ్‌, సిస్టెమా (చమురు- టెలికాం గ్రూపు)లు ఓఎన్‌జీసీ చర్చలు కొనసాగిస్తున్న సంస్థల్లో ఉన్నట్లు సోమవారమిక్కడ జరిగిన 6వ ఆసియా గ్యాస్‌ భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సులో శర్మ వెల్లడించారు. ఓఎన్‌జీసీ కొనుగోలుకు యోచిస్తున్న సంస్థల జాబితాలో రష్యా దూర ప్రాచ్యంలోని సఖాలిన్‌-3 ప్రాజెక్టు కూడా ఉందన్నారు. మిగతా చమురు క్షేత్రాల పేర్లు తెలపడానికి మాత్రం ఆయన ముందుకు రాలేదు. ఇటీవల రష్యా ప్రధాని పుతిన్‌ భారత పర్యటన సందర్భంగా ఆ దేశ దూరప్రాచ్యం, తూర్పు సైబీరియాల్లోని చమురుక్షేత్రాలను కొనేందుకు ఓఎన్‌జీసీ ఆసక్తిని కనబర్చింది. అయితే ఈ విషయాన్ని రష్యా సర్కారు అంతగా పట్టించుకోలేదు. కానీ యామల్‌లో కొనుగోలు ప్రతిపాదనను పరిశీలించడానికి సుముఖత వ్యక్తం చేసింది.