.ధర కారణం కాదు! ఎన్‌టీపీసీ ఇష్యూకు అరకొర స్పందనపై ప్రభుత్వ వివరణ
..ధర కారణం కాదు!
ఎన్‌టీపీసీ ఇష్యూకు అరకొర స్పందనపై
ప్రభుత్వ వివరణ న్యూఢిల్లీ: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) ఫాలోఆన్ పబ్లిక్ ఇష్యూకు (ఎఫ్‌పీఓకు) రిటైల్ మదుపరుల నుంచి తక్కువగా స్పందన రావడానికి అధిక ఇష్యూ ధరే కారణమనడం సరికాదని ఆర్థిక మంత్రుత్వ శాఖ వివరణ ఇచ్చింది. గత నెల 3న ప్రారంభమై 5న ముగిసిన ఈ ఇష్యూకు ధరను ప్రభుత్వం 5 శాతం డిస్కౌంట్‌తో రూ.201గా నిర్ణయించింది. అయితే ఇష్యూకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కేవలం 0.14శాతం సబ్‌స్క్రిప్షన్ మాత్రమే లభించింది. ఎక్కువ నికర విలువ కలిగిన వారి నుంచి 0.39 శాతం స్పందన వచ్చింది. అధిక ధర వల్లే రిటైల్ మదపరులు ఎఫ్‌పీఓకు దూరంగా ఉన్నారంటున్న మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయాన్ని ఆర్థిక మంత్రుత్వ శాఖ తప్పుబట్టింది. దీనిపై డిజిన్వెస్ట్‌మెంట్‌శాఖ మాజీ కార్యదర్శి సునీల్ మిత్రా(ప్రస్తుతం ఈయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు) వివరణ ఇస్తూ రిటైలర్ల స్పందన తక్కువగానే ఉన్నప్పటికీ ఇష్యూ ధర మాత్రం బాగుందని వ్యాఖ్యానించారు. తాజా ఎఫ్‌పీఓ ద్వారా సుమారు రూ.8,500 కోట్ల నిధులను సమీకరించినట్లు గతంలో సమీకరించిన దాని కన్నా మూడు రెట్లు ఎక్కువని తెలిపారు. 2005లో ఇంతే పరిమాణంలో వాటాలను విక్రయించినప్పటికీ రూ.2,700కోట్ల నిధులను మాత్రమే సమీకరించినట్లు వివరించారు. జనవరి మధ్యలో ఈ షేరు విలువ రూ.235 దరిదాపుల్లో ఉండేదని అయితే ఇష్యూ కారణంగా బేర్ అపరేటర్లు ధర తగ్గేంచే చర్యలకు దిగారా? అనే విషయాన్ని డిజిన్వెస్ట్‌మెంట్‌శాఖ సమీక్షిస్తుందని తెలిపారు. రానున్న ఎన్‌ఎండీసీ, ఎస్‌జేవీఎన్‌ఎల్ ఇష్యూలకూ ప్యూర్ ఆక్షన్ విధానాన్నే పాటిస్తారా? అన్న అంశానికి ఆయన స్పందిస్తూ దీనిపైసంబంధిత శాఖ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.