బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లో పెంచిన పెట్రో సుంకాలను తగ్గించలేమని ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ''ప్రస్తుత ద్రవ్య పరిస్థితి అందుకు అనుమతించదు. మంచిరోజుల కోసం కొన్నాళ్లు ఎదురుచూద్దాం'' అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో ఆర్థికబిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాన్యులను బాధించేలా ఆహారధాన్యాల ధరలు పెరిగాయని ఆయన అంగీకరించారు. ఇదేసమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎస్) పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పీడీఎస్‌ను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రధానంగా రాష్ట్రాలపైనే ఉందన్నారు. ద్రవ్యోల్బణం కొంత తగ్గినా ఇప్పటికీ అది సుమారుగా 17 శాతం ఉందని చెప్పారు. దేశంలో తగినన్ని ఆహారనిల్వలు ఉన్నాయని, సేకరించిన ధరకే వాటిని రాష్ట్రాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గంపగుత్తగా అన్నిటికీ రాయితీలు ఇవ్వడం సాధ్యంకాదని చెప్పారు. అంతకుముందు భాజపా సభ్యుడు ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ... పెట్రోల్, డీజిల్ ధరలపై పెంచిన సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. తద్వారా పెట్రో ధరలు తగ్గుతాయన్నారు. పెట్రో ఉత్పత్తులపై 100 శాతం మేర రకరకాల పన్నులు వేసి సామాన్యులను లూటీ చేస్తున్నారని విమర్శించారు. రక్షణ సిబ్బందికి ప్రధాని ప్రకటించిన ఒక ర్యాంకు-ఒక పెన్షన్ విధానాన్ని ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఎరువులపై రాయితీలను పునరుద్ధరించాలని, స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ... ఎన్‌డీఏ హయాంలోనే పెట్రో ధరలు ఎక్కువగా పెరిగాయని గణాంకాలు చెప్పారు. చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది. దీంతో కేంద్ర బడ్జెట్(2010-11)కు మంగళవారం పార్లమెంటు ఆమోదం లభించినట్లయింది. లోక్‌సభలో మంగళవారం ఎటువంటి చర్చలేకుండానే రెండు బిల్లులకు ఆమోదం లభించింది. ముంబయి రైల్వే డ్రైవర్ల సమ్మెపై గందరగోళం సాగుతుండగానే మైనారిటీ విద్యాసంస్థల (సవరణ)బిల్లు-2009, ఇంధన సంరక్షణ (సవరణ) బిల్లు-2010 ఆమోదం పొందాయి.