Wednesday, May 5, 2010

యులిప్‌లతో విధిగా జీవిత బీమా హామీ

ఐఆర్‌డీఏ నియమాలు కఠినతరం
న్యూఢిల్లీ: యూనిట్‌-లింక్డ్‌ ఇన్స్యూరెన్స్‌ ప్లాన్‌ (యులిప్‌)ల నియంత్రణ అధికారం కోసం సెబీతో అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన ఐఆర్‌డీఏ, సరికొత్తగా యులిప్‌ నియమావళిని కఠినతరం చేసింది. బీమా కంపెనీలు యులిప్‌లతో పాటు జీవిత బీమా రక్షణకు హామీని ఇవ్వాలని ఐఆర్‌డీఏ తాజాగా పునరుద్ఘాటించింది. 2005 డిసెంబరులో యులిప్‌లపై తాను వెలువరించిన ఒక ఆదేశాన్ని గత రాత్రి మరోమారు గుర్తు చేస్తూ, ''పింఛన్‌/యాన్యుయిటీ పథకాలు సహా అన్ని యూలిప్‌లు పాలసీదారు మరణం సంభవిస్తే కనీసంగా ఇంత మొత్తాన్ని చెల్లిస్తామన్న (అష్యూర్డ్‌ ఇన్స్యూరెన్స్‌ కవర్‌) విషయాన్ని పేర్కొనాల''ంది. అయితే ఆరోగ్య బీమా రక్షణను అందించే యులిప్‌లకు మాత్రం డెత్‌ బెనిఫిట్‌ నిబంధన తప్పనిసరి కాదు అని వివరణ ఇచ్చింది. ఇంకా ఏమందంటే:
* రుణం పొందడానికి యులిప్‌లను ఉపయోగించుకోకూడదని కూడా స్పష్టం చేసింది. (''యులిప్‌లకు ఎలాంటి అప్పు మంజూరు చేయరాద''ంది).
* ఇండివిడ్యువల్‌ ప్రోడక్ట్‌ల విషయంలో పాలసీ కనీస కాలపరిమితి 5 సంవత్సరాలు ఉండాలని, గ్రూప్‌ ప్రోడక్ట్‌లను ప్రతి సంవత్సరం పునరుద్ధరించవచ్చంది (రెన్యువల్‌).
* పింఛన్‌ లేదా యాన్యుయిటీ ప్రోడక్ట్‌లు మినహా మిగిలిన అన్ని రకాల యులిప్‌లలోనూ అయిదో ఏడాది పూర్తి అయ్యాక పాక్షిక విత్‌డ్రాయల్స్‌ను అనుమతించవచ్చంది.
* యూనిట్‌ లింక్డ్‌ పెన్షన్‌ లేదా యాన్యుయిటీ ప్రోడక్ట్స్‌ విషయానికి వస్తే.. పాక్షిక విత్‌డ్రాయల్‌ను అనుమతించరు; పోగయిన ఫండ్‌ విలువను కాలపరిమితి పూర్తి అయిన తరువాతనే యాన్యుయిటీ (ప్రతి సంవత్సరం చెల్లించే నిర్ణీత మొత్తం)గా మార్పిడికి అనుమతిస్తారు.
* ప్రతి టాప్‌-అప్‌ ప్రీమియంకు అలాంటిది చెల్లించిన తేదీ నాటి నుంచి మూడు సంవత్సరాల లాక్‌-ఇన్‌ వ్యవధి ఉంటుంది. కాంట్రాక్టు చివరి మూడేళ్ల పాటు మాత్రం వాటిని అనుమతించరు.
* సవరించిన నియమాలు రానున్న జులై ఒకటో తేదీ నుంచి అమలవుతాయని ఐఆర్‌డీఏ తెలిపింది.