Wednesday, May 5, 2010

వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌పై ప్రపంచ బ్యాంక్‌ మూడేళ్ల నిషేధం

న్యూఢిల్లీ: మోసం, అవినీతి ఆరోపణలపై భారతీయ కంపెనీ వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ తమతో మూడు సంవత్సరాల పాటు ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ చర్య గత జనవరి 11 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. దీనిపై వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌ ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ, నిషేధం రద్దు చేయవలసిందిగా కోరుతూ గత ఫిబ్రవరిలోనే ప్రపంచ బ్యాంకును తాము సంప్రదించినట్లు చెప్పారు. సంస్థ ఉద్యోగుల్లో ఒకరు 2003లో 50,000 డాలర్ల విలువైన ఎయిర్‌కండిషనర్ల సరఫరా టెండరు పత్రాల్లో కొంత తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లు కనుగొన్న ప్రపంచ బ్యాంక్‌ ఈ చర్య తీసుకొందని ధూత్‌ వివరించారు. అయితే ఆ ఉద్యోగిని తాము సస్పెండ్‌ చేసి క్రమశిక్షణ చర్య తీసుకొన్నట్లు ధూత్‌ చెప్పుకొచ్చారు. ఇంతవరకు ప్రపంచ బ్యాంకుకు మరేమీ సరఫరా చేయలేదని ఆయన అన్నారు. తమ గ్రూపు జరిపే వ్యాపారంతో పోలిస్తే అది ఏమంత గొప్ప ఆర్డరు కాదని, అయినా తమ గ్రూపు సంస్థలు ఏదైనా ఒక సరఫరా ఆర్డర్‌ను సంపాదించడం కోసం తప్పుడు పనులకు పాల్పడవని వీడియోకాన్‌ ఛైర్మన్‌ అన్నారు.