ఆస్తిపన్ను బకాయిల గడువు పెంచబోం
పురపాలక మంత్రి ఆనం వెల్లడి
హైదరాబాద్ - న్యూస్‌టుడే
జవహర్లాల్ నెహ్రూ జాతీయ నగర నవీకరణ పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) నిబంధనల్లో భాగంగా స్టాంపుడ్యూటీని అయిదు శాతానికి తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర పురపాలకశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర పథకం అమలు కోసం స్టాంపుడ్యూటీని విధిగా తగ్గించాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకు అమలు చేయలేదనే కారణంతో నిధుల్లో కేంద్రం కోత విధించిందని, నిధులను పొందేందుకు వీలుగానే స్టాంపుడ్యూటీ తగ్గింపునకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆస్తిపన్ను బకాయిల వసూలుకు గత నెలాఖరుతో గడువు ముగిసిందని, మళ్లీ గడువు పెంచే ఆలోచన లేదన్నారు. గడువు పెంపుదల వల్ల మార్చి 27 నుంచి ఏప్రిల్ 30 వరకు హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రూ.95 కోట్లు, రాష్ట్రంలోని ఇతర నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో రూ.133 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. బకాయిల చెల్లింపుల ద్వారా ఇళ్ల యాజమానులకు రూ.21 కోట్ల వరకూ వడ్డీ రాయితీ లభించిందన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రూ.612 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలయిందని.. హైదరాబాద్‌లో 9.5 లక్షల మంది, ఇతర ప్రాంతాల్లో 5.82 లక్షల మంది పన్ను చెల్లించారన్నారు. పురపాలక సంఘాలకు ప్రభుత్వం తరఫున వడ్డీ రాయితీ నిధులను చెల్లించమని స్పష్టం చేశారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.