Wednesday, May 5, 2010

బైక్‌.. కొందామంటే దొరకట్లేదు!

అనూహ్యంగా పెరిగిన గిరాకీ
డెలివరీకి ఆగాల్సిందే అంటున్న విక్రేతలు
ఉత్పత్తి పెంచే యత్నాల్లో కంపెనీలు
పరీక్షల్లో శర్మ ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాడు. మాట ఇచ్చినట్లు నాన్న బైక్‌ కొనడమే తరువాయి.. షికార్లు కొట్టొచ్చనే ఆనందం అతన్ని నిలవనివ్వడం లేదు.
బైక్‌ మోడల్‌ ఎంపిక చేసుకుందామని షోరూమ్‌కెళ్లి అక్కడి బోర్డు చూసేసరికి ఎక్కడలేని నీరసం తన్నుకొచ్చింది. కొత్త బైక్‌ కావాలంటే కనీసం నెల, నెలన్నర ఆగాల్సిందేనన్నది ఆ బోర్డు సారాంశం.

ఏ షోరూమ్‌ కెళ్లినా అదే పరిస్థితి. ఇంకొన్ని చోట్ల బైక్‌ డెలివరీకి హీనపక్షం పదిహేను రోజులు ఆగాలంటూ అక్కడి సేల్స్‌ మేనేజర్‌ చెప్పడంతో చేసేదిలేక నిరుత్సాహంగా వెనుదిరగాల్సి వచ్చింది.

దాదాపు ప్రతి నగరం/పట్టణంలోనూ బైక్‌ షోరూమ్‌ల్లో ఇదే పరిస్థితి. గత కొన్నాళ్ల నుంచి ఈ ఇబ్బంది ఉంటున్నప్పటికీ.. ఇప్పుడు మరింత ఎక్కువైంది. చేతిలో డబ్బులున్నా.. నచ్చిన బైక్‌ అప్పటికప్పుడు కొనుక్కోలేని పరిస్థితి చాలామందికి ఎదురవుతోందీ మధ్య. గత జనవరి నుంచి బైక్‌లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తగ్గట్లు కంపెనీల ఉత్పత్తి మాత్రం ఉండటం లేదు. ప్రస్తుతం బైక్‌ల కొరత మార్కెట్‌ను వేధిస్తోంది.

ఆరు వారాలు ఆగాల్సిందే:
జనవరి నుంచి హీరోహోండా కరిజ్మా, హంక్‌, బజాజ్‌ 100సీసీ డిస్కవర్‌ డీటీఎస్‌-ఎస్‌ఐ, పల్సర్‌ 135 ఎల్‌ఎస్‌, యమహా ఆర్‌15 వంటి పలు డీలక్స్‌, ప్రీమియమ్‌ బైక్‌లకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో వినియోగదారులు వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌15, ఎఫ్‌జెడ్‌ సిరీస్‌ యమహా బైక్‌లకు సుమారు రెండు-ఆరు వారాలు, బజాజ్‌లోని కొన్ని ప్రధాన మోడళ్లకు కనీసం 3 వారాలు, హోండా మోటర్‌ సైకిళ్లు, స్కూటర్ల కోసం దాదాపు నాలుగు వారాల పాటు వేచి చూడాల్సి వస్తోంది. హీరోహోండాలో కొన్ని ప్రధాన మోడళ్లకు కూడా ఇలాంటి నిరీక్షణ తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.

కంపెనీల కష్టం
పెరుగుతున్న గిరాకీని అందిపుచ్చుకొనేందుకు ప్రధాన బైక్‌ తయారీ కంపెనీలన్నీ పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా హీరోహోండా భవిష్యత్‌ అవసరాల కోసం కొత్తగా మరో తయారీ ప్లాంటు ఏర్పాటుకు వివిధ రాష్ట్రాల్లో భూసేకరణ యత్నాలు చేస్తోంది. మరోవైపు యమహా ఇండియా సంస్థ తయారీ షిఫ్టులను పెంచింది. హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) భారత్‌లో కొత్త ప్లాంటు ఏర్పాటు కోసం సుమారు రూ.470 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వచ్చే ఏడాది జులై నాటికి ఇక్కడి ఉత్పత్తి ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకొంటోంది. బజాజ్‌ సంస్థ కూడా నెలకు సగటున 3,00,000 బైక్‌ అమ్మకాల లక్ష్యం అందుకొనేలా ఉత్పత్తిని పెంచే యత్నాల్లో ఉంది.

గిరాకీ ఎందుకు పెరిగిందంటే
గత ఏడాది నెలకొన్న మాంద్యం కారణంగా చాలా మంది బైక్‌ల కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు కుదుట పడటం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండడంతో యువత మళ్లీ ఈ దిశగా తమ దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం వాహన రుణాలు తక్కువ వడ్డీకి లభిస్తున్నాయి, త్వరలో ఇవి పెరిగే సూచనలు కనిపిస్తుండడం డిమాండ్‌ పెరిగేందుకు మరో కారణంగా నిలుస్తోంది. పోటీ ప్రపంచంలో తమ అమ్మకాలు పెంచుకొనేందుకు కంపెనీలు ఇటీవల పలు సరికొత్త మోడళ్లను పరిచయం చేశాయి. ఇవి యువతను బాగా ఊరిస్తున్నాయి. దీంతో వారు కొత్త బైక్‌లపై మోజుతో పాత బైక్‌లను కొద్ది రోజులకే మార్చేస్తున్నారు. గిరాకీ పెరగడానికి ఇది ఒక కారణమే.

వాహన విడిభాగాల పంట పండింది
గిరాకీ పెరిగి కార్లు, మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు జోరందుకోవడంతో వాహన విడిభాగాల తయారీ సంస్థలు మళ్లీ లాభాల బాట పడుతున్నాయి. మాంద్యం కారణంగా గత కొంత కాలం నుంచి గడ్డుకాలం ఎదుర్కొన్న పరిశ్రమలు క్రమంగా కోలుకొని వృద్ధి బాట పడుతున్నాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రముఖ వాహన విడిభాగాల తయారీ సంస్థలు దాదాపు మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ట్యూబ్‌ ఇన్వెస్టిమెంట్‌ సంస్థ లాభం 366 శాతం ఎగిసింది. జమ్నా ఆటో ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర లాభం 34.5 శాతం పెరిగింది. వాహన కంప్రెసర్ల తయారీ సంస్థ ఎల్‌జీ ఎక్విప్‌మెంట్స్‌ వ్యాపారం 20 శాతం వృద్ధి చెందింది. సంస్థ లాభం కూడా రూ40.7 కోట్ల నుంచి రూ.58 కోట్లకు చేరింది. వీటితో పాటు పలు ఇతర సంస్థలు కూడా మెరుగైన లాభాలను ప్రకటిస్తున్నాయి.