Wednesday, May 5, 2010

గ్యాస్ ఉత్పత్తికి బ్రేకులు

రిలయన్స్‌కు త్వరలో ప్రభుత్వ ఆదేశాలు

పెట్రోనెట్ సంక్షోభమే కారణం
మరో మార్గం లేదన్న పెట్రోలియం శాఖ

న్యూఢిల్లీ: నిన్నమొన్నటి వరకూ దేశీయ మార్కెట్‌లో గ్యాస్ కొరత ఎక్కువ. కానీ.. ఇప్పుడు ట్రెండ్ రివర్సైంది. అవసరానికి మించిన గ్యాస్ నిల్వలు ప్రస్తుతం దేశంలో పేరుకుపోయాయి. వీటిని వదిలించుకోవడానికి రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని తగ్గించడం మినహా మరో మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది. తాత్కాలికంగా ఉత్పత్తిని తగ్గిస్తే.. ఈ సమస్య నుంచి గట్టెక్కే అవకాశాలుండటంతో ఈ దిశగా ఆదేశాలు జారీ చేయాలని యోచిస్తోంది. పెట్రోనెట్ ఎల్ఎన్‌జి దిగుమతి చేసిన గ్యాస్ వినియోగం అనూహ్యంగా తగ్గిపోవడమే ఈ చిత్రమైన పరిస్థితి తలెత్తడానికి కారణం.

ఖతార్ దేశంతో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్న పెట్రోనెట్ ఎల్ఎన్‌జి రూపంలో గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడి నుంచి దేశంలోని వినియోగ కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఎల్ఎన్‌జిని ముడి సరుకుగా ఉపయోగిస్తున్న మూడు ఎరువుల కంపెనీలు వార్షిక మరమ్మతు కార్యకలాపాల నిమిత్తం ప్లాంట్లను మూసివేశాయి. ఇదేశైలిలో ఎన్‌టిపిసి విద్యుత్ ప్లాంట్ ఒకటి ఉత్పత్తిని నిలిపివేసింది. దాద్రిలోని మరో ప్లాంట్ నేటి నుంచి కార్యకలాపాలను నిలిపివేస్తోంది.

ఇది నిల్వల సంక్షోభం..
అనూహ్యంగా సంభవించిన ఈ పరిణామాలతో గుజరాత్ తీరంలోని పెట్రోనెట్ దహేజ్ ఇంపోర్ట్ టెర్మినల్ నిల్వ సామర్థ్యం 96 శాతం మేర నిండిపోయింది. ఇకపై కొత్తగా గ్యాస్‌ను దిగుమతి చేసుకునే సామర్థ్యం ఈ టెర్మినల్‌కు లేదు. దీర్ఘకాలిక కాంట్రాక్టులు ఉన్నప్పటికీ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు 9 కార్గోల ఎల్ఎన్‌జి దిగుమతులకు తన టెర్మినల్ ఉపయోగించుకోవడానికి పెట్రోనెట్ అనుమతించడం అగ్నికి ఆజ్యం పోసింది. ఈ పరిస్థితుల్లో ఎల్ఎన్‌జిని తీసుకువచ్చే నౌకలను తిప్పిపంపడం మిన హా మరో మార్గం లేదని ప్రభుత్వం గుర్తించింది. రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని కొంతవరకూ తగ్గించుకోవడం ద్వారా సంక్షోభాన్ని అధిగమించవచ్చని పెట్రోలియం శాఖ తన సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఒకవేళ గ్యాస్ ఉత్పత్తిని తగ్గించడానికి రిలయన్స్ అంగీకరిస్తే, ఈ గ్యాస్‌ను వినియోగించే కంపెనీలు దిగుమతి చేసుకునే ఎల్ఎన్‌జిని వినియోగించవచ్చని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అయితే.. రిలయన్స్ గ్యాస్ ఎంఎంబిటియు ధర 4.2 డాలర్లు కాగా పెట్రోనెట్ గ్యాస్ ఎంఎంబిటియు ధర 5.42 డాలర్లు. చవక ధరల్లో లభించే రిలయన్స్ గ్యాస్‌ను కాదని అధిక ధరకు లభించే విదేశీ గ్యాస్ వినియోగానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలు పరిశ్రమ వర్గాలను నివ్వెరపరుస్తున్నాయి.