న్యూఢిల్లీ : ఒకవైపు లక్ష రూపాయలకే నానోను ఉత్పత్తి చేయటానికి టాటాలు నానా తంటాలు పడుతుండగా తాజాగా బజాజ్ ఆటో తాను లక్ష రూపాయలకే కారును తీసుకురానున్నట్లు వెల్లడించింది. 2008లో నానో మార్కెట్లోకి వ చ్చిరాగానే రెనాల్ట్-నిస్సాన్‌ల భాగస్వామ్యంతో 2,500 డాలర్లకే అల్ట్రా లోకాస్ట్ కారు (యుఎల్‌సి)ను రూపాందిస్తామంటూ బజాజ్ ఆటో అప్పట్లో హడావిడి చేసింది. అయితే ధర, డిజైన్‌ల విషయంలో భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాలు రావటంతో ఈ ప్రాజెక్టుకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
గత ఏడాది భాగస్వాముల మధ్య ఒప్పందాలు కుదరటంతో ప్రాజెక్టు మళ్లీ పట్టాలకెక్కింది. ఒప్పందంలో భాగంగా బజాజ్ ఆటో డిజైన్, డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్‌ను చేపట్టనుండగా రెనాల్ట్-నిస్సాన్‌లు మార్కెటింగ్, సేల్స్ బాధ్యతలను తీసుకోనున్నాయి. యుఎల్‌సిని 2,500 డాలర్ల ధరకే విక్రయించనున్నట్లు రెనాల్ట్ చైర్మన్,సిఇఒ కార్లోస్ ఘోస్న్ కంపెనీ ఎజిఎంలో ప్రకటించారా అని బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్‌ను అడుగగా అవునని సమాధానమిచ్చారు. భారత మార్కెట్లో లైట్ వెహికల్స్ విభాగంలో లబ్ది పొందటానికి బజాజ్ గ్రూప్‌తో సంయుక్తంగా అల్ట్రా లోకాస్ట్ కారును రెనాల్ట్-నిస్సాన్‌లు అభివృద్ధి చేయనున్నట్లు కార్లోస్ ఘోస్న్ గత శుక్రవారం తెలిపారు.
2008లో చిన్న కారును అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించిన ఈ కంపెనీలు ఆ తర్వాత దీని గురించి పట్టించుకోకపోవటంతో ప్రాజెక్టును రద్దు చేసుకున్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. గరిష్ఠ మైలేజీ, నిర్వహణా వ్యయం తక్కువగా ఉండే కారును రూపొందించాలనే బజాజ్‌ల కల 2012కు వాయిదా పడింది. ప్రస్తుతం బజాజ్ -రెనాల్ట్‌లు ప్రతిపాదిస్తున్న ధరలో టాటా నానో మాత్రమే లభిస్తోంది. 1.23 లక్షల నుంచి 1.72 లక్షల రూపాయల మధ్యలో మూడు వేరియంట్లలో నానో లభిస్తోంది.
ఈ స్థాయిలో ధరను మెయిన్‌టైన్ చేయడం టాటాల వల్ల కూడా సాధ్యం కావడం లేదు. ఉక్కు, రబ్బరు ధరలు గణనీయంగా పెరగడంతో తదనుగుణంగా విడిభాగాల ధరలు పెంచాలని వెండార్లు డిమాండ్ చేస్తున్నారు. దీనితో నానో ధర మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న ధరలో బజాజ్-రేనాల్ట్‌ల కారు మార్కెట్ ప్రవేశం చేస్తే సంచలనం సృష్టించడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.