కొలిక్కి రానున్న అంబానీ సోదరుల వివాదం
కేజీ బేసిన్ గ్యాస్‌పై త్వరలో సుప్రీం తీర్పు
స్టాక్ మార్కెట్లో భారీ స్పెక్యులేషన్
అంబానీ బ్రదర్స్ కేజీ బేసిన్ గ్యాస్ వివాదంపై సుప్రీం కోర్టు త్వరలో తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో కార్పొరేట్ రంగంతోపాటూ స్టాక్ మార్కెట్లలో పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. అన్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నేచురల్ రీసోర్సెస్ ( ఆర్ఎన్ఆర్ఎల్ ) షేర్లులో విపరీతమైన స్పెక్యులేషన్ సాగుతోంది.
దేశీయ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద వివాదమేకాకుండా దేశ ఇంధన వ్యవస్థను కూడా ఎంతగానో ప్రభావితం చేసే అంబానీ బ్రదర్స్ మధ్య సాగుతున్న కృష్ణాగోదావరి బేసిన్ గ్యాస్ కేసుపై సుప్రీం కోర్టు ఈ నెల 11 తేదీ లోగా తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసు విచారణలో పాలు పంచుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్టన్ మే11న పదవీ విరమణ చేయనున్నారు.
బాలకృష్ణన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణను డిసెంబర్ 18తో ముగించింది. ఐదేళ్ల పాటు సాగిన ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉండటం, ఈ కేసును విచారించిన బాలకృష్ణన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఈ నెల 11న విరమణ చేయనుండంతో స్టాక్ మార్కెట్లో ఈ కేసు తీర్పుపై భారీ స్పెక్యులేషన్ జరుగుతోంది.
ఏమిటీ వివాదం?
అంబానీ సోదరులు రిలయన్స్ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని పంచుకున్నప్పుడు గ్యాస్ పంపకం, రేటు విషయంలో ఇరు వర్గాలు కుదుర్చుకున్న ఒప్పందం చిలిచిలికి గాలివానై పెనువివాదంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్.. అనిల్ అంబానీ గ్రూపు అడాగ్‌కు చెందిన కంపెనీ ఆర్ఎన్ఆర్ఎల్‌కు 17ఏళ్ల పాటు రోజుకు 28ఎంసిఎంల గ్యాస్‌ను ఎంబిటియు 2.34 డాలర్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. కేజీ బేసిన్ గ్యాస్‌కు ప్రభుత్వం నిర్ధారించిన ధర 4.2 డాలర్లకంటే ఇది 44 శాతం తక్కువ.
కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాల్లో ప్రభుత్వం వాటా కూడా ఉండటంతోపాటు గ్యాస్ విక్రయ ధరను ప్రభుత్వం నిర్ణయించినందున గ్యాస్‌ను ఒప్పందం ధరకు సరఫరా చేయలేమని ఆర్ఐఎల్ తేల్చిచెప్పింది. సహజ వాయువు దేశ సంపద ఐనందున దానికి సంబంధించి కుదుర్చుకున్న కుటుంబ ఒప్పందాలు చెల్లవని భారత ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. గ్యాస్ పంపిణీ, ధర నిర్ణయం వంటి అంశాలపై ప్రభుత్వానిదే పూర్తి హక్కు అని ఎవరికి అనుకూలం సుప్రీం తీర్పు?
కేజీ గ్యాస్ పంపిణీ రేటు విషయంలో సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా రావచ్చన్న విషయంపై మార్కెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. గత వారంలో ఆర్ఐఎల్ షేరు విలువ 11.4 శాతం పడిపోగా, ఆర్ఎన్ఆర్ఎల్ షేరు విలువ 5 శాతం పెరిగింది. బలహీనంగా ఉన్న సోమవారంనాటి మార్కెట్లో కూడా రిలయన్స్ నేచురల్ షేరు 4 శాతం పెరగ్గా ఆర్ఐఎల్ షేరు 1 శాతం తగ్గింది. జిఎంఆర్, జివికె, ల్యాంకోలపై ప్రభావం
సుప్రీంతీర్పు ఆర్ఎన్ఆర్ఎల్‌కు అనుకూలంగా వస్తే ఇప్పటివరకు కేజీ బేసిన్ గ్యాస్‌ను వినియోగించుకుంటున్న జివికె, జిఎంఆర్, ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌లు ఇంధనం విషయంలో సంకట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని గోల్డ్‌మన్ శాష్ తన నివేదికలో పేర్కొంది. అప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ప్రభుత్వం మరిన్ని న్యాయపరమైన వివాదాల్లో ఇరుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది.
దేశీయ ఇంధన రంగంలోసంచలనం సృష్టిస్తున్న అంబానీ సోదరుల వివాదంపై సుప్రీం కోర్టు ఏ విధమైన తీర్పును వెలువరిస్తుందోనని కార్పొరేట్ రంగంతో పాటు స్టాక్ మార్కెట్లు ఆతృతతో ఎదురు చూస్తున్నాయి.
మధ్యేమార్గ తీర్పు
సుప్రీం తీర్పు ఆంబానీ బ్రదర్స్‌లో ఎవరికో ఒకరికి పూర్తిగా అనుకూలంగా ఉండే విధంగా ఉండక పోవచ్చునని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసు తీర్పు విషయంలో సుప్రీం మధ్యే మార్గం అవలంబించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కేజీ బేసిన్ పంపిణీ, ధర విషయంలో ప్రభుత్వం హక్కును పూర్తిగా సమర్థించే అవకాశం ఉందని, అయితే అదే సమయంలో ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించినందున ఆర్ఎన్ఆర్ఎల్‌కు న ష్ట పరిహారం చెల్లించమని తీర్పు వెలువరించే అవకాశం ఉందని అంటున్నారు.
దీని మూలంగా ప్రభుత్వంతో పాటు ఆర్ఐఎల్ ప్రయోజనాలకు భంగం వాటిల్లదని అదే సమయంలో అనిల్ అంబానీ కంపెనీకి నష్ట పరిహారం కింద వందల కోట్ల డాలర్లు లభించే అవకాశం ఉందని ఎనలిస్టులు అంటున్నారు. అయితే రిలయన్స్ పవర్ తన ప్లాన్‌ను మార్చుకుని ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో అడాగ్ గ్రూపు మొత్తం విద్యుత్ ప్లాన్లు తలకిందులవచ్చు.
ఆర్ఐఎల్‌కు అనుకూలమౌతుందా!
గ్యాస్ విషయంలో బొంబాయి హైకోర్టు పూర్తిగా ఆర్ఐఎల్‌కు వ్యతిరేకంగా ఉన్నందున, సుప్రీం తీర్పు ఇంతకంటే ఏమాత్రం మెరుగుగా ఉన్నా ఆర్ఐఎల్‌కు ప్లస్ అవుతుందని మరికొందరు ఎనలిస్టులుపేర్కొంటున్నారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను అనిల్ కంపెనీకి 4.2 డాలర్లకు సరఫరా చేయాల్సిన అవసరం లేదని సుప్రీం తీర్పునిస్తే ఆర్ఐఎల్ షేరు ఒక్కసారిగా పుంజుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ పవర్ షేరు విలువ భారీగా పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మార్కెట్ మాత్రం ప్రస్తుతం అనిల్ అంబానీ వైపే మొగ్గుచూపుతున్నట్లుగా ఉంది. గత వారంగా ఆర్ఐఎల్ షేరు పడిపోతుండగా, ఆర్ఎన్ఆర్ఎల్ షేరు పెరగుతుండటమే ఇందుకు నిదర్శనం.
ఒక వేళ ఆర్ఐఎల్‌కు పూర్తిగా వ్యతిరేకంగా సుప్రీం తీర్పు వచ్చినా ఆర్ఐఎల్ షేరు విలువ పై అది తాత్కాలిక ప్రభావం మాత్రమే చూపిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఆర్ఎన్ఆర్ఎల్‌కు గ్యాస్‌ను 2.34 డాలర్లకే ఇవ్వమని సుప్రీం తీర్పు నిస్తే ఆర్ఐఎల్ ఇపిఎస్ 7.5 శాతం తగ్గే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాష్ అంచనా వేస్తోంది. కేజీ బేసిన్ గ్యాస్‌ను 2.34 డాలర్లకు అనిల్ కంపెనీకి విక్రయించాల్సి వస్తే ఆర్ఐఎల్ వార్షిక ఆదాయం సుమారు 2700 కోట్ల రూపాయల మేరకు తగ్గేఅవకాశం ఉందని అంచనా.