కొనుగోళ్లవైపు ఎఫ్‌ఐఐల మొగ్గు
స్టాక్ మార్కెట్లో ఇదీ ఉభయుల తీరు
భారత కంపెనీలు విదేశీ సంస్థాగత పెట్టుబడుదార్ల(ఎఫ్‌ఐఐ)ను ఆకర్షిస్తూనే ఉన్నాయ్. ఆ ఆకర్ష మంత్రం అలా కొనసాగుతూనే ఉంది. 2009-10 నాలుగో త్రైమాసికంలోనూ అదే జరిగింది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయ్. ఇలా ఎఫ్‌ఐఐలు వరుసగా పెట్టుబడులను పెంచుకుంటూ పోవడం వరుసగా నాలుగో త్రైమాసికం కావడం గమనార్హం. అంటే గత ఆర్థిక సంవత్సరం మొత్తం ఎఫ్‌ఐఐల జోరు కొనసాగిందన్నమాట. చిన్న మదుపుదార్లు(రూ.1 లక్షలోపు పెట్టుబడులు పెట్టేవారు) మాత్రం సరిగ్గా ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండడం గమనార్హం. వీరు గత మూడు త్రైమాసికాలుగా తమ పెట్టుబడులను తగ్గించుకుంటూ వస్తున్నారు.
గణాంకాలు చెబుతున్న విషయాలివీ
మార్చి త్రైమాసికానికి గణాంకాలు విడుదల చేసిన 422 కంపెనీలను పరిశీలిస్తే అందులో 215 కంపెనీల్లో డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఎఫ్‌ఐఐల వాటా పెరిగింది. మార్చి 2009 త్రైమాసికంతో పోలిస్తే 253 కంపెనీల్లో వీరి వాటా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక చిన్న మదుపర్ల విషయానికొస్తే మార్చితో ముగిసిన 3 నెలల్లో వీరు 174 కంపెనీల్లో వాటా పెంచుకున్నట్లు కనపడుతోండగా.. ఏకంగా 238 కంపెనీల్లో వాటాల విక్రయాలకు పాల్పడినట్లు అర్థమవుతోంది. అంతక్రితం ఏడాది ఇదే మార్చిలో వీరు 266 కంపెనీల్లో లాభాలను స్వీకరించి కేవలం 154 కంపెనీల్లో వాటా పెంచుకున్నారు.
ప్రమోటర్లు సైతం
అంతక్రితం త్రైమాసికంతో పోల్చినా.. అంత క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంతో పోల్చినా ప్రమోటర్లు తమ వాటాలను కుదించేసుకున్నారు. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే మార్చిలో ప్రమోటర్లు 112 కంపెనీల్లో తమ హోల్డింగ్‌లను తగ్గించేసుకోగా.. కేవలం 73 కంపెనీల్లో మాత్రమే పెంచుకున్నారు. ఇక 2009 మార్చితో పోలిస్తే 115 కంపెనీల్లో పెంచుకుని.. 167 కంపెనీల్లో తగ్గించుకున్నారు. పెద్ద రిటైల్ ఇన్వెస్టర్లు(రూ.1 లక్ష కంటే ఎక్కువ హోల్డింగ్స్ ఉన్నవారు) మాత్రం మార్చి త్రైమాసికంలో 195 కంపెనీల్లో వాటాలు కొని.. 183 కంపెనీల్లో విక్రయించేశారు. అంతక్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో వీరు 237 కంపెనీల్లో వాటాలు అమ్మేసుకుని కేవలం 172లో వాటాలుకొన్నారు.
ఎందుకంటే
భారత మార్కెట్లపైన విదేశీ బ్యాంకులు, బ్రోకరేజీ సంస్థలు బుల్లిష్‌గా వ్యవహరించడం ప్రధానం కారణం. దీంతో ఎఫ్‌ఐఐలు తమ హోల్డింగ్స్ పెంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకేనేమో గత ఆర్థిక ఏడాది ఎఫ్‌ఐఐలు రూ.1.07 లక్షల కోట్లు(23 బిలియన్లు) మేర ఇక్కడి మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు.
* డాయిష్ బ్యాంక్ అయితే 2010లో సెన్సెక్స్ ఏకంగా 22,000 పాయింట్లకు దూసుకెళుతుందని చెబుతోంది. బలమైన ఆర్థిక రికవరీతో పాటు భారత కార్పొరేట్ల ఫలితాలు భేషుగ్గా ఉండడం వల్ల అంచనాలు సహేతుకమేనంటోంది.
* జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్‌మెంట్ వేల్యూనోట్స్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫిడెన్స్ సర్వే మార్చి-2010 ప్రకారం అటు మదుపర్లు.. ఇటు సలహాదార్లు ఈ ఏడాది జూన్‌కల్లా 18,000-19,000 పాయింట్లకు చేరుతుందని భావిస్తున్నారు.
