హైదరాబాద్, : రాష్ట్రంలో భూముల బూమ్ తుస్ మనడంతో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఐఐసీ) పునరాలోచనలో పడింది. గత ఐదేళ్లుగా రాష్ర్టంలో పారిశ్రామిక భూములకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏపీఐఐసీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టుపక్కల భూములను ఎకరానికి రూ.22 కోట్ల నుంచి రూ.24 కోట్లకుపైనే విక్రయించింది. రాష్ట్రంలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కంటే ఏపీఐఐసీ పరిశ్రమల పేరుతో నిర్వహించిన భూదందా అంతా ఇంతా కాదు. గతంలో వందల కోట్లలో ఉన్న సంస్థ టర్నోవర్ రియల్ బూమ్‌తో నాలుగు వేల కోట్లకు సమీపించింది. 2004 ముందు ఏపీఐఐసీ ల్యాండ్ బ్యాంక్ పట్టా, ప్రభుత్వ భూములతో కలిసి మొత్తంగా 48,579 ఎకరాలుంటే 2009-10 నాటికి ఇది లక్షా 30 వేల ఎకరాలకు దూసుకుపోయింది. అంటే దాదాపుగా గడిచిన ఆరేళ్లలో ఏపీఐఐసీ పరిశ్రమల మౌలిక సదుపాయాల పేరుతో 80 వేల ఎకరాలకుపైనే ప్రభుత్వ, పట్టా భూములు సేకరించడం విశేషం.
నీరుగారిన బూమ్..
ప్రస్తుతం రాష్ట్రంలో బూమ్ నీరుకారడంతో ఏపీఐఐసీ భూములకూ డిమాండ్ తగ్గి.. సదరు సంస్థ వెలవెలబోతున్నది. దీంతో గతంలో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కుల్లో ఎకరం రూ.60 లక్షలకుపైనే డిమాండ్ ఉంటే.. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం, ప్రత్యేక వాదం దృష్ట్యా పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి చోటుచేసుకుంది. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో పూర్వ వైభవం మళ్లీ సాధించడానికి ఏపీఐఐసీ భూముల విలువను తగ్గించి.. పెద్ద ఎత్తున రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించాలని అధికారులు తెరవెనుక వేగంగా కసరత్తు ప్రారంభించారు. త్వరలోనే దీనిపై సీఎంతో చర్చించించి, అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని ఏపీఐఐసీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మౌలిక సదుపాయాలపై..
తాజా ప్రతిపాదనల మేరకు ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కు ల్లో ఎకరం రూ.40 లక్షలకు దిగువనే ధరను నిర్ణయించవచ్చని తెలుస్తున్నది. త్వరలో సీఎం ఆధ్వర్యంలో జరగబోయే 2010-15 నూతన పారిశ్రామిక పాలసీ సమావేశంలో ఏపీఐఐసీ అధికారులు ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సందర్భంలో పక్క రాష్ట్రాల్లో ప్రసుత్తం పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై అనుసరిస్తున్న విధివిధానాలపైనా అధి కారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ద్వితీయ స్థాయి పట్టణా లైన వరంగల్, కాకినాడ, తిరుపతి, గుంటూరు తదితర చోట్ల ఏపీఐఐసీ పారి శ్రామిక పార్కుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక కార్యచరణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఈ నెలలో నిర్ణయం తీసుకుంటామని ఏపీఐఐసీ వర్గాలు తెలిపాయి.
చిన్న పరిశ్రమలకు ప్రత్యేక పార్కులు..
రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా విశాఖలో రెండు వేల ఎకరాల భూములను సేకరించడానికి ఏపీఐఐసీ సన్నాహాలు చేస్తున్నది. ప్రధా నంగా విద్యుత్, ఇంజనీరింగ్ కంపెనీల నుంచి డిమాండ్ పెరగడంతో ఏపీఐఐసీ భూసేకరణ పనులను వేగవంతం చేస్తున్నది. ప్రతి జిల్లాలోనూ చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కుల ఏర్పాటుపై ఏపీఐఐసీ దృష్టి సారించిందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తామని ఏపీఐఐసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయా అంశాలపై ముమ్మర కసరత్తు జరుగుతోంది.
