కాకినాడ: బార్జి మౌంటెడ్ పవర్ ప్లాంట్ (ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్) కాకినాడ సముద్రతీరంలో జిఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ప్రారంభించనుంది. స్థానిక యాంకరేజ్ పోర్టుకు, బోర్డు యార్డ్‌కు మధ్యలో భూమిని చదును చేయడమే కాక కొంత సముద్ర ప్రాంతాన్ని మట్టితో నింపారు. అలాగే ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో నాఫ్తాతో నిర్వహించే ఈ ప్లాంట్ కాకినాడలో గెయిల్ ఇండియా లిమిటెడ్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్‌తో విద్యుత్ ఉత్పాదన జరగనుంది. నాఫ్తా కంటే ఈ గ్యాస్ 10వ వంతు తక్కువ ధరకు సరఫరా కావడంతో విద్యుత్ తయారీ ఖర్చు బాగా తగ్గనుంది. సముద్రంలో తేలియాడే పవర్ ప్లాంట్‌గా పిలిచే దీనికి తనిర్బవీ పవర్ ప్రాజెక్ట్‌గా నామకరణం చేశారు.
ఒక ఓడ మీదగల ఈ 220 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను మరో షిప్ సహాయంతో కాకినాడ తీరానికి తీసుకురానున్నారు. ఏప్రిల్ మొదటి వారానికి కాకినాడ తీరం చేరుకొని ఈ పవర్ ప్లాంట్ నెలా, రెండు నెలల్లో విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుతుంది. ఈ విద్యుత్‌ను పవర్ గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ కోసం సముద్రంలో 70 ఎకరాలు, దానికి చేర్చి మరో 70 ఎకరాల్లో స్థలాన్ని చదును చేసి విద్యుత్ సరఫరాకు అనుకూలంగా తయారుచేశారు. ఈ పవర్ ప్లాంట్ దేశంలోనే మొట్టమొదటిది. 2001లో ఉత్పత్తి ప్రారంభమయిన ఈ పవర్ ప్లాంట్ ఇప్పటి వరకు మంగుళూరు సమీపంలోని గురుపుర దగ్గర సముద్రంలో నిర్వహిస్తూ వచ్చారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం మంగుళూరు పవర్ సప్లె కంపెనీకి, బెంగుళూరు పవర్ సప్లె కంపెనీకి సరఫరా చేశారు.
ఈ ఒప్పందం 2008 జూన్ 7వ తేదీతో ముగిసింది. అయితే 2009 ఏప్రిల్ నాటికి కాకినాడలో దీనిని ఏర్పాటు చేయాలని భావించనప్పటికీ ఇక్కడ స్థల సేకరణ జరగకపోవడం, అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయక పోవడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఈనెల 12వ తేదీన బయలుదేరవలసి ఉన్నప్పటికీ అక్కడ మత్స్యకారులు పవర్ ప్లాంట్ కోసం చదును చేసిన మట్టిని పూర్తిగా తొలగించే వరకు ఈ ప్లాంట్‌ను మార్పు చేసేందుకు వీలులేదని స్పష్టం చేయడంతో కొంత జాప్యం జరిగింది. దీంతో వారిని ఒప్పించి డ్రెడ్జింగ్ పనులు పూర్తిచేస్తామని హామీ ఇవ్వడంతో ఈ ప్లాంట్‌ను తరలించేందుకు అంగీకరించారు.
చివరికి ఈనెల 15వ తేదీన బయలు దేరిన ఈ ప్లాంటు పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం కాకినాడ చేరేందుకు 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. పర్యావరణానికి అనుకూలమైన ఈ ప్లాంట్ ఐఎస్‌ఓ 14001 సర్టిఫికేట్‌ను ఓహెచ్ ఎస్‌ఏఎస్-18001 సర్టిఫికేట్‌ను కూడా పొందింది.ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఐదు పవర్ ప్లాంట్‌లకు అదనంగా ఈ పవర్ ప్లాంట్ చేరడం వల్ల గ్రిడ్‌కు అదనంగా విద్యుత్ సరఫరా జరగనుంది.
ఈ కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సమస్యల పరిష్కారంలో ఈ బార్జి మౌంటెడ్ పవర్ ప్లాంట్ ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది. సెజ్‌లో భాగస్వామిగా వ్యవహరించే జిఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పవర్ ప్లాంట్ నిర్వహణ జరగనుంది. జిఎంఆర్ పవర్ గ్రూప్ చైర్మన్ బివిఎస్ రామ్ కాకినాడ తరలించే పవర్ ప్లాంట్‌కు ప్లాగ్ ఆఫ్ చేశారు. జిల్లాలో సమృద్ధిగా ఉన్న గ్యాస్ ద్వారా ప్రొడక్షన్ ప్రారంభించి ఈ బార్జి మౌంటెడ్ పవర్ ప్లాంట్ భవిష్యత్ విద్యుత్ అవసరాలు తీర్చడంలో ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది. దీంతో సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తుల కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి.