Saturday, March 20, 2010

సినీ పైరసీ విలువ 4,364 కోట్లు

దేశంలో సినీ పైరసీ విలువ రానురాను భారీ స్థాయిలో పెరిగిపోతోంది. దీంతో చిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లటమే కాకుండా, ఈ పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు.

2008 సంవత్సరంలో దేశ చిత్ర పరిశ్రమ పైరసీ విలువ 959 మిలియన్ డాలర్లు ( సుమారు 4,364 కోట్ల రూపాయలు)గా ఉన్నట్లు యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ అధ్యయనాలు వెల్లడించాయి.

పైరసీకి ప్రధానంగా థియేటర్లలో కామ్‌కార్డర్లను ఉపయోగించడమేనని మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా చైర్మన్ డాన్ గ్లిక్‌మ్యాన్ వెల్లడించారు. సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లలో వీటిని నిరోధించడానికి ప్రభుత్వ మద్దతు ఎంతైనా అవసరం ఉందన్నారు.

గత కొన్నేళ్ల కాలంలో దేశ పరిశ్రమ పటిష్టవంతమైన రెండంకెల వృద్ధి రేటును సాధించినట్లు టైమ్ వార్నర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హగ్ స్టీఫెన్స్‌పేర్కొన్నారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా 2008-09 సంవత్సరంలో 304 కోట్ల రూపాయల రాబడి సమకూరడమే కాకుండా 14,000 మందికి ఉపాధి లభించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఐదేళ్లలో 60 వేల కోట్లకు చిత్ర, టెలివిజన్ పరిశ్రమ
అటు సినిమాలు, ఇటు టెలివిజన్ చానళ్లు వీక్షించే ప్రేక్షకుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో దేశీయ చిత్ర, టెలివిజన్ పరిశ్రమ పరిమాణం కొన్నేళ్లలోనే సరికొత్త శిఖరాలకు చేరనున్నట్లు తాజా నివేదికలో వెల్లడయింది.

ప్రైస్‌వాటర్ హౌజ్ కూపర్స్ తాజాగా విడుదల చేసిన ఎకనామిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం వచ్చే ఐదేళ్ల కాలంలో భారత చిత్ర, టెలివిజన్ పరిశ్రమ పరిమాణం 60వేల కోట్ల రూపాయల స్థాయిని అధిగమించ నుందని స్పష్టం చేసింది.

2008-09 సంవత్సరంలో ఈ రెండింటి మూలంగా సమకూరిన రాబడి 35,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఓ వైపు కోట్లాది మందికి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ మరో వైపు 18 లక్షలకుపైగా మందికి ఉపాధి అవకాశాలను ఈ పరిశ్రమ కల్పిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు 28,305 కోట్ల రూపాయలను సమకూర్చుతోంది.

ప్రైజ్‌వాటర్ హౌజ్ కూపర్స్ నివేదికను విడుదల చేసిన సందర్భంగా మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా చైర్మన్ డాన్ గ్లిక్‌మ్యాన్ మాట్లాడుతూ.. ఈ నివేదిక చిత్ర, టీవీ పరిశ్రమ ప్రాధాన్యాన్ని మరో మారు చాటిచెప్పిందని, అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటులో కీలక పాత్రను గురించి వివరించినట్లు చెప్పారు. అయితే జడలువిప్పిన పైరసీ భూతం చిత్ర పరిశ్రమను పట్టిపీడిస్తోందని, దీనిని అంతమొందించడానికి ప్రభుత్వాలు క ఠినమైన చట్టాలను తీసుకురావాల్సి అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.