నిన్న ఎస్ అండ్ పి నేడు డిఅండ్ బి అంచనా
భారత్ ఆర్థికవ్యవస్థ వృద్ది రేటు ముందుకు దూసుకుపోతుందన్న అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2010-11 సంవత్సరంలో 8.3 శాతం వృద్ధిరేటును సాధించగలదని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ ఇండియా (డి అండ్ బి) అంచనా వేస్తోంది.
మరో అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్ భారత్ రేటింగ్‌ను ప్రతి కూలం నుంచి స్థిరత్వం(స్టేబుల్)కు పెంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వృద్ధిరేటును సాధిస్తుందని నివేదికను విడుదల చేసిన మరుసటి రోజు డి అండ్ బి భారత ఆర్థిక వ్యవస్థపై మెరుగైన అంచనాలు ప్రకటించటం విశేషం. పెట్టుబడులు భారీగా తరలి వస్తుండటంతోపాటు వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో భారత్ జిడిపి వృద్ధిరేటు 2010-11లో 8.3 శాతం మేరకు ఉండవచ్చునని డి అండ్ బి తన నివేదికలో తెలిపింది.
పారిశ్రామిక వృద్దే కీలకం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధిరేటు పెరుగుదలలో పారిశ్రామిక రంగందే కీలకపాత్రని డి అండ్ బి తెలిపింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పటిష్టంగా 10 శాతానికి పైగా వృద్ధిని కనబరుస్తుందని అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఇన్‌ఫ్రా రంగంలోకి మళ్లిస్తున్న భారీ పెట్టుబడులతోపాటు కార్పొరేట్ రంగంలో పెరుగుతున్న డిమాండ్, దేశీయంగా హెచ్చుస్థాయిలో పెరుగుతున్న వినియోగం పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదలకు దోహద పడతాయని తెలిపింది.
ద్రవ్యోల్బణంతోనే చిక్కు
అయితే ఇదే సమయంలో జోరుగా పెరిగి పోతున్న ద్రవ్యోల్బణం రేటు కలవరపెట్టే అంశమని పేర్కొంది. ఇది భారత్ వృద్ధిరేటుకు బ్రేకులు వేసే అవకాశం ఉందన్న ఆందోళనను వ్యక్తం చేసింది. పెరిగి పోతున్న వివిధ ఉత్పత్తుల ధర లకు కళ్లెం వేయలేకపోతే భారత్ వృద్ధి పథానికి భంగం కలిగే ప్రమాదం ఉందని డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ సంస్థ తన నివేదికలో తెలిపింది.
ఎస్అండ్‌పి ది అదే అంచనా
భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ, పటిష్ట వృద్ధి పధంలో సాగతుందనడానికి ఎస్‌పి రేటింగ్ పెంపుదల సూచన వంటిది కాగా, ఆ వాదనకు బలం చేకూర్చే విధం గా డి అండ్ బి నివేదిక ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు 2009-01లో 9.8 శాతంగా ఉండగా 2011 మార్చితో అంతమయ్యే సంవత్సరానికి 8.3 శాతంగా అంచనా వేస్తున్నారు.
2010-11 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధిరేటు 8 శాతం మేరకు ఉంటుందని, ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే ఇది అధికమని మాగత అంచనాలను మించి ఆర్థిక వృద్ధి రేటు ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్ క్రెడిట్ ఎనలిస్టు టకహిరా ఒగావా పేర్కొన్నారు.
అయితే ఇండియా రుణ భారం పట్ల ఎస్ అండ్ పి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ రుణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జిడిపిలో 80 శాతం దాకా ఉంటుందని, ప్రభుత్వ ఆదాయంలో 27 శాతం వడ్డీ చెల్లింపులకే పోతుందని ఎస్ అండ్ పి తెలిపింది.
ఇటీవలి కాలంలో బాగా హెచ్చు స్థాయికి చేరకున్న ద్రవ్యోల్బణం రేటు స్థూల ఆర్థిక వ్యవస్థ వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని ఒగావాపేర్కొన్నారు. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా టోకు ధరల సూచిక 10 శాతం మేరకు పెరిగింది. ప్రభుత్వం ద్రవ్యలోటును తగ్గించుకోగలిగితే భారత్ రేటింగ్‌ను మరింత పెంచే అవకాశం ఉందని ఎస్ అండ్ పి తెలిపింది.